logo

హర హర మహాదేవ.. శంభో శంకర

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తుల తాకిడి నెలకొంది.

Published : 27 Mar 2023 04:55 IST

ఆలయ ప్రాంగణంలో భక్తులు

వేములవాడ, న్యూస్‌టుడే: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తుల తాకిడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి రావడంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు కిటకిటలాడాయి. హర హర మహాదేవ.. శంభో శంకర అంటూ భక్తుల శివ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తుల రాకతో పట్టణంలోని వీధులు, ఆలయ పార్కింగ్‌ స్థలం సందడిగా మారాయి. ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలోని పరివార దేవతలను దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతి పాత్రమైన కోడె మొక్కులను చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షణ చేశారు. 15 వేల మందిపైగా స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

పుర వీధిలో ఊరేగిస్తున్న అధికారులు, అర్చకులు, భక్తులు


స్వామివారి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి దంపతులు

వేములవాడ : రాజన్నను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ దంపతులు ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. కల్యాణ మండపంలో వారికి ఆలయ స్థానాచార్యుడు భీమాశంకర్‌శర్మ, అర్చకులు వేద మంత్రాలతో వేదోశీర్వచనం చేశారు. ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్‌ స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు. అంతకు ముందు జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌ దంపతులకు అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి స్థానిక జడ్జి ప్రతీక్‌ సిహాగ్‌, ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్‌లు పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు.


నంది, గరుడ వాహనాలపై ఊరేగింపు

వేములవాడ :  వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీరామ నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివార్లకు నంది, గరుడ వాహనాలపై పెద్దసేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీపార్వతీ, రాజరాజేశ్వర స్వామివార్లు, లక్ష్మీ సమేత అనంత పద్మనాభస్వామివార్ల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించిన అనంతరం స్థానాచార్యుడు అప్పాల భీమాశంకర్‌ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను నంది, గరుడ వాహనాలపై ప్రతిష్ఠించి పుర వీధుల్లో ఊరేగించారు. ఆలయంలో ఉదయం అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు స్వామివార్లను దర్శించుకొని తరించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్‌, వేద పండితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని