logo

స్వచ్ఛ పథం.. ఆదాయ మార్గం

పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యర్థాలతో ఆదాయ సముపార్జనపై పురపాలికలు దృష్టి సారిస్తున్నాయి. అయితే వ్యర్థాల నిర్వహణ సమస్యగా మారుతుండటంతో ఆ ప్రయత్నాలు అర్ధంతరంగా నిలిచిపోతున్నాయి.

Published : 29 May 2023 04:36 IST

ఒప్పందాలు కొనసాగితేనే వ్యర్థానికి అర్థం

సెగ్రిగేషన్‌ ప్లాంటులో ప్లాస్టిక్‌ కవర్లను వేరు చేసి సంచుల్లో నింపుతున్న సిబ్బంది

న్యూస్‌టుడే, పెద్దపల్లి: పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యర్థాలతో ఆదాయ సముపార్జనపై పురపాలికలు దృష్టి సారిస్తున్నాయి. అయితే వ్యర్థాల నిర్వహణ సమస్యగా మారుతుండటంతో ఆ ప్రయత్నాలు అర్ధంతరంగా నిలిచిపోతున్నాయి. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం ద్వారా మొదలయ్యే ఈ ప్రక్రియలో తడి చెత్త నుంచి కంపోస్టు ఎరువుల తయారీ కోసం గుంతలు నిర్మిస్తున్నారు. పొడి చెత్త సేకరణలోనూ విభజన ప్రక్రియ జరుగుతుంది. పొడి చెత్త నుంచి ప్లాస్టిక్‌ కవర్లు వేరు చేయడం.. గాజు, ఇనుప ముక్కలు, పేపర్‌, అట్టముక్కలు తదితర వ్యర్థాలను వేర్వేరుగా విభజించి, ఆదాయం సముపార్జించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పెద్దపల్లిలో స్వచ్ఛతతో పాటు చెత్త సేకరణలో ప్రజల సహకారం కోరుతూ పురపాలిక ఛైర్‌పర్సన్‌, అధికారులు అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేశారు.

తడి చెత్తను కంపోస్టు గుంతలో వేస్తున్న దృశ్యం

ప్లాస్టిక్‌ కవర్ల విక్రయం

* పురపాలిక సేకరించిన తడి చెత్తను కంపోస్టు ఎరువుగా తయారు చేసేందుకు డంపు యార్డులో ప్రత్యేక గుంతలు నిర్మించారు. తడి చెత్తను వీటిలో వేసి పూర్తిగా కుళ్లిన తర్వాత సేంద్రియ ఎరువులుగా వినియోగానికి వీలుగా తయారు చేస్తున్నారు.

* సుల్తానాబాద్‌ మండలం బొంతకుంటపల్లి వద్ద ప్లాస్టిక్‌ వ్యర్థాలతో టైల్స్‌ తయారు చేసే పరిశ్రమకు పురపాలక సంఘం నుంచి పాలిథిన్‌ కవర్లను విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

* కిలో ప్లాస్టిక్‌ కవర్లకు రూ.4 చొప్పున మునిసిపాలిటీ నుంచి పరిశ్రమ కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం పారిశుద్ధ్య సిబ్బంది చెత్త సేకరించే సమయంలోనే కవర్లను వేరు చేసి డంప్‌యార్డులో నిల్వ చేస్తున్నారు.

* గతంలో సుగ్లాంపల్లిలో చెత్తతో విద్యుత్తు తయారు చేసే పరిశ్రమ కోసం కొబ్బరి బొండాలు, ఇతర పొడి చెత్తను విక్రయించారు. అయితే సాంకేతిక కారణాలతో పరిశ్రమ మూత పడటంతో ఘన వ్యర్థాల నుంచి ఆదాయం వచ్చే అవకాశాన్ని పురపాలిక కోల్పోయింది.

* కాగితాలు, అట్టముక్కలను ఐటీసీ కంపెనీకి పంపించేందుకు గతంలో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. బొంతకుంటపల్లిలోని టైల్స్‌ పరిశ్రమకు పాలిథిన్‌ కవర్లు విక్రయించే ఒప్పందం కొనసాగితే వ్యర్థాలకు నిజమైన అర్థం కలుగుతుంది.

ప్లాస్టిక్‌ కవర్లతో తయారైన పార్కింగ్‌ టైల్‌


ప్రజల సహకారంతోనే పరిశుభ్ర పట్టణం
-ఎం.శ్రీనివాస్‌రెడ్డి, పురపాలిక కమిషనర్‌

పట్టణ పరిశుభ్రతే లక్ష్యంగా చెత్త సేకరణలో వినూత్న చర్యలు చేపడుతున్నాం. ఈ క్రమంలో చెత్త నుంచి ఆదాయ సముపార్జన ఒక అంశం మాత్రమే. అది వచ్చినా, రాకపోయినా చెత్త నిర్వహణ సక్రమంగా నిర్వహించి, జిల్లాకేంద్రాన్ని పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందుకోసం ప్రజల సహకారం చాలా అవసరం. తడి, పొడి చెత్తతో పాటు ప్లాస్టిక్‌ కవర్లను వేర్వేరు బుట్టల్లో వేసి ఇస్తే సేకరణ ప్రక్రియ పకడ్బందీగా జరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని