logo

పెంపకానికి ఆర్భాటం.. పర్యవేక్షణపై నిర్లక్ష్యం

ఇక్కడ ఎండిపోయిన మొక్కలు పెద్దపల్లి మండలం అందుగులపల్లి నర్సరీలోనివి. నిత్యం నీటి తడులు అందించినప్పటికీ ఎండిపోతున్నాయి. నాసిరకమైన విత్తనాలు నాటడంతో మొక్కల ఎదుగుదల లేదు.

Updated : 31 Mar 2023 06:35 IST

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

ఇక్కడ ఎండిపోయిన మొక్కలు పెద్దపల్లి మండలం అందుగులపల్లి నర్సరీలోనివి. నిత్యం నీటి తడులు అందించినప్పటికీ ఎండిపోతున్నాయి. నాసిరకమైన విత్తనాలు నాటడంతో మొక్కల ఎదుగుదల లేదు.

ఇదీ జిల్లాలోని ఉపాధిహామీ పథకం నర్సరీల్లో మొక్కల పరిస్థితి. నాసిరకమైన మట్టి, నాణ్యత లేని విత్తనాలు నాటడంతో ఎదుగుదల క్షీణిస్తోంది. ఒకటికి పదిసార్లు విత్తనాలు నాటినా ఫలితం కనిపించడంలేదు. ప్రతి సంవత్సరం ఇదే సమస్య పునరావృతం అవుతున్నా అధికార యంత్రాంగం కనీస చర్యలు చేపట్టడం లేదు. ఈ ఏడాది జిల్లాలో 266 గ్రామపంచాయతీల్లో 40.16 లక్షల మొక్కల పెంపకం చేపట్టాలని నిర్ణయించారు. ప్రతీ పంచాయతీకి పదివేల లక్ష్యం విధించారు. నర్సరీల్లో మొక్కల నీడ కోసం పరదాలు సమకూర్చుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాలను పంచాయతీలు పట్టించుకోవడంలేదు. రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా మొక్కలు ఎండిపోతుండటం ఆందోళన కలిగించే విషయం.

నిబంధనలు గాలికి

మొక్కల కొరత లేకుండా ఊరికో నర్సరీ ఏర్పాటు చేస్తున్నారు.  ఇందులో మౌలిక వసతులు కొరవడుతున్నాయి. రక్షణ వ్యవస్థ(ఫెన్సింగ్‌) లేకపోవడంతో పశువులు సంచరిస్తున్నాయి. కొన్ని చోట్ల నీటి వసతి లేక బోరు అద్దెకు తీసుకుంటున్నారు. వన సంరక్షకులతో పాటు కూలీలు మొక్కల పెంపకంలో భాగస్వాములవుతున్నారు. పరదాలను కొనుగోలు చేయాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

కనిపించని ఎదుగుదల

జిల్లాలోని నర్సరీల్లో ఈ ఏడాది టేకు, ఈత, వెదురు, మలబార్‌, ఇప్ప, మద్ది, వెలగ, మర్రి, వేప, రేల, బాదాం, రావి, చింత, తులసి, నిమ్మ, జామ, సీతాఫలం, కర్జూర, మందార, సన్నజాజి, మల్లె విత్తనాలకు ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 26.70 లక్షల విత్తనాలు నాటితే వీటిలో 19.64 లక్షలు మాత్రమే మొలకెత్తాయి. వీటిలో చాలా వరకు చనిపోతున్నాయి. నాణ్యమైన మట్టి, విత్తనాలు వినియోగించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

మూడు నెలలు కీలకమే

వేసవి నేపథ్యంలో వచ్చే మూడు నెలలు కీలకంగా మారనుంది. మార్చిలోనే ఎండత తీవ్రత పెరుగుతుండటంతో రాబోయే కాలంలో గణనీయంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. మొక్కల నీడ కోసం గతంలో పరదాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం పంచాయతీలే కొనుగోలు చేసుకోవాలని ఆదేశించినప్పటికీ నిధులు లేమి మెలిక పెడుతున్నారు. మొక్కలు నాటే సమయంలో హడావుడి తప్ప అనంతరం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.


ప్రత్యేక దృష్టి 

శ్రీధర్‌, గ్రామీణాభివృద్ధి అధికారి

జిల్లాలో నర్సరీల్లో మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. మొక్కల ఎదుగుదలపై పర్యవేక్షిస్తున్నాం. నిర్లక్ష్యం చేయరాదని ఆదేశిస్తున్నాం. పలు నర్సరీల్లో గత ఏడాదికి సంబంధించిన మొక్కలను పెద్ద వాటిని తీసుకురావాలని సూచిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని