logo

ధాన్యం లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం

రహదారిలో ఆగి ఉన్న ధాన్యం లారీని, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

Published : 29 May 2023 04:24 IST

ఇద్దరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

మృతి చెందిన నాగరాజు

కోనరావుపేట, న్యూస్‌టుడే: రహదారిలో ఆగి ఉన్న ధాన్యం లారీని, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల వివరాల ప్రకారం... కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన అనుముల లింగారెడ్డి, అనుముల ఓజల్‌రెడ్డి, అనుముల నాగరాజులు సిరిసిల్ల నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నారు. వాహనాన్ని నడుపుతున్న నాగరాజు రహదారిలో మరమ్మతులకు గురై ఆగి ఉన్న లారీని చీకట్లో గుర్తించక వెనక వైపు నుంచి ఢీకొట్టాడు. ఈ  ప్రమాదంలో నాగరాజు, ఓజల్‌రెడ్డి, లింగారెడ్డిలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించగా 40 నిమిషాల పాటు రాలేదని స్థానికులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అనుముల నాగరాజు (34), ఓజల్‌రెడ్డిలు (70) మృతి చెందినట్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన లింగారెడ్డిని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు.

సంఘటన స్థలంలో క్షతగాత్రులు

పోలీసులు, బాధిత కుటుంబీకుల మధ్య తోపులాట

రోడ్డు ప్రమాదంలో ఓజల్‌రెడ్డి, నాగరాజులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో వారి మృతదేహాలను పోస్టుమార్టం గదికి తరలిస్తుండగా, నాగరాజు చనిపోలేదని, శ్వాస ఉందని అతని బంధువులు అడ్డుకున్నారు. మృతదేహాన్ని స్ట్రెచర్‌తో రోడ్డు పైకి లాక్కెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. బంధువుల కోరిక మేరకు పోలీసులు అంబులెన్స్‌లో మృతదేహాన్ని కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కూడా నాగరాజు మృతి చెందాడని, శవాన్ని కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. నాగరాజుకు భార్య రేణు, నాలుగేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. ఓజల్‌రెడ్డికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని