logo

సాన పడితే పంచ్‌ పడుద్ది

బాక్సింగ్‌ రింగులో పంచ్‌ పవర్‌ చూపించాలంటే ఎంతో ధైర్య సాహసాలు ఉండాలి. ప్రత్యర్థుల ముఖాన్ని లక్ష్యంగా చేసుకుని పిడిగుద్దుల వర్షం కురిపించి పాయింట్లు సాధించాలి.

Published : 27 Mar 2023 05:03 IST

నిఖత్‌, నీతు, స్వీటీ, లవ్లీనా స్ఫూర్తితో రాణిస్తాం
జిల్లా యువ బాక్సర్ల మనోగతం

న్యూస్‌టుడే, కరీంనగర్‌ క్రీడా విభాగం, కొత్తపల్లి

బాక్సింగ్‌ రింగులో పంచ్‌ పవర్‌ చూపించాలంటే ఎంతో ధైర్య సాహసాలు ఉండాలి. ప్రత్యర్థుల ముఖాన్ని లక్ష్యంగా చేసుకుని పిడిగుద్దుల వర్షం కురిపించి పాయింట్లు సాధించాలి. ఈ ఆటలో రాటుదేలాలంటే ఆత్మస్థైర్యం అవసరం. అలా ఉన్నవారే ఇటు వైపు వస్తారు. జిల్లాలో సుమారు 50 మంది యువకులు, 10 మంది యువతులు ఈ ఆటలో సాధన చేస్తున్నారు. శని, ఆదివారాల్లో మహిళా నిఖత్‌ జరీన్‌, నీతు గాంగాస్‌, స్వీటీ బూర, లవ్లీనా మహిళా ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్లుగా నిలిచారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రత్యర్థులను మట్టి కరిపిస్తామని జిల్లా యువ బాక్సర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.


సౌకర్యాలు కల్పిస్తే...

రీంనగర్‌ జిల్లాలోని అంబేడ్కర్‌ స్టేడియంలో బాక్సింగ్‌ సాధన చేసేందుకు కనీసం రింగు కూడా లేదంటే దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. సుమారు 60 మంది కోచ్‌ లేకుండానే సాధన చేస్తూ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. క్రీడా శాఖ కోచ్‌ను ఏర్పాటు చేసి అంబేడ్కర్‌ స్టేడియంలో రింగును ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయవచ్చు. క్రీడా శాఖ గ్లౌజులు, కిట్‌ బ్యాగులు అందించాలని బాక్సర్లు కోరుకుంటున్నారు. గతేడాది కరీంనగర్‌ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ స్టేడియంలో నిర్వహించిన వేసవి ఉచిత శిక్షణ శిబిరంలో 90 మంది చిన్నారులు శిక్షణ పొందారంటే ఆ ఆటపై మక్కువ ఉందని అర్థమవుతుంది.


గతేడాది నుంచి సాధన..

- హరిణి శ్రీ, 6వ తరగతి, ఎలగందల్‌ మోడల్‌ స్కూల్‌

నాకు బాక్సింగ్‌ అంటే చాలా ఇష్టం. అందుకే గతేడాది వేసవి శిబిరంలో శిక్షణ తీసుకొని అప్పటి నుంచి సాధన చేస్తున్నాను. పంచులు, బాక్సింగ్‌ మెలకువలు నేర్చుకున్నాను. ప్రస్తుతం సంపత్‌కుమార్‌, పృథ్వీరాజ్‌ వద్ద మెలకువలు నేర్చుకుంటున్నా. బాక్సింగ్‌లో నిఖత్‌ జరీన్‌, నీతు, స్వీటీలా ప్రపంచ ఛాంపియన్‌ కావాలని ఉంది.


రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నా..

- కె.భార్గవి, డిగ్రీ, తృతీయ సంవత్సరం

నిఖత్‌ జరీన్‌ రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ సాధించడం సంతోషంగా ఉంది. ఆమెను ఆదర్శంగా తీసుకొని సాధన చేస్తున్నాను. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో, పెద్దపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో పాల్గొన్నాను. మన దేశానికి బంగారు పతకాలు తీసుకురావాలనేది నా ముందున్న లక్ష్యం.


ప్రోత్సాహం అవసరం

- కె.సంపత్‌ కుమార్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి

తెలంగాణకు చెందిన బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ప్రపంచ మహిళా బాక్సింగ్‌ ఛాంపియన్‌గా నిలవడం చాలా సంతోషం. ఆమె స్ఫూర్తితో గతేడాది 90 మంది పిల్లలు శిక్షణ పొందారు. మన వద్ద పిల్లల్లోనూ ప్రతిభ దాగి ఉంది. వారికి మంచి తర్ఫీదు ఇచ్చి.. ప్రోత్సహిస్తే మంచి ఆటగాళ్లను తయారు చేయవచ్చు. కరీంనగర్‌ నగరంలో రింగు ఏర్పాటు చేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు