logo

చిన్న తప్పిదం లేకుండా పది పరీక్షల నిర్వహణ

జిల్లాలో వచ్చే నెల 3 నుంచి 13 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

Published : 30 Mar 2023 06:59 IST

సిరిసిల్ల (విద్యానగర్‌), న్యూస్‌టుడే: జిల్లాలో వచ్చే నెల 3 నుంచి 13 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో పది పరీక్షల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనపై బుధవారం  విద్యాశాఖ అధికారులు, పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్, సిట్టింగ్‌ స్క్వాడ్‌, ఎంఈవోలతో సమీక్ష ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు ఏ చిన్న తప్పిదం లేకుండా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేలా చూడాలన్నారు. జిల్లాలో 3,400 మంది బాలురు, 3,096 మంది బాలికలు మొత్తం 6,496 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 36 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఏప్రిల్‌లో నిర్వహించే పది తరగతి పరీక్షల్లో 11 పేపర్లకు బదులు 6 పేపర్లే ఉంటాయని తెలిపారు. ఈ  విషయాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. వేసవి దృష్ట్యా అన్ని కేంద్రాల్లో నిరంతర విద్యుత్తు, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫ్యాన్‌లు పని చేసేలా చూడాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలోని చీఫ్‌ సూపరింటెండెంట్దే కీలక బాధ్యత అని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. విధులు కేటాయించిన ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన, నిబంధనలు తప్పక పాటించాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించొద్దని, బయటి వ్యక్తులు రాకుండా చూడాలన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరపాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌ విధించాలని చెప్పారు. కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్‌ కేంద్రాలను మూసివేయించాలని సూచించారు. ప్రశ్నపత్రాలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చేటప్పుడు, అదేవిధంగా జవాబు పత్రాలను డిపాజిట్ చేసేటప్పుడు తప్పనిసరిగా పోలీస్‌ బందోబస్తు మధ్యనే తరలించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ఖీమ్యా నాయక్‌, జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్‌ అజీమ్‌, ఎంఈవోలు రఘుపతి, బన్నాజీ, శ్రీనివాస్‌ దీక్షిత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని