logo

మానవ వ్యర్థాలతో సేంద్రియ ఎరువు

పట్టణాన్ని స్వచ్ఛత దిశగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం విభిన్న కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా మానవ వ్యర్థాలను పునర్‌ వినియోగించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుంది.

Updated : 26 May 2023 04:47 IST

న్యూస్‌టుడే, జగిత్యాల పట్టణం

శుద్ధీకరణ కేంద్రం

పట్టణాన్ని స్వచ్ఛత దిశగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం విభిన్న కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా మానవ వ్యర్థాలను పునర్‌ వినియోగించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుంది. నర్సింగాపూర్‌ శివారులో 01-04-22న మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.3 కోట్ల ప్రభుత్వ నిధులతో ఎకరం స్థలంలో చేపట్టిన ఆధునిక కేంద్రంలో వ్యర్థాలను శుద్ధిచేసి ఎరువుగా మార్చి దానిని మొక్కలకు, రహదారుల వెంట చెట్లకు, వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తున్నారు.

ప్రిస్టిన్‌ భారత్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతికత ఆధారంగా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. 35 కేఎల్‌డీ సామర్థ్యం కలిగిన కేంద్రంలో 3 వేల లీటర్ల మేరకు వ్యర్థాలను ఒకే రోజు శుద్ధి చేయవచ్చు. 95 శాతం నీరు, 5 శాతం వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చుతున్నారు. సౌరశక్తితో వ్యర్థాలకు రక్షణ కల్పించి నిల్వ చేస్తున్నారు. జగిత్యాలలో ప్రతి నెల మానవ వ్యర్థాలను శుద్ధి చేయడం ద్వారా 7 టన్నుల సేంద్రియ ఎరువు తయారవుతుంది. పట్టణంలో 25 వేల కుటుంబాలు ఉన్నాయి. 1.20 లక్షల జనాభా ఉంది. ఇందుకనుగుణంగా 5 సెప్టిక్‌ ట్యాంక్‌ వాహనాలకు బల్దియా అనుమతినిచ్చింది. ప్రతి మూడేళ్లకొకసారి ట్యాంకు నిండినా నిండక పోయినా అందులోని వ్యర్థాలను విధిగా యజమానులు తొలగించుకోవాలనే నిబంధన ఉంది. ఈ మేరకు బల్దియా చెత్త సేకరణ వాహనాల్లో మైకుల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. గతంలో సెప్టిక్‌ ట్యాంకుల నుంచి తొలగించిన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారేవి. నూతనంగా నిర్మించిన శుద్ధీకరణ కేంద్రంతో పరిసరాలు శుభ్రంగా మారుతున్నాయి.

శుభ్రత కోసం టోల్‌ఫ్రీ నంబర్‌

పట్టణంలో సెప్టింక్‌ ట్యాంకు శుభ్రం చేయించుకోవాలనుకునే వారి కోసం మున్సిపాలిటీ ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ 14420 కేటాయించింది. ట్యాంకు నిండిన వారు ఈ నంబర్‌కు ఫోన్‌ చేస్తే బల్దియా సిబ్బంది వాహనాల సమాచారం ఇస్తారు. రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ఛార్జీ చెల్లిస్తే సిబ్బంది ట్యాంకు శుభ్రం చేస్తారు.

ఎరువుకు రక్షణ

ప్రయోజనాలు..

శుద్ధీకరణ కేంద్రంలో తయారైన ఎరువుతో ప్రధాన రహదారులలోని చెట్లు, మొక్కలు పచ్చదనం సంతరించుకున్నాయి. హరిత హారం, పల్లె ప్రకృతి వనం, నర్సరీలకు, కేంద్రం ఆవరణలో ఉన్న చెట్లకు శుద్ధిచేసిన నీటిని, ఎరువులను వినియోగించడం ద్వారా చుట్టు పక్కల పరిసరాల్లో ప్రకృతి పచ్చదనం సంతరించుకుంది. సెప్టిక్‌ ట్యాంకు నిండినప్పుడు దుర్వాసన, దోమలు వ్యాప్తి చెందుతాయి. ఫలితంగా పలు జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి తప్పనిసరిగా సెప్టిక్‌ ట్యాంకును శుభ్రపరచుకోవాలి. ఈ మేరకు ప్రజా ప్రతినిధులు, అధికారులు అన్ని వార్డుల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.

సేకరించిన వ్యర్థాలను శుద్ధిచేస్తున్న సిబ్బంది


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు