logo

ఎండుతున్న పంటలకు జీవం

పెరుగుతున్న ఎండలు... పడిపోతున్న భూగర్భ జలాలతో పంట చేతికి రాక ముందే ఎండిపోతాయేమోనని అన్నదాతలు దిగులు చెందుతున్న తరణంలో ఎల్లంపల్లి నీరు విడుదల చేయడంతో ఊరట లభించింది.

Published : 31 Mar 2023 05:58 IST

ఎల్లంపల్లి నీరు రావడంతో అన్నదాతకు ఊరట
న్యూస్‌టుడే, రుద్రంగి

రుద్రంగిలో నీరు లేక ఎండుతున్న వరి పైరు

పెరుగుతున్న ఎండలు... పడిపోతున్న భూగర్భ జలాలతో పంట చేతికి రాక ముందే ఎండిపోతాయేమోనని అన్నదాతలు దిగులు చెందుతున్న తరణంలో ఎల్లంపల్లి నీరు విడుదల చేయడంతో ఊరట లభించింది. మార్చి మొదటి వారంలోపే సాగు నీరు విడుదల చేస్తే కనీసం మరో 500 ఎకరాల్లోని పంటలు ఎండిపోకుండా కాపాడుకునే అవకాశం ఉండేది. కాస్త ఆలస్యమైనా మండలంలోని మెట్ట గ్రామాలకు నీరు చేరుకోవడంతో ఎండిపోయే దశలో ఉన్న పంటలకు ఊపిరి పోసినట్లైందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నర్సింగాపూర్‌ కాలువలో ప్రవహిస్తున్న ఎల్లంపల్లి జలాలు

చందుర్తి మండలంలో ఈ యాసంగిలో వరి పంటను సుమారు 14 వేల ఎకరాల్లో సాగు చేశారు. నాట్లు వేసిన డిసెంబర్‌, జనవరి నెలల్లో బావులు, బోరుబావుల్లో పుష్కలంగా జలాలు ఉండటంతో పంటలకు ఈ ఏడాది ఇబ్బందులుండవని భావించారు. సాగు నీటి ఎద్దడి ప్రారంభమయ్యే మార్చి నెల ప్రారంభం నాటికి ఎల్లంపల్లి నీరు మండలంలోని అన్ని గ్రామాలకు చేరుతాయని ఆశించారు. అయితే మార్చి ప్రారంభం నాటికి కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్‌ చెరువులోకి నంది మేడారం పంపుహౌజ్‌ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లను ప్రారంభించారు. పంపులకు ఉన్న గేట్‌వాల్వ్‌లో సమస్య ఏర్పడంతో నంది మేడారం పంపుహౌజ్‌లోని మోటార్లు మునిగిపోయాయి. పది రోజుల్లో మరమ్మతులు చేసి మళ్లీ మోటార్లను ప్రారంభించారు. దీంతో ఎల్లంపల్లి నీరు చందుర్తికి వరకు వచ్చేందుకు సమయం ఎక్కువగా పట్టిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి కాలువలకు దగ్గర్లో ఉన్న రైతులు కాలువల్లో మోటార్లను ఏర్పాటు చేసుకుని పైప్‌లైన్లను వేసుకుని పంటలకు నీటిని అందిస్తున్నారు. దీంతో పంటపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రుద్రంగికి ఎప్పుడు?

చందుర్తి మండలం వరకు వచ్చిన ఎల్లంపల్లి జలాలు రుద్రంగి మండలానికి మాత్రం చేరుకోలేదు. చందుర్తి మండలం లింగంపేటలో ఉన్న పైప్‌లైన్‌ మరమ్మతులకు గురికావడంతో రుద్రంగికి నీరు ఎత్తిపోసే పరిస్థితి లేదు. మరో వైపు పైప్‌లైన్‌ సమస్యతో పాటు రుద్రంగిలోని నాగారం చెరువులోకి ఎల్లంపల్లి నీళ్లను తీసుకువెళ్లే మాటు కాలువ మూడు ప్రాంతాల్లో గతేడాది కురిసిన వర్షాల కారణంగా ధ్వంసమైంది. వీటికి మరమ్మతులు చేయాల్సిన అధికారులు కనీసం ధ్వంసమైన కాలువ వైపు వెళ్లి చూడట్లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ యాసంగిలో రుద్రంగి మండల కేంద్రంలో వరి పంట సుమారు 3 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో సాగు నీటి కొరత కారణంగా సమీపంలోని చెరువులు, కుంటల్లో మోటార్లు పెట్టి, వందల మీటర్ల పొడవునా పైప్‌లైన్‌లు ఏర్పాటు చేసుకుని పంటలకు అందిస్తున్నారు. దీనికి ఒక్కో రైతు రూ.50 వేల పైనే వ్యయాన్ని చేస్తున్నారు. మరికొందరు సమీపంలోని బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉన్న రైతులకు డబ్బులు చెల్లించి పంటలను కాపాడుకుంటున్నారు. ఇరిగేషన్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి రుద్రంగికి వచ్చే పైప్‌లైన్‌, మాటు కాలువకు మరమ్మతులు చేయించేందుకు చర్యలు చేపట్టాలని కర్షకులు కోరుతున్నారు.


ఇప్పటికే ఎకరం ఎండిపోయింది

లోలపు చంద్రమోహన్‌, రైతు, నర్సింగాపూర్‌

నేను ఈ యాసంగిలో మూడు ఎకరాల్లో వరి సాగు చేశాను. మార్చి ప్రారంభం నుంచి సాగు నీటి కొరత ఏర్పడింది. ఇప్పటికే ఎకరం మేర ఎండిపోగా ప్రస్తుతం వస్తున్న ఎల్లంపల్లి కాలువ నీటితో రెండు ఎకరాల్లోని పంటను రక్షించుకోగలిగాను. లేదంటే మొత్తం పంట ఎండిపోయేది.


సమస్య తీవ్రమైన సమయంలో...

బొజ్జ లింగయ్య, రైతు, ఆశిరెడ్డిపల్లె

నాకున్న నాలుగు ఎకరాల్లో వరి పంట వేశాను. ప్రస్తుతం గింజ తయారయ్యే దశలో ఉంది. ఇలాంటి తరుణంలోనే సాగునీటి సమస్య తీవ్రమైంది. పంటలను ఎలా రక్షించుకోవాలో అర్థం కాని సమయంలో ఎల్లంపల్లి నీళ్లు వచ్చాయి. సరైన సమయంలో రాకపోతే కనీసం రెండు ఎకరాల్లోని పంట ఎండిపోయేది.


పైప్‌లైన్‌, కాలువలకు మరమ్మతులు చేయాలి

బండారు మహేశ్‌, రైతు, రుద్రంగి

నేను ఈ యాసంగిలో ఏడు ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. నా సొంత పొలం నాలుగు ఎకరాల్లో సాగునీటి కొరత లేకపోయినా కౌలు చేస్తున్న మూడు ఎకరాలకు నీటి కొరత తీవ్రంగా ఉంది. పక్కనున్న మరో రైతుకు రూ.10 వేలు ఇచ్చి అతని బోరుబావి నీటితో పంటకు నీరు అందిస్తున్నాను. రుద్రంగికి కూడా ఎల్లంపల్లి నీరు వస్తే ఈ ఇక్కట్లు తప్పేవి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని