logo

తీసుకున్నది కొందరు.. చెల్లింపులు అందరికి

స్త్రీనిధి ద్వారా మంజూరైన రుణాన్ని కొంత మంది తీసుకోనప్పటికీ గతంలో పేరుకుపోయి బకాయి పడ్డ మహిళలకు చెల్లించడంతో మహిళా సంఘాల్లో వివాదం ఏర్పడింది.

Published : 27 Mar 2023 04:55 IST

అధికారుల నిర్వాహకంతో మహిళా సంఘాల్లో ఆందోళన

సారంగాపూర్‌, న్యూస్‌టుడే: స్త్రీనిధి ద్వారా మంజూరైన రుణాన్ని కొంత మంది తీసుకోనప్పటికీ గతంలో పేరుకుపోయి బకాయి పడ్డ మహిళలకు చెల్లించడంతో మహిళా సంఘాల్లో వివాదం ఏర్పడింది. బీర్‌పూర్‌ మండల కేంద్రంలోని 9 మహిళా సంఘాలకు 2017లో స్త్రీనిధి ద్వారా రుణాలు మంజూరు చేశారు. ఇందులో కొంత మంది మహిళలు రుణాలు తమకు అవసరంలేదని తిరస్కరించారు. అవసరంలేకుండా మంజూరైన రూ.14.72 లక్షలు తిరిగి స్త్రీనిధిలో జమ చేయాల్సి ఉండేది. అలా కాకుండా గతంలో తీసుకున్న మహిళల రుణాల కింద జమ చేశారు. ఇందులో కొంత మంది అప్పటికే డబ్బులు చెల్లించి ఉండగా మరి కొంత మంది బకాయిలు ఉన్నాయి. ప్రస్తుతం స్త్రీనిధి అధికారులు పెండింగ్‌లో ఉన్న బకాయిల ఆధారంగా మహిళా సభ్యులకు నోటీసులు జారీ చేశారు. రుణం తీసుకోని వారు కొందరు ఉండగా మరి కొంత మంది రుణం చెల్లించినప్పటికీ బకాయి ఉండడమేంటని మహిళలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంజూరైన డబ్బులను తిరిగి స్త్రీనిధిలో జమ చేయకుండా అందరికి కలిపి రుణ బకాయి(కిస్తీ) కింద జమ చేసుకోవడంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘాల్లో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయిలో అధికారులు విచారణ చేపట్టాలని మహిళలు కోరుతున్నారు. ఈ విషయంపై స్త్రీనిధి రీజినల్‌ మేనేజర్‌ను వివరణ కోరగా విచారణ కొనసాగిస్తున్నామని, ఏప్రిల్‌ మొదటి వారంలో పూర్తి వివరాలు తెలుపుతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని