logo

అప్రమత్తంగా ఉంటేనే అగ్నిప్రమాదాల నివారణ

నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే అగ్నిప్రమాదాలను నిలువరించడం సాధ్యమవుతుందని జిల్లా విపత్తుల నియంత్రణ అధికారి షేక్‌ ఖాజా కరీముల్లా పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖ గోదావరిఖని డివిజన్‌ మూడు జిల్లాలకు విస్తరించింది.

Updated : 27 Mar 2023 05:44 IST

న్యూస్‌టుడే, పెద్దపల్లి

నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే అగ్నిప్రమాదాలను నిలువరించడం సాధ్యమవుతుందని జిల్లా విపత్తుల నియంత్రణ అధికారి షేక్‌ ఖాజా కరీముల్లా పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖ గోదావరిఖని డివిజన్‌ మూడు జిల్లాలకు విస్తరించింది. పెద్దపల్లితో పాటు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలు ఈ డివిజన్‌ పరిధిలో ఉన్నాయి. విశాలమైన ఈ డివిజన్‌లో కేవలం ఐదు ఫైర్‌స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలోని మూడు స్టేషన్ల పరిధి ఎక్కువగా ఉండటం, ఇక్కడ పరిశ్రమలు, వాణిజ్యసంస్థలు విస్తరించడంతో భారీ ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఇతర జిల్లాల నుంచి వాహనాలను పిలిపించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వేసవి నేపథ్యంలో అగ్నిప్రమాదాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అగ్నిమాపక అధికారి షేక్‌ ఖాజా కరీముల్లాతో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి.

జిల్లాలో ఎలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి?

గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వరికొయ్యలను కాల్చేయడం ద్వారా మంటలు క్రమంగా విస్తరించే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల గడ్డివాములు, ఊరి చివర ఉన్న ఇళ్లకు ప్రమాదం ఉంటుంది. విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌లతో సైతం ప్రమాదాలు జరిగే అవకాశముంటుంది. వరి కొయ్యలను కాల్చివేయడం ద్వారా భూమిలోని సారం దెబ్బతింటుందని వ్యవసాయాధికారులు సైతం రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మా శాఖ తరఫున సైతం ప్రమాదాల గురించి వివరించేందుకు కార్యాచరణ చేపడతాం.

పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాల్లో భారీ ప్రమాదాలు జరిగిన సమయంలో నియంత్రణకు చర్యలు?

పరిశ్రమలు, వాణిజ్య ప్రాంతాల్లో తప్పనిసరిగా అగ్నిమాపక సాధనాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రమాదాలు జరిగిన సమయంలో మంటల నియంత్రణకు అగ్నిమాపక యంత్రాలను వినియోగించే విధంగా ఆయా ప్రాంతాల్లో పనిచేసే వారికి శిక్షణ అందిస్తున్నాం. అగ్నిమాపక వాహనం వచ్చే సమయానికి మంటలు విస్తరించకుండా ఇలాంటి చర్యలు ఉపకరిస్తాయి. గత నెలలో అందుగుపల్లిలో టపాసుల గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో సమీపంలోని బియ్యం మిల్లుకు మంటు విస్తరించకుండా నియంత్రించేందుకు అక్కడ ఏర్పాటు చేసిన అగ్నిమాపక వ్యవస్థ ఉపయోగపడింది.

అగ్నిమాపక శాఖలో సిబ్బంది, ఇతర సమస్యలు?

జిల్లాలోని మూడు కేంద్రాల్లో వసతులు మెరుగ్గానే ఉన్నాయి. సిబ్బంది కొరత వెంటాడుతోంది. గోదావరిఖని డివిజన్‌ పరిధిలోని ఐదు స్టేషన్లలో 38 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంథని, భూపాలపల్లిలో ఫైర్‌ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంథనిలో రెండు, పెద్దపల్లి, గోదావరిఖనిలో ఒక్కో డ్రైవర్‌ పోస్టు ఖాళీగా ఉంది. గోదావరిఖనిలో 4, మంథని, పెద్దపల్లిలో 6 చొప్పున ఫైర్‌మెన్‌ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.

ప్రశ్న: వేసవి నేపథ్యంలో అగ్నిప్రమాదాల నియంత్రణకు కార్యాచరణ?

జవాబు: జిల్లాలో అగ్నిప్రమాదాల నియంత్రణకు ముందస్తుగా అవగాహన కార్యక్రమాలు, ప్రచారం చేపడుతున్నాం. ప్రతి శుక్రవారం అగ్నిప్రమాదాలు జరగకుండా, జరిగితే తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరిస్తున్నాం. వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థల్లో ప్రమాదాలు జరిగితే ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే అంశంపైనే మాక్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాం. దీనివల్ల ప్రజలు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండేందుకు అవకాశం కలుగుతుంది.

వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణంలో ఎలాంటి ప్రమాణాలు పాటించాలి?

వాణిజ్య సముదాయాలు 15 మీటర్లు, నివాస గృహాలు 18 మీటర్ల ఎత్తు కలిగి ఉంటేనే అగ్నిమాపక శాఖ పరిధిలోకి వస్తాయి. జిల్లాలో ఇలాంటి ఎత్తైన వాణిజ్య సముదాయాలు లేవు. అపార్ట్‌మెంట్ల నిర్మాణ సమయంలో తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ నిర్దేశించిన ప్రమాణాలు పాటించే విధంగా పర్యవేక్షిస్తున్నాం. వాణిజ్య సముదాయాల్లో కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలపై వ్యాపారులు, అందులో పనిచేసే కార్మికులకు వివరిస్తున్నాం.

జిల్లాలో కొత్తగా అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయా?

ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో అగ్నిమాపక కేంద్రం పనిచేస్తుంది. పెరుగుతున్న ప్రమాదాల తీవ్రత నేపథ్యంలో ప్రతి మండలంలో ఒక్కో ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలున్నాయి. జిల్లాలోని ఎలిగేడు, జూలపల్లి మండలాలు చొప్పదండి స్టేషన్‌ పరిధిలో ఉన్నాయి. పెద్దపల్లి పరిధిలోని ధర్మారం మండలం దూరంగా ఉండట సమస్యగా మారింది. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని