logo

ట్రామాకేర్‌ కేంద్రం ఎంతెంత దూరం?

రోడ్డు ప్రమాదాలు జరిగితే ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి.. జన, వాహన సమ్మర్ధంతో రద్దీ పెరిగి ప్రమాదాలు జరిగి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి..

Published : 27 Mar 2023 04:57 IST

ఉమ్మడి జిల్లాలో మూడు ఎన్‌హెచ్‌లు
రాజీవ్‌ రహదారిపైనా రోజూ ప్రమాదాలు
ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి  

రామగుండం : కుందనపల్లి వద్ద ప్రమాదంలో నుజునుజ్జయిన కారు (పాత చిత్రం)

రోడ్డు ప్రమాదాలు జరిగితే ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి.. జన, వాహన సమ్మర్ధంతో రద్దీ పెరిగి ప్రమాదాలు జరిగి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి.. ప్రమాదాల్లో చిక్కుకున్న క్షతగాత్రులు, కొనఊపిరితో ఉండేవారికి అత్యవసర చికిత్సలను అందించేందుకు ట్రామాకేర్‌ కేంద్రాల్లో సేవలు అందించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఒక రాష్ట్ర, మూడు జాతీయ రహదారులు ఉండగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.. అయినా ఒక్క ట్రామా కేర్‌ సెంటరు లేకపోవడం గమనార్హం. ఈ రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర వైద్యం అందక కోల్పోయిన ప్రాణాలు ఎన్నో. ఇటీవల రాష్ట్ర బృందం తమిళనాడులో పర్యటించి అక్కడి ట్రామాకేర్‌ వ్యవస్థను పరిశీలించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పరిస్థితిపై కథనం..

ఇదీ పరిస్థితి

జగిత్యాల నుంచి వయా కరీంనగర్‌ - వరంగల్‌ ద్వారా ఖమ్మం వరకు ఉన్న జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌- 563) 248.8 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నప్పటికి ‘ట్రామా కేర్‌’ కేంద్రం లేదు. దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రులకు క్షతగాత్రులను తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్‌హెచ్‌-61 మహారాష్ట్ర నుంచి నిర్మల్‌ మీదుగా రాయికల్‌ వరకు అనుసంధానమై ఉండగా ఒక్క ట్రామాకేర్‌ కేంద్రం లేదు. ఇక ఎన్‌హెచ్‌-63 కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల మీదుగా వెళ్తుంది. ఇక్కడా అదే పరిస్థితి.

మంచిర్యాల నుంచి హైదరాబాద్‌ వరకు 240 కిలోమీటర్ల మేర విస్తరించిన రాజీవ్‌ రహదారిపైనా ఒక్క ట్రామాకేర్‌ కేంద్రం లేదు. జాతీయ, రాష్ట్ర రహదారులపై టోల్‌ గేట్లు నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థలు కేవలం క్షతగాత్రులను సమీప ప్రభుత్వాసుపత్రులకు తరలిస్తాయి. టోల్‌ప్లాజాల వద్ద ఒక్కొక్కటి చొప్పున అంబులెన్స్‌లు, రూట్‌ పెట్రోలింగ్‌ వాహనాలు, శిథిలాలను తొలగించేందుకు క్రేన్లను అందుబాటులో ఉంచారు. వీరు కేవలం సమీప ప్రభుత్వాసుపత్రికి క్షతగాత్రులను తరలించే బాధ్యత మాత్రమే తీసుకుంటున్నారు.

ట్రామాకేర్‌ కేంద్రం ఉంటే..

రహదారి ప్రమాదం జరిగిన వెంటనే ఆ బాధితుడికి గంటలోపు అందించే చికిత్స చాలా విలువైంది. ఈ మొదటి గంటను గోల్డెన్‌ అవర్‌ అంటారు. గంటలోపు వారికి చికిత్స అందిస్తే ప్రాణాపాయం తప్పే అవకాశాలున్నాయి. ఇందుకు ట్రామాకేర్‌ సెంటర్లు ఉపయోగపడతాయి.

ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్న బాధితులు, కొనఊపిరితో ఉండేవారిని దూరంగా ఉండే ఆసుపత్రికి వెళ్లే లోపే ప్రాణాలు విడుస్తున్నారు. అదే ట్రామాకేర్‌ కేంద్రాలు రహదారుల సమీపంలోనే ఉంటే అత్యవసర సేవలు అందుతాయి.

ట్రామాకేర్‌ కేంద్రాల్లో ఫిజీషియన్‌, న్యూరో, బోన్‌ సర్జన్లు అందుబాటులో ఉంటారు. ఎక్స్‌రే, అల్ట్రా, సీటీ స్కాన్‌, రక్తనిధి కేంద్రం, ఇతరత్రా అత్యవసర వైద్య సేవలు సదుపాయాలు ఉంటాయి.

జిల్లాసుపత్రుల్లో ఏర్పాటు చేసే అవకాశాలు

ట్రామాకేర్‌ కేంద్రాల ఏర్పాటుపై పెద్దపల్లి జిల్లా ఆస్పత్రుల పర్యవేక్షకులు శ్రీధర్‌ మాట్లాడుతూ తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ ట్రామా కేర్‌ మేనేజ్‌మెంట్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఒకవేళ కేంద్రాలు మంజూరైతే కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాసుపత్రులకు కేటాయించే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని