logo

గ్రామీణ రహదారులు అస్తవ్యస్తం

మండలంలోని పలు గ్రామాల్లో గ్రామీణ రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. గుంతలమయంగా మారడంతో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Published : 27 Mar 2023 04:55 IST

ఇటీవల వర్షాలకు ఆర్నకొండ-రాగంపేట మధ్య గుంతల్లో నిలిచిన నీరు

చొప్పదండి, న్యూస్‌టుడే: మండలంలోని పలు గ్రామాల్లో గ్రామీణ రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. గుంతలమయంగా మారడంతో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్నాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతుందని ప్రజలు వాపోతున్నారు.

కాట్నపల్లి-కొత్తపల్లి మార్గం దుస్థితి

మండలంలోని ఆర్నకొండ నుంచి రాగంపేట, రెవెల్లి, పెద్దకుర్మపల్లి గ్రామాలకు వెళ్లే రహదారిపై గుంతలు ఏర్పడడంతో ఇటీవల పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పొలాల నుంచి నీరు రోడ్డుపైకి వచ్చి చేరుతుండడంతో గుంతలమయంగా మారుతుంది.

కాట్నపల్లి నుంచి కోనేరుపల్లి మీదుగా కొత్తపల్లి వెళ్లే ప్రయాణికులకు సరైన మార్గం లేకపోవడంతో వారు రుక్మాపూర్‌ నుంచి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఎస్సారెస్పీ ప్రధాన కాలువ పక్కన రోడ్డు ఉన్నా.. అది అధ్వానంగా మారింది. మోతె వాగు మీద నుంచి వంతెన ఏర్పాటు చేస్తే ప్రయాణం సుఖవంతంగా మారుతుంది.

భూపాలపట్నం నుంచి గొల్లపల్లి, నాగులపల్లి వెళ్లే రహదారికి కనీసం తారు రోడ్డు లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతుంది. ఇటు నుంచి ప్రయాణాలు చేయడం ఇబ్బందికరంగా మారుతుందని గ్రామస్థులు వాపోతున్నారు.

నిధులు లేక మూడేళ్లుగా చొప్పదండి నుంచి గుమ్లాపూర్‌ రహదారి నిర్మాణం సాగుతూనే ఉంది. గుమ్లాపూర్‌ మీదుగా రామడుగు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు.

గుమ్లాపూర్‌ నుంచి సాంబయ్యపల్లి, కాట్నపల్లి, కోనేరుపల్లి వెళ్లే దారి, భూపాలపట్నం నుంచి వెదురుగట్టుకు వెళ్లే దారి సైతం ప్రమాదకరంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని