logo

గొలుసుకట్టు.. మద్యం మత్తు

జిల్లాలో కల్తీ మద్యం దందా జోరుగా సాగుతోంది. మద్యం దుకాణాల్లో నిర్వాహకులు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. టెండర్లలో దుకాణాలు దక్కించుకున్న మద్యం వ్యాపారులు అక్రమదందాకు తెరతీస్తున్నారు.

Published : 28 Mar 2023 05:25 IST

జిల్లావ్యాప్తంగా జోరుగా కల్తీ దందా

బొంపల్లి వద్ద కిరాణ దుకాణం నుంచి మద్యం కొంటున్న వ్యక్తి

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి: జిల్లాలో కల్తీ మద్యం దందా జోరుగా సాగుతోంది. మద్యం దుకాణాల్లో నిర్వాహకులు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. టెండర్లలో దుకాణాలు దక్కించుకున్న మద్యం వ్యాపారులు అక్రమదందాకు తెరతీస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి గ్రామాల్లో పదుల సంఖ్యలో గొలుసు దుకాణాలు ఏర్పాటు చేయిస్తున్నారు. 24 గంటల్లో దుకాణా విక్రేతల నిద్ర సమయం మినహా వేళాపాళా లేకుండా కిరాణా దుకాణాల్లోనే అనధికారికంగా గొలుసు(బెల్ట్‌) దుకాణాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు వైన్స్‌ దుకాణా యజమానులు అక్రమ నిల్వలు, అస్తవ్యస్తంగా ఆదాయ వ్యయాల నిర్వహణ, పర్మిట్‌ రూమ్‌లలో అధిక ధరలు, పండగ, ప్రత్యేక రోజుల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరల్లో విక్రయాలు చేస్తున్నారు. ప్రముఖ మద్యం బ్రాండ్లకు సంబంధించిన బాటిళ్లను తెరిచి అందులో నీరు పోసి తిరిగి యథావిధిగా ప్యాకింగ్‌ చేస్తూ కల్తీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


నిబంధనలు చిత్తు

* ఆబ్కారీ, పోలీసు శాఖల అధికారులకు ప్రతి మద్యం దుకాణం నుంచి నెలనెలా మామూళ్లు వెళుతుండటంతోనే దర్జాగా కల్తీ మద్యం దందా, బెల్ట్‌ దుకాణాల నిర్వహణ చేపడుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మద్యం దుకాణాదారులు ప్రత్యేక సెలవు దినాల్లోనూ అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నా.. ఈ యంత్రాంగం తనిఖీలు చేయడం లేదు.

* మద్యం గ్రామాల్లో ఎప్పుడుపడితే అప్పుడు లభిస్తుండటంతో చాలా మంది సంపాదించిన డబ్బును మద్యం కొనుగోళ్లకు ఖర్చు చేస్తున్నారు. డబ్బు లేకపోతే ఇంట్లో ఉండే వస్తువులు విక్రయించి తాగుడుకు బానిసవుతున్నారు.

* మద్యం దుకాణాల టెండర్లు 2021 సంవత్సరం నవంబర్‌లో నిర్వహించారు. ఇదే ఏడాది డిసెంబర్‌ 1 నుంచి 77 దుకాణాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. గొలుసు దుకాణాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ప్రభుత్వ పరంగా వీటికి అనుమతులు కూడా అవసరం లేకుండా పోవడంతో విచ్చలవిడిగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం నిల్వలతో కలిపి కల్తీ చేస్తూ మద్యం విక్రయిస్తున్నారు. రాత్రయ్యిందంటే మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. వీరి ఆగడాలతో పరస్పరం గొడవలు నిత్యకృత్యమవుతున్నాయి.

* నిర్వాహకులు ఏకంగా పెద్దపల్లిలోని మద్యం దుకాణాల నుంచి కల్తీ మద్యాన్ని తీసుకెళ్లి మారుమూల ప్రాంతాల్లో ఉండే తమ గొలుసు దుకాణాల్లో విక్రయిస్తున్నప్పటికీ ఏమీ తెలియనట్లుగా ఆబ్కారీ పోలీసులు తనిఖీలు చేయకుండా ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో తమ గొలుసు దుకాణాల సంఖ్యను పెంచేందుకు వ్యాపారులు అన్నీ వనరులు సిద్ధం చేసుకుంటున్నారు.


ఇక్కడివారు పట్టించుకోక..

గత ఏడాది మార్చిలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ మద్యం దుకాణంలో ఆకస్మికంగా హైదారాబాద్‌ ఆబ్కారీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల బృందం తనిఖీలు చేసి ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన మద్యం నమునాలను సేకరించి ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించారు. మద్యంలో నీళ్లు, ఇతరత్రా తక్కువ ధరలకు వచ్చే చీప్‌లిక్కర్‌ వంటివి కలుపుతూ కల్తీకి పాల్పడుతున్నట్లు వారి పరీక్షల్లో తేలింది. వెంటనే ఆ మద్యం దుకాణాన్ని సీజ్‌ చేశారు. జిల్లావ్యాప్తంగా ఇలాగే మద్యం దుకాణాల్లో పెద్దఎత్తున కల్తీలు జరుగుతున్నట్లు పలుమార్లు జిల్లా ఆబ్కారీశాఖకు ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు మామూళ్ల ‘మత్తు’లో పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.


ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
- మహిపాల్‌రెడ్డి, జిల్లా ఆబ్కారీశాఖ పర్యవేక్షకులు

గత ఏడాది తనిఖీలు చేపట్టాం. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ఎలాంటి ప్రత్యేక తనిఖీలు చేపట్టలేదు. ఎవరైనా ఆధారాలతో అక్రమ మద్యం నిల్వలు, విక్రయాలు, కల్తీలకు పాల్పడినట్లు ఫిర్యాదు చేస్తే తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు