logo

పంటరుణ పరిమితి పెంపు

వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు పంటపంటకూ పెరుగుతున్న తరుణంలో బ్యాంకుల ద్వారా రైతులకు అందించే పంటరుణ పరిమితిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Published : 27 Mar 2023 04:55 IST

జిల్లాలో రైతులకందనున్న అధిక సాయం
జగిత్యాల ధరూర్‌క్యాంపు, న్యూస్‌టుడే

వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు పంటపంటకూ పెరుగుతున్న తరుణంలో బ్యాంకుల ద్వారా రైతులకు అందించే పంటరుణ పరిమితిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో అన్నిరకాల పంటలకు 2023-24 వానాకాలం, యాసంగిల్లో పెంచిన రుణపరిమితిని అమలు చేయనుండగా జిల్లా రైతులకు 10 శాతం వరకు అధిక మొత్తం పెట్టుబడి రూపేణా దరిచేరనుంది.

అమలుపైనే అన్నదాతల ఆశలు

దాదాపుగా 123 రకాలైన పంటలతో పాటుగా పాడి, కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులు, చేపల పెంపకం యూనిట్లకు, పట్టుపురుగుల పెంపకానికీ రుణాలు ఇవ్వనున్నారు. జిల్లాలో గడచిన వానాకాలం, యాసంగిల్లో పంటరుణాలు, అనుబంధ రుణాల పంపిణీలో 79 శాతంవరకే లక్ష్యాన్ని చేరగలిగారు. వ్యవసాయ అనుబంధ టర్ము రుణాలను కూడా అందించటం లక్ష్యంగా ఉన్నా వీటి పంపిణీ 25 శాతం లోపేఉంది. కొన్ని బ్యాంకులు పంట రుణాలను బాగానే ఇస్తున్నా చాలా బ్యాంకులు నిర్దేశిత లక్ష్యంలో వెనుకంజలోనే ఉండటం రైతులకు సాగుసాయాన్ని దూరంచేస్తోంది.

సాగునీటి కల్పన, వ్యవసాయ యాంత్రీకరణ, పాడి పరిశ్రమ, ఎద్దులు, ఎడ్లబండ్లు, భూముల అభివృద్ధి, విత్తనోత్పత్తి, సేంద్రియసాగు రుణాల్లో చాలావరకు రైతులకు అందటంలేదు. 2023-24లో జిల్లాలో రైతులకు 2,902 కోట్లవరకు పంటరుణాలు, వ్యవసాయ అనుబంధ రుణాల పంపిణీ లక్ష్యంగా ఉండగా నెరవేర్చితేనే రైతులకు ఆర్థిక చేదోడుగా ఉంటుంది. బ్యాంకులు పంటరుణ పరిమితిని పెంచి ఇవ్వటంతో పాటుగా సక్రమంగా రుణాలు చెల్లించిన రైతులకు నిర్ధేశిత మొత్తం కన్నా 30 శాతం వరకు కూడా రుణాన్ని పెంచి ఇచ్చే వీలుంది.

జగిత్యాల జిల్లాలో నూతనంగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందినవారు, ఇదివరకు రుణం పొందనివారు దాదాపుగా 20 వేల మందివరకు ఉండగా వీరికీ రుణం అందించాలి. ప్రభుత్వం రూ.లక్ష వరకు గల పంటరుణాలను మాఫీ నిధులను విడుదల చేసినట్లయితే జిల్లా రైతులకు రూ.500 కోట్లవరకు చేతికందుతుంది. పంట రుణాలకు కేంద్రం రాయితీ ఇస్తుండగా రాష్ట్రప్రభుత్వం కూడా వడ్డీరాయితీని కొనసాగించటం, ఇదివరకున్న వడ్డీ బకాయిని రీఎంబర్స్‌మెంటుగా ఇవ్వటంద్వారా రైతులకు మరింత ఆర్థిక ఆసరా కలుగుతుంది.


ప్రభుత్వ పెంపు ప్రకారం..

పొన్న వెంకటరెడ్డి, లీడ్‌బ్యాంకు జిల్లా మేనేజర్‌, జగిత్యాల

నూతన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వం అనుమతించిన మేరకు పంటరుణ పరిమితిని పెంచి రైతులకు అధికమొత్తం అందించేలా చర్యలు తీసుకుంటాం. ఇంకనూ పంట రుణాలను పొందనివారు ఆయా మండలాల వ్యవసాయాధికారులను సంప్రదించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని