logo

లక్షలు వెచ్చించి.. నిర్లక్ష్యంగా వదిలేసి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో భక్తులకు మౌలిక వసతుల కల్పన కోసం మహా శివరాత్రి సందర్భంగా ఆలయ అధికారులు లక్షలాది రూపాయలు వెచ్చించారు.

Updated : 27 Mar 2023 05:47 IST

మూత్రశాలలకు తీయని తాళాలు
న్యూస్‌టుడే, వేములవాడ

పార్కింగ్‌ స్థలంలో తాళం వేసి ఉన్న స్నానాల గదులు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో భక్తులకు మౌలిక వసతుల కల్పన కోసం మహా శివరాత్రి సందర్భంగా ఆలయ అధికారులు లక్షలాది రూపాయలు వెచ్చించారు. ఆలయ పార్కింగ్‌ స్థలంలో మూత్రశాలలు, మరుగుదొడ్లు, స్నానాల గదులు, దుస్తులు మార్చుకునే గదుల వంటివి నిర్మించారు. అయితే అవి ఏ మాత్రం భక్తులకు ఉపయోగపడటం లేదు. వాటి నిర్వహణ చేయలేక అన్నింటికీ  తాళాలు వేయడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.

రాజన్న ఆలయంలో మరో మూడు రోజుల్లో జరిగే శ్రీరామకల్యాణోత్సవాలకు లక్షల సంఖ్య భక్తులు వస్తారు. అయితే వారికి ఇబ్బందులు తప్పేటట్లు లేదు. మరుగుదొడ్లు, మూత్రశాలలు వంటి వాటికి తాళాలు వేయడంతో భక్తులు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆలయ పార్కింగ్‌ స్థలంలో దాదాపు రూ.5 లక్షలు వెచ్చించి భక్తుల కోసం మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించారు. మరో రూ. 10 లక్షలు వెచ్చించి స్నానాల గదులు, దుస్తులు మార్చుకునే గదులు వంటివి నిర్మించినప్పటికి ప్రస్తుతం అవన్నీ నిరుపయోగంగా మారాయి. జాతర సమయంలో భక్తుల కోసం మూడు రోజులు తెరిచి ఉంచారు. ఆ తరవాత వాటన్నింటికి తాళం వేశారు. అప్పటి నుంచి అవి తెరిచిన దాఖలాలు లేవు. గతంలో ఆలయంలో శని, ఆది, సోమవారాల్లో రద్దీ ఉండేది. ప్రస్తుతం ఏ రోజు చూసినా వేలాది మంది తరలి వస్తున్నారు. వీరు పార్కింగ్‌ స్థలంలో వాహనాలు నిలిపి స్వామివారి దర్శనానికి వెళ్తుంటారు. ఈ ప్రాంతంలోని మూత్రశాలలు, మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉండటంతో భక్తులు బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మహిళల బాధలు వర్ణణాతీతం.

నిరుపయోగంగా దుస్తులు మార్చుకునే గది

పార్కింగ్‌ స్థలంలో...

స్వామివారి దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. వీరు ఎక్కువగా పార్కింగ్‌ స్థలంలో వాహనాలు నిలిపి అక్కడే బస చేస్తారు. అయితే ఆలయ పార్కింగ్‌ స్థలంలో మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా ఆలయ అధికారులు మూత్రశాలలు, మరుగుదొడ్లు తెరవడం లేదు. దీంతో అధికారుల తీరుపై భక్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. సోమ, ఆది వారాల్లో పార్కింగ్‌ స్థలం మొత్తం భక్తుల వాహనాలతో నిండిపోతుంది. కోడె మొక్కుల క్యూలైన్‌ పార్కింగ్‌ స్థలం నుంచి కొనసాగుతుంది. ఇంత మంది వస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.  ఏటా రూ.కోట్లలో ఆదాయం సమకూరుతున్నా భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పార్కింగ్‌ స్థలంలోని స్నానాల గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లను తెరవాలని భక్తులు కోరుతున్నారు.


సిబ్బందిని ఏర్పాటు చేస్తాం

నర్సయ్య, శానిటేషన్‌ పర్యవేక్షకుడు,రాజన్న ఆలయం

పార్కింగ్‌ స్థలంలోని మూత్రశాలలు, మరుగుదొడ్లు, స్నానాల గదులను భక్తుల సౌకర్యం కోసం తెరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రెండు మూడు రోజుల్లో నిర్వహణ చర్యలు చేపట్టేందుకు సిబ్బందిని ఏర్పాటు చేస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు