logo

ప్రణాళికా లోపం.. పరిశుభ్రతకు దూరం

పెద్దపల్లి పట్టణంలోని పలు కాలనీల్లో రహదారులు, మురుగుపారుదల వ్యవస్థ అధ్వానంగా మారింది. పనుల్లో నాణ్యత కరవై నిర్మాణాలు కొన్నాళ్లకే శిథిలమవుతున్నాయి.

Updated : 31 Mar 2023 06:29 IST

మురుగుకాలువలు లేక కరవైన పారిశుద్ధ్యం
జిల్లాకేంద్రంలో అధ్వానంగా కొత్త కాలనీలు
న్యూస్‌టుడే, పెద్దపల్లి

చైతన్యకాలనీలో రోడ్డు నిర్మించి కాలువ వదిలేయడం.. ప్రవాహ మార్గంలో నియంత్రిక ఏర్పాటుతో నిలిచిన మురుగు

పెద్దపల్లి పట్టణంలోని పలు కాలనీల్లో రహదారులు, మురుగుపారుదల వ్యవస్థ అధ్వానంగా మారింది. పనుల్లో నాణ్యత కరవై నిర్మాణాలు కొన్నాళ్లకే శిథిలమవుతున్నాయి. కొత్తగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్న కాలనీల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కాలువలు, రహదారుల నిర్మాణానికి సరైన ప్రణాళిక లేక వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మట్టి రోడ్లు నిర్మించినా మురుగుకాలువలు లేక పారిశుద్ధ్యం లోపించింది.

నాసిరకంగా నిర్మాణాలు

అభివృద్ధి పనుల నిర్వహణ నిధుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. పెద్దపల్లి పురపాలికకు వచ్చే నిధులు, ప్రత్యేక గ్రాంట్లు, ఇతర నిధులతో ఏటా దాదాపు రూ.5 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. కానీ పనుల నిర్వహణలో నాణ్యత అంతంతమాత్రంగానే ఉంటోంది. గతంలో నిర్మించిన పలు మురుగుకాలువలు, సీసీ రోడ్లు పనులు నాసిరకంగా ఉండటంతో ధ్వంసమవుతున్నాయి. రామచంద్ర మిషన్‌ నుంచి చైతన్యకాలనీకి వెళ్లే సీసీ రోడ్డు ముక్కలవుతోంది. రోడ్డు నిర్మించిన తర్వాత సైడ్‌బర్మ్‌లు నిరించకపోవడం, మురుగుకాలువల నిర్మాణం కూడా లేకపోవడంతో సీసీ నిర్మాణాలు దెబ్బతింటున్నాయి. ఇక డ్రైనేజీలు నిర్మించిన చోట ఓవైపు కాలువ నిర్మిస్తుండగానే మరోవైపు మురుగు ప్రవహిస్తుండటంతో నాణ్యత అటకెక్కుతోంది. సాగర్‌ రోడ్డులో మురుగుకాలువ ఎత్తుగా నిర్మించడంతో వర్షం కురిసినపుడు ఇళ్లలోకి నీరు చేరుతోంది. మజీద్‌రోడ్డులోని మురుగుకాలువ పలు ప్రాంతాల్లో ధ్వంసం కావడం, పూడిక అధికంగా చేరడంతో కాలువ కనిపించకుండా పోతోంది.

ఇంటి ముందు తవ్వుకున్న మురుగు గుంత

మురుగుతో వివాదాలు

కొత్త కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పురపాలక సంఘానికి తలకు మించిన భారంగా మారింది. ఇళ్ల నుంచి బయటకు వెళ్లే మురుగు సమీపంలోని ఖాళీ స్థలంలో చేరుతుండగా దాని యజమాని అడ్డుకుంటుండటంతో గొడవలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో నారాయణస్వామినగర్‌, చైతన్యకాలనీ, చీకురాయి రోడ్డు ప్రాంతాల్లో తరచూ ఇలాంటి గొడవలు జరుగుతుండటంవతో కొందరు యజమానులు ఇళ్ల ముందు గుంతలు తవ్వుకున్నారు. దీంతో పాతికేళ్ల కిందట పల్లెల్లో కనిపించిన మురుగు గుంతలు ప్రస్తుతం పెద్దపల్లి పురపాలిక పరిధిలో దర్శనమిస్తున్నాయి. కనీసం కచ్చా కాలువలైనా తవ్వాలంటూ పలు కాలనీల ప్రజలు కోరుతున్నారు.


ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులైనా వెచ్చించాలి

-మొండెద్దుల రాజయ్య, చైతన్యకాలనీ

చైతన్యకాలనీలో ఏటా 20 నుంచి 30 ఇళ్లు నిర్మిస్తున్నారు. ప్రతి నెలా కొత్తగా పదుల సంఖ్యలో నిర్మాణాలు ప్రారంభమవుతున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద మున్సిపాలిటీకి రూ.లక్షల్లో చెల్లిస్తున్నాం. ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం చెల్లించిన తరువాతే ఇళ్ల నిర్మాణాలకు అనుమతినిస్తున్నారు. ఇక్కడ వసూలు చేసిన నిధులను ఈ ప్రాంతానికే వెచ్చిస్తే కనీసం మురుగు కాలువల నిర్మాణమైనా జరిగేది.


ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు

-ఎం.శ్రీనివాస్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌

లేఅవుట్‌ అనుమతులు పొందిన వెంచర్లలో అన్ని రకాల మౌలిక వసతులుంటాయి. అనుమతి లేని చోట జరిగే నిర్మాణాలతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఇంకుడుగుంతను తవ్వుకున్న వారికే ఇంటి నిర్మాణానికి అనుమతిస్తున్నాం. అయితే ఎవరూ నిబంధనలు పాటించడం లేదు. ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులను ఏ ప్రాంతంలోనైనా వెచ్చించే అధికారం పురపాలికకు ఉంటుంది. ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని