logo

గతంలో నష్టపోయిన రైతులను పట్టించుకోరా?

ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించడం సంతోషకరమేనని.. గతంలో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.

Published : 27 Mar 2023 04:55 IST

సీఎంకు రాసిన లేఖను చూపిస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

సారంగాపూర్‌, న్యూస్‌టుడే: ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించడం సంతోషకరమేనని.. గతంలో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం సారంగాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం అందిస్తున్నామని, ఇందుకు ప్రతి ఎకరా రూ.10 వేలు చెల్లిస్తామని సీఎం ప్రకటించారన్నారు. రైతులు ఎకరాకు పెట్టుబడి రూ.30వేలతోపాటు దిగుబడి సాధిస్తే మరో రూ.30వేల ఆదాయం సమకూరేదని కేవలం రూ.10వేలు అందించి వదిలేయడం సరికాదన్నారు. బీర్‌పూర్‌లోని రోళ్లవాగు ప్రాజెక్టు తెగిపోవడంతో వేలాది ఎకరాలలో ఇసుక మేటలు, కోతకు గురై నష్టపోతే స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్లు పరిశీలించి వెళ్లారని పరిహారం వీరికి వర్తించకపోవడం తీరుపై మండి పడ్డారు. ఇప్పటికే సీఎంకు పలు మార్లు లేఖ రాసినప్పటికీ స్పందన లేదని, మళ్లీ లేఖ పంపిస్తున్నాని, స్పందించి ప్రస్తుతం అందిస్తున్న పరిహారం వీరికి వర్తించేలా చూడాలని కోరారు. ఎంపీపీ మాసర్థి రమేష్‌, ఆకుల రాజిరెడ్డి, కోండ్ర రాంచందర్‌రెడ్డి, ఉరుమల్ల లక్ష్మారెడ్డి, కొక్కు గంగారాం, కర్నె అంజిరెడ్డి, పెద్దిరెడ్డి స్వామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని