logo

ఏప్రిల్‌ నుంచి బలవర్థక బియ్యం

ప్రజలలో పోషక ఆహార లోపాన్ని నివారించడానికి పోషకాలతో కూడిన బలవర్థక బియ్యాన్ని జిల్లా ప్రజలకు అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది

Updated : 30 Mar 2023 06:50 IST

జిల్లాలో రేషన్‌ కార్డులు 2,78,411   

కేటాయింపు 4,703 టన్నులు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం, భగత్‌నగర్‌

బలవర్థక బియ్యం బస్తా 

ప్రజలలో పోషక ఆహార లోపాన్ని నివారించడానికి పోషకాలతో కూడిన బలవర్థక బియ్యాన్ని జిల్లా ప్రజలకు అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. జయశంకర్‌ భూపాలపల్లి, కొత్తగూడెం, ఆసీఫాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో రేషన్‌ దుకాణాల ద్వారా ప్రజలకు పోషకాల విలువలున్న బియ్యాన్ని అందించారు. తద్వారా ఆయా జిల్లాల ప్రజలకు బలవర్థక బియ్యం అందించడం ద్వారా పోషక విలువలతో ఉన్న ఆహారం అందుతోంది. పోషకాల విలువలు ఉన్న బియ్యాన్ని మన జిల్లాలో ఏప్రిల్‌ మాసం నుంచి అందించేందుకు నిర్ణయించారు. జిల్లాలో 7 రైస్‌ మిల్లులు పోషకాల విలువలు ఉన్న బియ్యాన్ని తయారు చేస్తున్నాయి. జిల్లాలో 563 రేషన్‌ దుకాణాల ద్వారా 2,78,411 కుటుంబాల లబ్ధిదారులకు 4,703 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేశారు.

సాధారణ, బలవర్థక బియ్యంలో తేడా..

సాధారణ బియ్యంలో 158 గ్రాములో 45 గ్రాముల కార్బోహైడ్రేట్‌, ప్రొటీన్‌ 4.3 గ్రాములు, ఫైబర్‌ 0.6 గ్రాములు, మాంసకృతులు 0.4 గ్రాములు ఉంటున్నాయి. దీంతో పూర్తిస్థాయి పోషకాలు లభించకపోవడంతో ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. బలవర్థక బియ్యంలో విటమిన్‌, మినరల్స్‌ను కృత్రిమంగా కలుపుతారు. ఐరన్‌, జింక్‌, ఐయోడిన్‌తోపాటు విటమిన్‌ ఎ, బి1, బి2, బి3, బి6, బి9, బి12, డి, ఇ విటమిన్లను బియ్యంలో కలుపుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా రైస్‌ మిల్లులో బ్లెండెడ్‌ యంత్రాలను సమకూర్చుకున్నారు.  

తయారీ ఇలా..

వంద కిలోల బియ్యానికి ఒక కిలో పోషకాల బియ్యం కెర్నెల్‌ కలుపుతారు. ఇందులో ఐరన్‌ 28 మిల్లీ గ్రాముల నుంచి 42.5 మి.గ్రా., సోడియం ఐరన్‌ 14 మి.గ్రా. నుంచి 21.25 మి.గ్రా. మధ్య ఉంటే ఫోలిక్‌ యాసిడ్‌ 75 మైక్రో గ్రాము నుంచి 125 మైక్రో గ్రాముల వరకు కలుపుతారు. ఇలాగే విటమిన్‌ బి12ను 0.75 మైక్రో గ్రాము నుంచి 1.25 మైక్రో గ్రాముల వరకు కలపడం ద్వారా జీవక్రియకు అవసరమైన విటమిన్లను అందించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ప్రజలు రోగాలకు లోనుకాకుండా ముందస్తు నివారణలో భాగంగా పోషకాహారం అందించబోతున్నారు. బియ్యం బ్యాగులను ఫోర్టిఫైడ్‌ రైస్‌ అని గుర్తించేలా వాటిపై ‘ఎఫ్‌’ గుర్తు వేస్తారు. పోషకాల బియ్యం తప్పని సరి సంచులపై ముద్రిస్తుంటారు.
* కరీంనగర్‌ జిల్లాలో రా రైస్‌ మిల్లులు 82, బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు 87 ఉంటే ఇందులో 7 మిల్లులు బ్లెండెడ్‌ యంత్రాలను బిగించుకొని పోషకాహారాన్ని అందించే బలవర్థక బియ్యాన్ని తయారు చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేక యంత్రాలను బిగించుకున్నారు. దీనికోసం భారీగా నిధులు వెచ్చించారు.

శాస్త్రీయ పద్ధతిలో..

బలవర్థక బియ్యాన్ని శాస్త్రీయ పద్ధతిలో తయారుచేస్తున్నాం. ఆహార తనిఖీ అధికారుల మార్గనిర్దేశాలకు అనుగుణంగా బియ్యాన్ని తయారుచేస్తున్నారు. విటమిన్లు కలిపే సమయంలో సుశిక్షుతులైన సిబ్బంది శాస్త్రీయ పద్ధతిలో కలపాల్సి ఉంటుంది. బలవర్థక బియ్యం తయారుచేసిన తరువాత వాటిని ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. మాకు ఉన్న రైస్‌ మిల్లుల్లో నిత్యం 100 టన్నుల  సామర్థ్యంతో ధాన్యాన్ని మరాడించి బలవర్థక బియ్యంగా మలుస్తున్నాం.  
 శశికిరణ్‌, రైస్‌మిల్లర్‌, బలవర్థక బియ్యం తయారీదారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని