logo

పరీక్ష ముగిసింది.. లక్ష్యం మిగిలింది

ఇంటర్‌ పరీక్షలు ముగిశాయి. బుధవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఆనందోత్సాహంతో ఇంటి ముఖం పట్టారు.

Published : 30 Mar 2023 06:39 IST

వసతి గృహం నుంచి వెళుతున్న విద్యార్థిని

కరీంనగర్‌ (గణేశ్‌నగర్‌): ఇంటర్‌ పరీక్షలు ముగిశాయి. బుధవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఆనందోత్సాహంతో ఇంటి ముఖం పట్టారు. కొంతకాలం ఇంట్లో గడిపి లక్ష్య సాధన కోసం తిరిగి పుస్తకాలతో స్నేహం చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. జేెఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, ఎంసెట్‌, నీట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లో రాణించేందుకు సిద్ధమంటున్నారు. చివరి రోజున 13,809 మంది విద్యార్థుల్లో 386 మంది గైర్హాజరయ్యారు. ప్రధాన పరీక్షలు ముగియగా వొకేషనల్‌ విద్యార్థులకు ఏప్రిల్‌ 2 వరకు పరీక్ష జరగనున్నాయి.

మూల్యాకనం 31 నుంచి

కరీంనగర్‌ (గణేశ్‌నగర్‌): ఇంటర్‌ సమాధాన పత్రాల మూల్యాంకనం మొదటి విడుత ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుందని డీఐఈవో, క్యాంప్‌ ఆఫీసర్‌ రాజ్యలక్ష్మి తెలిపారు. శుక్రవారం జిల్లా ఇంటర్‌ విద్యాధికారి కార్యాలయం పద్మానగర్‌లో ఇంగ్లిష్‌, హిందీ, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల కరీంనగర్‌లో గణితం, పౌరశాస్త్రం, తెలుగు మూల్యాంకనం ప్రారంభం అవుతుందన్నారు. కళాశాల లాగిన్‌ నుంచి అధ్యాపకుల నియామక పత్రాలను డౌన్‌లోడు చేసుకుని విధులకు హాజరు కావాలని సూచించారు. మూల్యాంకనం విధులకు హాజరు కాని అధ్యాపకులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

పదో తరగతి పరీక్షలకు 78 కేంద్రాలు

కరీంనగర్‌ కలెక్టరేట్‌: జిల్లాలో 12,195 పదో తరగతి విద్యార్థుల కోసం 78 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అదనపు పాలనాధికారి గరిమ అగ్రవాల్‌ తెలిపారు. బుధవారం ‘పది’ పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సమీక్షలో పాల్గొన్న అదనపు పాలనాధికారి మాట్లాడుతూ అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా బాధ్యతలను గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు అప్పగించామన్నారు. విద్యాశాఖ, పోలీసు, పోస్టల్‌, విద్యుత్తు, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని