logo

రైతులకు ఉపకరించేలా పరిశోధనలు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా రైతులకు ఉపకరించేలా నూతన పరిశోధనలు చేపడుతున్నట్లు వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ఎం.వెంకటరమణ పేర్కొన్నారు.

Published : 30 Mar 2023 06:40 IST

మాట్లాడుతున్న పరిశోధన సంచాలకులు వెంకటరమణ

జగిత్యాల వ్యవసాయం: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా రైతులకు ఉపకరించేలా నూతన పరిశోధనలు చేపడుతున్నట్లు వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ఎం.వెంకటరమణ పేర్కొన్నారు. జగిత్యాల పరిశోధనస్థానంలో ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహాసంఘ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. డీఆర్‌ వెంకటరమణ మాట్లాడుతూ పెట్టుబడి ఖర్చు తగ్గించటం, వాతావరణ పరిస్థితులను అధిగమించటం, డ్రోన్‌ ద్వారా మందుల పిచికారీ, వన్యప్రాణుల నిరోధం తదితరాలపై వర్సిటీ పరిశోధనలను మరింత విస్తృతం చేస్తోందన్నారు. ప్రైవేటు కంపెనీలకన్నా ముందుగానే వ్యవసాయ వర్సిటీ ద్వారా అన్ని పంటల్లో మేలైన వంగడాలను అందుబాటులోకి తేవాలని, పురుగులు, తెగుళ్లను తట్టుకునే విత్తనాలు కావాలని, సగటు దిగుబడులు పెరగాలని, యాంత్రీకరణకు ప్రభుత్వ రాయితీ ప్రోత్సాహం అందించాలని పలు జిల్లాల నుంచి వచ్చిన రైతులు కోరారు. అనంతరం శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు బృందాలుగా ఏర్పడి ఆయా విభాగాల్లో గత పంటకాలాల్లో ఎదురైన ఇబ్బందులను చర్చించి 2023-24 వానాకాలం, యాసంగిల్లో చేపట్టాల్సిన పరిశోధన, విస్తరణ కార్యాచరణను నిర్దేశించారు. ఏడీఆర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వర్సిటీ సభ్యుడు జగన్మోహన్‌రావు, వ్యవసాయ కళాశాల డీన్‌ డాక్టర్‌ భారతిభట్, ఆర్‌ఈఏసీ సభ్యుడు వెంకటేశ్వర్‌రావు, మాజీ సభ్యుడు వెల్ముల రాంరెడ్డి, వర్సిటీ ప్రధాన శాస్త్రవేత్తలు, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలోని శాస్త్రవేత్తలు, వ్యవసాయ, అనుబంధశాఖల అధికారులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని