logo

మిగతా సొమ్ము ఎక్కడ?

కొండగట్టు అంజన్న ఆలయంలో 33.5 కిలోల వెండి ఆభరణాలు, ఇతర సామగ్రి చోరీకి గురైనట్లు శనివారం ఆభరణాల తనిఖీ అధికారి అంజనాదేవి ప్రకటించడంతో వాస్తవ వివరాలు వెల్లడయ్యాయి.

Published : 27 Mar 2023 04:55 IST

కొండగట్టులో చోరీకి గురైంది 33.5 కిలోలు
అధికారులు ఫిర్యాదులో పేర్కొంది 15 కిలోలు
పోలీసులు స్వాధీనం చేసుకుంది 17 కిలోలు
న్యూస్‌టుడే,మల్యాల

ద్వారాలకు అమర్చిన వెండి తొడుగులు  

కొండగట్టు అంజన్న ఆలయంలో 33.5 కిలోల వెండి ఆభరణాలు, ఇతర సామగ్రి చోరీకి గురైనట్లు శనివారం ఆభరణాల తనిఖీ అధికారి అంజనాదేవి ప్రకటించడంతో వాస్తవ వివరాలు వెల్లడయ్యాయి. ఫిబ్రవరి 24న అంజన్న గర్భగుడిలో జరిగిన భారీ చోరీ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దొంగలు 15 కిలోల వెండి ఆభరణాలు ఇతర సామగ్రి ఎత్తుకెళ్లినట్లు ఆలయ ఈవో వెంకటేశ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురు దోపిడీ దొంగలను పట్టుకుని వారి నుంచి 17 కిలోల వెండి ఆభరణాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్న చోరీ సొత్తు కంటే పోలీసులు అధికంగా సొమ్ము స్వాధీనం చేసుకోవడం పలువురిని విస్మయానికి గురిచేసింది. ఈ విషయమై ‘ఈనాడు’లో మార్చి 18న ‘ఆభరణాలకు లెక్కలేవ్‌!’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో శనివారం దేవాదాయశాఖ ఏడీసీ జ్యోతి, ఆభరణాల తనిఖీ అధికారి అంజనాదేవి ఆలయంలో విచారణ జరిపి 33.5 కిలోల వెండి ఆభరణాలు, ఇతర సామగ్రి చోరీకి గురైనట్లు వెల్లడించడంతో అధికారుల్లో అంతర్మథనం మొదలైంది. ఆలయంలో స్వామివారి ఆభరణాలు, ఇతర సామగ్రి వివరాలు అధికారుల వద్ద లేకపోవడంతో చోరీకి గురైన సొత్తు గురించి అంచనా వేయలేకపోయారని భక్తులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు చోరీకి గురైన స్వామివారి పూర్తి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించడంతో మిగిలిన వెండి సామగ్రి, ఆభరణాల రికవరీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయే అవకాశం ఉందని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మిగిలిన ఇద్దరు దొంగలు పట్టుబడినా చోరీకి గురైన సొత్తు పూర్తిస్థాయిలో స్వాధీనమయ్యే అవకాశాలు లేవని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు