logo

తల్లిదండ్రుల వెంటే కుమారుడు..

సాధారణంగా ఒక కుటుంబంలో ఒకరు మృతి చెందితేనే వారి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తారు.

Published : 27 Mar 2023 04:55 IST

కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి

వెంకటేశ్వర్‌రావు

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే : సాధారణంగా ఒక కుటుంబంలో ఒకరు మృతి చెందితేనే వారి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తారు. అలాంటిది ఒకరి తర్వాత, మరొకరు నాలుగు రోజుల వ్యవధిలో ముగ్గురు తల్లిదండ్రులతోపాటు కుమారుడు మరణించడంతో ఆ ఇంట విషాదం అలుముకుంది. మనుమడి మీద బెంగతో కుటుంబ యజమాని తీసుకున్న ఆత్మహత్య నిర్ణయం ఇంత దారుణానికి దారి తీసింది. ఈ హృదయ విదారకర ఘటన కరీంనగర్‌లోని కశ్మీర్‌గడ్డలో చోటు చేసుకుంది. నగర రెండో ఠాణా సీఐ లక్ష్మీబాబు కథనం ప్రకారం.. విశ్రాంత ఎంపీడీవో అన్నమరాజు మధుసూదన్‌రావు(81), భార్య సులోచనతో కలిసి సొంత భవనంలో కింద భాగంలో ఉండేవారు. మొదటి అంతస్తులో చిన్నకుమారుడు వెంకటేశ్వర్‌రావు(51) ఉండేవారు. ఆరు రోజుల కిందట వెంకటేశ్వర్‌రావు దంపతుల మధ్య గొడవ జరిగి.. అతని భార్య కొడుకును తీసుకొని పుట్టింటికి వెళ్లింది. తన మనువడు తమను వదిలి వెళ్లిపోయాడని, ఇంకా వస్తాడో రాడో అని మధుసూదన్‌రావు బెంగతో ఈనెల 21న ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అదే గదిలో ఉన్న అతని భార్య సులోచనకు సైతం మంటలు అంటుకున్నాయి. కేకలు విన్న వెంకటేశ్వర్‌రావు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా, అతనికీ మంటలు అంటుకున్నాయి. మధుసూదన్‌రావు ఘటనాస్థలిలో మృతి చెందగా, సులోచన మరుసటి రోజు ఆసుపత్రిలో మృతి చెందింది. ఆదివారం వారి కొడుకు సైతం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని