logo

‘యువతను తప్పుదోవ పట్టిస్తున్న భాజపా’

మత విద్వేషాలతో  యువతను భాజపా తప్పుదోవ పట్టిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్‌.వీరయ్య విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్ర ఆదివారం సిరిసిల్లకు చేరుకుంది.

Published : 27 Mar 2023 04:55 IST

సిరిసిల్లలో ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు, కార్యకర్తలు

సిరిసిల్ల(విద్యానగర్‌), న్యూస్‌టుడే: మత విద్వేషాలతో  యువతను భాజపా తప్పుదోవ పట్టిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్‌.వీరయ్య విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్ర ఆదివారం సిరిసిల్లకు చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుంచి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిరిసిల్లలోని లేబర్‌ అడ్డా వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఛాయ్‌ విక్రయించినట్లే ప్రజల సంపదను కార్పొరేట్ శక్తులకు విక్రయిస్తున్నారని విమర్శించారు. భాజపా మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమం, మత సామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం సీపీఎం కృషి చేస్తోందన్నారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ప్రతి రోజు ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కాకుండా సిరిసిల్లకు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. భాజపా కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలను ఉపయోగించి ప్రతి పక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని పేర్కొన్నారు. అదాని, భాజపాల కంటే దేశద్రోహులెవరు లేరని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మరమగ్గాలు, జౌళి అభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్‌ బాబు, జయలక్ష్మి, జగదీష్‌, బాలకృష్ణ, జిల్లా కార్యదర్శి మూషం రమేశ్‌, యాత్ర రూట్ ఇన్‌ఛార్జి వెంకటేష్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, భీం ఆర్మీ రాష్ట్ర నాయకుడు దొబ్బల ప్రకాష్‌, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ : మతోన్మాద విధానాలను తిప్పికొట్టకపోతే దేశం మతరాజ్యంగా మారనుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీరయ్య పేర్కొన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలో సీపీఎం జన చైతన్య యాత్రను నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ద్విచక్ర వాహనాలతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆలయ ముందు కూడలి వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక అన్ని ధరలు పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు ఆశయ్య, స్కైలాబ్‌బాబు, విజయలక్ష్మి, అడివయ్యా, బాలకృష్ణ, జగదీష్‌, నాగరాజు, ఎల్లారెడ్డి, అశోక్‌, ప్రశాంత్‌, విమలక్క, శ్రీధర్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు