logo

కమ్యూనిస్టుల పోరాటాలతోనే చట్టాలు

కమ్యూనిస్టు పార్టీల పోరాటాలు, త్యాగాలతోనే దేశంలో అనేక చట్టాలు వచ్చాయని సీపీఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.

Published : 28 Mar 2023 05:25 IST

సమావేశంలో మాట్లాడుతున్న చాడ వెంకట్‌రెడ్డి

భగత్‌నగర్‌, న్యూస్‌టుడే: కమ్యూనిస్టు పార్టీల పోరాటాలు, త్యాగాలతోనే దేశంలో అనేక చట్టాలు వచ్చాయని సీపీఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్‌లోని తారక హోటల్‌లో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్‌ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అసైన్‌మెంట్‌, దేవాదాయ, వక్ఫ్‌, భూస్వామ్య చట్టం ఏది వచ్చిన కమ్యూనిస్టు పార్టీల పోరాటాలతోనే వచ్చాయన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వర్‌రావు బీకేఎంయూలో దున్నేవారికే భూమి అంటూ పోరాటాలు నిర్వహించారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 60 ఏళ్ల పాలనలో రూ.100 లక్షల కోట్లు అప్పు చేస్తే, ఎనిమిదేళ్ల భాజపా పాలనలో రూ.50 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. వ్యవసాయ చట్టాల సవరణ చేసిందని, రైతు, రైతు కూలీల హక్కులపై దాడులు నిర్వహించిందన్నారు. వచ్చే నెల 14 నుంచి దేశాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడాలంటూ ఇంటింటికి సీపీఐ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామన్నారు. కేరళలో రేషన్‌ దుకాణాల్లో 10 వస్తువులు పంపిణీ చేస్తున్నారని, మన రాష్ట్రంలో కేవలం ఉచిత బియ్యాన్నే పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఎక్కువ సరకులు ఇచ్చేలా పోరాటాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌ ఖేత్‌ మజ్దూర్‌ యూనియన్‌ (బీకేఎంయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి గుల్జార్‌ సింగ్‌ గోరియా, జాతీయ ఉపాధ్యక్షుడు టి.వెంకట్రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క బాల మల్లేశ్‌, జాతీయ కౌన్సిల్‌ సభ్యులు మోతె లింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కె.కాంతయ్య, రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు