logo

మంటలు.. అడ్డుకోవడంలో ఆటంకాలు

జనాభా పెరుగుతుండడంతో నగరాలు, పట్టణాలు విస్తరిస్తున్నాయి. అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కానీ అగ్నిమాపక కేంద్రాలను మాత్రం విస్మరిస్తోంది. అసలే వేసవి కాలం..

Published : 28 Mar 2023 05:06 IST

సమస్యలతో సతమతవుతున్న అగ్నిమాపక శాఖ
కొన్నేళ్లుగా పెరగని కేంద్రాలు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం, నేరవార్తలు

పెద్దపల్లిలోని బాణసంచా గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదం

నాభా పెరుగుతుండడంతో నగరాలు, పట్టణాలు విస్తరిస్తున్నాయి. అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కానీ అగ్నిమాపక కేంద్రాలను మాత్రం విస్మరిస్తోంది. అసలే వేసవి కాలం.. ప్రమాదాలకు ఆస్కారం అధికంగా ఉంటుంది. గతంలో ఉన్న కేంద్రాలతోనే నెట్టుకొస్తున్నారు. ఉన్నవి కూడా సమస్యలతో సతమతమవుతున్నాయి. ఒకేసారి రెండు, మూడు చోట్ల ప్రమాదాలు జరిగితే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి.

కరీంనగర్‌లో సిబ్బంది కొరత..

కరీంనగర్‌ జిల్లాలో ఐదు ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలు కొనసాగుతున్నాయి. పెద్ద నగరంలో సాధారణంగా రెండు వాహనాలు ఉండాల్సి ఉండగా, ఒక్క దాంతోనే సరిపెడుతున్నారు. భారీ అగ్నిప్రమాదం జరిగితే చొప్పదండి, మానకొండూర్‌ కేంద్రాల నుంచి వాహనాల సహాయం పొందుతున్నారు. 22 మందికిగాను 14 మంది మాత్రమే పని చేస్తున్నారు. కొన్నిసార్లు నగర పాలక సంస్థ ట్యాంకర్లను వినియోగించాల్సి వస్తోంది. ఇక చొప్పదండిలో సొంత భవనం లేక పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో నిలుపుతున్నారు. భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఆరు నెలలైనా పనులు ప్రారంభం కాలేదు. జమ్మికుంటలో ఒకే డ్రైవర్‌ ఉన్నారు. హుజూరాబాద్‌లో 30 ఏళ్లుగా పాత భవనంలోనే సేవలు కొనసాగుతున్నాయి.

పెద్దపల్లి జిల్లాలో మరిన్ని అవసరం

పెద్దపల్లి, గోదావరిఖని, మంథనిలలో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ సిబ్బంది కొరత ఉంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రమాదం సంభవిస్తే పెద్దపల్లి నుంచి వాహనాలు వెళ్లాల్సి వస్తోంది. ధర్మారం, సుల్తానాబాద్‌ ప్రాంతాల్లో కొత్త కేంద్రాలు ఏర్పాటు చేస్తే జూలపల్లి, ఎలిగేడ్‌, కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల మండలాలకు ఉపయోగంగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. పెద్దపల్లిలోనూ మరో వాహనం అవసరముంది. మంథనిలో ఉన్నా.. అత్యవసర సమయంలో జయశంకర్‌ భూపాలపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది.

40 కిలోమీటర్ల వరకు సిరిసిల్ల వాహనమే..

సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ కేంద్రాల్లో రెండు కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో తరచూ గడ్డివాములు దగ్ధమవుతుంటాయి. మారుమూల ప్రాంతాల్లో ప్రమాదం జరిగితే వాహనం వెళ్లే వరకు నష్టం జరిగిపోతుంది. 40 కిలోమీటర్ల దూరం ఉన్న గంభీరావుపేటకు సైతం సిరిసిల్ల నుంచే వెళ్లాల్సిన పరిస్థితి. జిల్లాలో మరో కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంది.

కోరుట్లలో ఏర్పాటు చేయాలి..

జగిత్యాల జిల్లాలో సిబ్బంది కొరత ఉంది. జగిత్యాల, మెట్పల్లి, ధర్మపురి ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. పురపాలక సంఘాల సంఖ్య పెరిగింది. జిల్లా కూడా విస్తరించింది. కోరుట్లలో ఏర్పాటు చేయాలి. ఉన్నవి సరిపోవడం లేదు. గతంలో రాయికల్‌లో ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో రెండేళ్లు కొనసాగించి తరువాత మూసివేశారు. ఇక్కడ కొత్త కేంద్రం ఏర్పాటు చేస్తే పరిసర ప్రాంతాల వారికి ఉపయోగకరంగా ఉంటుంది.  


* గతేడాది సెప్టెంబరులో వారం వ్యవధిలో నగర సమీపంలోని శ్రీపురంకాలనీ, బొమ్మకల్‌ బైపాస్‌ మార్గంలో ఉన్న గన్నీ సంచులు గోదాంలో గతేడాది అగ్నిప్రమాదాలు జరిగాయి. కరీంనగర్‌లో ఒకే వాహనం ఉండటంతో మంటలను అదుపు చేయడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. మానకొండూర్‌ వాహనంపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది.


2023 మార్చి 22: కరీంనగర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రధాన కార్యాలయంలో విద్యుదాఘాతం జరిగి సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లింది. ఫైర్‌ సిబ్బంది తక్షణం స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.


కరీంనగర్‌లో రెండో వాహనం ఏర్పాటుకు ప్రతిపాదనలు
-వెంకన్న, కరీంనగర్‌ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి

కరీంనగర్‌ నగరం విస్తరించింది. సమీప మండలాలకు సైతం ఉన్న ఒక్క వాహనం వినియోగించాల్సి వస్తోంది. ఒకే సారి రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగితే అత్యవసరంగా మరో వాహనం ఉండాల్సి ఉంది. స్మార్ట్‌సిటీలో తప్పనిసరిగా మరో వాహనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నాం. సిబ్బందితోపాటు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని