logo

అరకొర పరిజ్ఞానం.. ప్రాణాలతో చెలగాటం

పల్లెల్లో ప్రథమ చికిత్స అందించే కొందరు ఆర్‌ఎంపీ, పీఎంపీలు తెలిసీ తెలియని పరిజ్ఞానంతో రోగుల ప్రాణాలు తీస్తున్నారు. వైద్యం పూర్తిగా తెలియకపోయినా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

Published : 29 May 2023 04:36 IST

గ్రామీణ ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా ఆర్‌ఎంపీ, పీఎంపీల వైద్యం
ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

* పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి రవళి(15) ఈ నెల 26న ధర్మారం మండలం దొంగతుర్తిలోని వారసంతకు వెళ్లింది. అక్కడే అస్వస్థతకు గురి కాగా ఆమెను తల్లి స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లింది. ఇంజక్షన్‌ ఇచ్చిన అరగంటలో మృతి చెందింది.


ల్లెల్లో ప్రథమ చికిత్స అందించే కొందరు ఆర్‌ఎంపీ, పీఎంపీలు తెలిసీ తెలియని పరిజ్ఞానంతో రోగుల ప్రాణాలు తీస్తున్నారు. వైద్యం పూర్తిగా తెలియకపోయినా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దెబ్బతగిలితే కట్టు కట్టి వదిలేయాల్సిన వీరు రకరకాల మందులతో పాటు ఇంజక్షన్లు వేస్తున్నారు. అధిక మోతాదు కలిగిన మాత్రలను ఇస్తుండటం, ప్రతి వ్యాధికీ ఇంజక్షన్‌ ఇవ్వడం పరిపాటిగా మారింది. గ్రామాల్లో ఎక్కువగా ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు  సొంత ఔషధ దుకాణాలుంటాయి. దీంతో జ్వరాల బారిన పడిన వారికి, దగ్గు తదితర ఇబ్బందులకూ విచ్చలవిడిగా మందులు రాస్తున్నారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలతో వెళ్లినా రూ.800 వరకు లాగుతున్నారని బాధితులు చెబుతున్నారు.

పీహెచ్‌సీల్లో సేవలు అందకనే..

* ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్‌ఎంపీలు, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం మెడికల్‌ ప్రాక్టీషనర్లు ప్రిస్క్రిప్షన్లు రాయడం నేరం. కానీ వీరు ఏకంగా ఎంబీబీఎస్‌, ఎండీ తరహాలో లెటర్‌ ప్యాడ్‌లపై మందులు రాస్తున్నారు.

* ఏదైనా వ్యాధితో ఆర్‌ఎంపీ, పీఎంపీల వద్దకు వెళ్తే ముందుగా రక్త, మూత్ర పరీక్షలు చేయిస్తున్నారు. ఆ తర్వాత జబ్బు తగ్గకపోతే జిల్లాకేంద్రాల్లో తమకు తెలిసిన మంచి వైద్యులున్నారంటూ ప్రైవేటు ఆసుపత్రులకు సిఫార్సు చేస్తున్నారు. పెద్దాసుపత్రుల యాజమాన్యంతో కుమ్మక్కై పర్సంటేజీలు తీసుకుంటున్నారు.

* స్కానింగ్‌, వివిధ రక్త, మూత్ర పరీక్షలకు ఒక్కో దానికి ఒక్కో ధర నిర్ణయిస్తున్నారు. ఒక రోగిని పంపిస్తే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు కమీషన్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా 500 మంది ఆర్‌ఎంపీలు, 450 మంది పీఎంపీలున్నారు.


* మెడికల్‌ ప్రాక్టీషనర్లకు చెందిన ప్రథమ చికిత్స కేంద్రాల్లో ఒక్క టేబుల్‌ మాత్రమే ఉండాలి. అలాంటిది నాలుగేసి పడకలు వేస్తున్నారు. సెలైన్‌ ఎక్కిస్తూ, వివిధ పరీక్షలు చేయిస్తున్నారు. సంతానం లేని వారికి పరీక్షల పేరిట అదనంగా వసూళ్లు చేస్తున్నారు. కొన్ని చోట్ల మగ పిల్లలు కావాలనుకునే వారికి మందులిస్తామంటూ బుకాయిస్తున్నారు. వీరి ఆగడాలపై జిల్లా వైద్యారోగ్య శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.


ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
-ప్రమోద్‌కుమార్‌, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి

ఆర్‌ఎంపీలు, పీఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే నిర్వహించాలి. క్లీనిక్‌లు ఏర్పాటు చేసి పడకలు వేసి రోగులను చేర్చుకోవడం, ఇంజక్షన్లు వేయడం తదితర పనులు చట్టరీత్యా నేరం. ఇటీవలే ధర్మారంలో ఆర్‌ఎంపీ వైద్యుడు అదనంగా పడకలు ఏర్పాటు చేస్తే తొలగించాం. ఆర్‌ఎంపీ క్లీనిక్‌లపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని