logo

ప్రగతి పథంలో పల్లెలు : మంత్రి కొప్పుల

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాలన్నీ ప్రగతిబాటలో నడుస్తున్నాయని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

Published : 27 Mar 2023 04:57 IST

సర్పంచి కృష్ణారావుకు ప్రశంసాపత్రం అందజేస్తున్న మంత్రి ఈశ్వర్‌

జగిత్యాల, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాలన్నీ ప్రగతిబాటలో నడుస్తున్నాయని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌లో ఆదివారం జాతీయ పంచాయత్‌ అవార్డు పురస్కారాల్లో భాగంగా జిల్లాస్థాయి ఉత్తమ గ్రామపంచాయతీ సర్పంచులకు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, తడి, పొడి చెత్త సేకరణ లాంటి పనులతో గ్రామాల రూపురేఖలే మారాయన్నారు. సర్పంచులు, అధికారులు సమన్వయంతో పనిచేయటం వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయని జాతీయస్థాయిలో 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ప్రకటిస్తే అందులో 19 మన రాష్ట్రానికి చెందినవి కావటం గర్వకారణమన్నారు. దేశంలోనే వందశాతం ఓడీఎఫ్‌ ప్లస్‌ సాధించిన రాష్ట్రం మనదేనని మంత్రి ఈశ్వర్‌ అన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందన్నారు. జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా మాట్లాడుతూ జిల్లా స్థాయిలో 9 అంశాల్లో 27 గ్రామపంచాయతీలు ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక కావటం అభినందనీయమన్నారు. జగిత్యాల, వేములవాడ ఎమ్మెల్యేలు డాక్టర్‌ ఎం.సంజయ్‌కుమార్‌, రమేష్‌బాబు, డీసీఎంఎస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీవైస్‌ఛైర్మన్‌ వొద్దినేని హరిచరణ్‌రావు, డీపీవో పి.నరేష్‌, జడ్పీటీసీలు ప్రశాంతి, నాగం భూమయ్య, బాదినేని రాజేందర్‌, బత్తిని అరుణ, ఎంపీపీ మెన్నేని స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.  

జిల్లాలో ఉత్తమ పంచాయతీలు  

దారిద్య్రం లేకుండా కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన పంచాయతీలుగా దేశాయిపేట(మేడిపల్లి), శంకర్‌రావుపేట(గొల్లపల్లి), డబ్బా(ఇబ్రహీంపట్నం)

సంపూర్ణ ఆరోగ్య పంచాయతీలుగా తాటిపల్లి(జగిత్యాల రూరల్‌), షెకల్ల(బుగ్గారం), గొర్రెగుండం(మల్యాల)

చైల్డ్‌ఫ్రెండ్లీ పంచాయతీలుగా అంబారిపేట(జగిత్యాల అర్బన్‌), కల్వకోట(మేడిపల్లి), పడకల్‌(వెల్గటూరు)

సమృద్ధి నీటి వనరులు గల పంచాయతీలుగా మద్దునూరు(బుగ్గారం), మంగెళ(బీర్‌పూర్‌), ఫకీర్‌ కొండాపూర్‌(ఇబ్రహీంపట్నం)

క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పంచాయతీలుగా నాగులపేట(కోరుట్ల), శాలపల్లి(పెగడపల్లి), నాచుపల్లి(కొడిమ్యాల)

సొంత వనరులు గల పంచాయతీలుగా దొంతాపూర్‌(ధర్మపురి), వర్షకొండ(ఇబ్రహీంపట్నం), మల్యాల మండలం కేంద్రం

సాంఘిక భద్రత గల పంచాయతీలుగా కలికోట(కథలాపూర్‌), చింతలపేట(మెట్‌పల్లి), సింగరావుపేట(రాయికల్‌)

ఉత్తమ పరిపాలన పంచాయతీలుగా నర్సింగాపూర్‌(జగిత్యాల రూరల్‌), సిర్‌పూర్‌(మల్లాపూర్‌), అల్లీపూర్‌(రాయికల్‌)

ఉమెన్‌ ఫ్రెండ్లీ పంచాయతీలుగా వల్లంపల్లి(మేడిపల్లి), మెట్ల చిట్టాపూర్‌(మెట్‌పల్లి), హిమ్మత్‌రావుపేట(కొడిమ్యాల)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు