logo

యార్డు వెలుపల కాయల సేకరణ వద్దు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్యార్డు ఆధ్వర్యంలోని చల్‌గల్‌లోని మామిడి మండీ పరిధిలో ఈ సీజనులో పలువురు వ్యాపారులు మామిడి కాయల కొనుగోలును యార్డు వెలుపలగల షెడ్లలో ప్రారంభించారు.

Published : 28 Mar 2023 05:25 IST

తప్పనిసరిగా మండీలోనే జరపాలంటున్న అధికారులు
న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు

యార్డువెలుపల షెడ్లలో పనులు చేసుకుంటున్న దృశ్యం

జగిత్యాల వ్యవసాయ మార్కెట్యార్డు ఆధ్వర్యంలోని చల్‌గల్‌లోని మామిడి మండీ పరిధిలో ఈ సీజనులో పలువురు వ్యాపారులు మామిడి కాయల కొనుగోలును యార్డు వెలుపలగల షెడ్లలో ప్రారంభించారు. మామిడి మార్కెట్లో రూ.6 కోట్ల వ్యయంతో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నాలుగు భారీ షెడ్లు అందుబాటులోకి రావటం, చల్‌గల్‌ వాలంతరి ప్రదర్శన క్షేత్రం నుంచి తీసుకున్న అదనపు 10 ఎకరాల స్థలంలోనూ మామిడి కాయల క్రయవిక్రయాలను చేపట్టనుండటంతో ఈ సీజనులో వ్యాపారులందరూ యార్డులోకి రావాల్సిందేనని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. గతంలో మాదిరిగా యార్డు వెలుపల తమ సొంత స్థలాలు, ప్రైవేటు అద్దెస్థలాల్లో కొనుగోళ్లు జరపవద్దని, వ్యాపారులందరూ తప్పనిసరిగా యార్డులోనే ఏర్పాట్లు చేసుకోవాలని మార్కెటింగ్‌ అధికారులు ఉత్తర్వులు, వ్యాపారులకు నోటీసులు జారీచేశారు. ఇందుకు అనుగుణంగా గత సీజన్‌లో మార్కెట్ఫీజు చెల్లించిన వ్యాపారులకు వరుసక్రమంలో మార్కెట్లోని షెడ్లలో స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించారు.

యార్డులో నిర్మించిన షెడ్డు

ఇప్పటికే ప్రైవేటు స్థలాల్లో కాయల కొనుగోలును ప్రారంభించగా మరికొందరుకూడా సొంత స్థలాల్లోనే కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల-నిజామాబాద్‌ జాతీయ రహదారి వెంబడి ప్రైవేటు షెడ్లుండటం, గతంలో రహదారి ప్రమాదాలు జరిగి కొందరు కార్మికులు మృత్యువాత పడటంతో తప్పనిసరిగా వ్యాపారులందరూ మండీలోకే రావాలని నిర్దేశించారు. సీజన్‌లో దాదాపుగా 5 వేలమంది వరకు కార్మికులు వివిధ రాష్ట్రాల నుంచి కాయల గ్రేడింగ్‌, ప్యాకింగ్‌, లోడింగ్‌ తదితరాలకు వస్తారు, వీరంతా యార్డులోనే బసచేస్తారు. కాయల తరలింపునకు వేలాది వాహనాలు వస్తాయి కాబట్టి ఈ వాహనాలన్నీ రోడ్డుపక్కనే రోజుల తరబడి పార్కింగ్‌ చేయటంతో తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. మరోవైపు ప్రైవేటు స్థలాల్లో కొనుగోళ్లు జరిపితే మార్కెటింగ్‌ అధికారుల ఆజమాయిషీ కొరవడుతుంది, మార్కెట్ ఫీజు తగ్గుతుంది. తూకం, ధరల నిర్ణయం రైతులకు చెల్లింపు తదితరాల్లోనూ ఇబ్బందులు తలెత్తుతాయి. మరోవైపు కమీషన్‌ లైసెన్స్‌గల వ్యాపారులు కాబట్టి ఈ సీజన్‌నుంచి బహిరంగ వేలం పద్ధతిన కాయలను కొనాలని యోచిస్తుండటంతో అందరూ యార్డులోకి వస్తేనే వేలం సాధ్యపడుతుంది. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో కాయల కొనుగోళ్లు పెరిగే అవకాశమున్నందున మామిడి మండీలోనే మామిడి కాయల లావాదేవీలు జరిపేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. దీనిపై మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్‌ మాట్లాడుతూ వ్యాపారులతో మాట్లాడి జిల్లా కలెక్టర్‌ ఆదేశాలను అమలు చేస్తామని వివరించారు.

యార్డులోకి రావాలని అధికారుల ప్రకటన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని