logo

అక్రమాలకు సహకరించాలంటూ ఒత్తిడి!

అక్రమాలకు సహకరించాలంటూ అధికారులపై కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిడి. నిబంధనలు పక్కన పెట్టి పనులు చేయాలని వేధింపులు. ఇలా రామగుండం నగరపాలికలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Published : 29 May 2023 04:38 IST

అధికారుల ససేమిరా?

న్యూస్‌టుడే, గోదావరిఖని: అక్రమాలకు సహకరించాలంటూ అధికారులపై కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిడి. నిబంధనలు పక్కన పెట్టి పనులు చేయాలని వేధింపులు. ఇలా రామగుండం నగరపాలికలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత కాలంగా అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సాగుతున్న ఈ వ్యవహారం అదనపు పాలనాధికారి వద్దకు చేరింది. స్వయంగా ఆయన సమక్షంలోనే ఇరు వర్గాలతో మూడు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. ఓ ప్రజాప్రతినిధి నగరపాలక వాహనాలు పక్కన పెట్టి తనకు సంబంధించిన వాటిని వినియోగించాలని అందులో ప్రస్తావించినట్లు తెలిసింది. దీంతో పాటు తనకు రావాల్సిన ఆదాయ వనరుల విషయాన్ని సైతం వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నగరపాలికలో వినియోగిస్తున్న చెత్త ట్రాక్టర్‌లు, ట్రాలీలతో పాటు నీటి ట్యాంకర్లను జీపీఎస్‌ విధానంతో నిర్వహిస్తున్నారు. వాహనం ప్రారంభమైనప్పటి నుంచి వెళ్లిన ప్రదేశాలు, ఎన్ని కిలోమీటర్ల పరిధిలో వాహనం తిరిగిందన్న విషయం పక్కాగా తెలుస్తుంది. గతంలో జీపీఎస్‌ విధానం లేని సమయంలో వాహనాలు ఎక్కడ తిరుగుతున్నాయి. ఎంతదూరం వెళ్లాయన్న విషయంలో లెక్కలు లేకపోవడంతో డీజిల్‌ వాడకం ఇష్టారాజ్యంగా జరిగిందన్న ఆరోపణలున్నాయి. డీజిల్‌ వినియోగంలో గతంలో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. కార్పొరేషన్‌ వాహనాల పేరు మీద ఇతరులు సైతం తమ వాహనాల్లో ఇంధనాన్ని నింపుకునే వారనే విమర్శలున్నాయి. దీంతో నగరపాలక సంస్థకు డీజిల్‌ బిల్లులు భారీ మొత్తంలో వచ్చేవి. ప్రస్తుతం ఏ వాహనంలో ఎంత డీజిల్‌ పోస్తున్నారు. అది ఎన్ని కిలోమీటర్ల దూరం తిరిగింది అన్న సమాచారం పక్కాగా ఉండటంతో అక్రమాలకు అవకాశం లేకుండా పోయింది. అయినా ఓ ముఖ్య ప్రజాప్రతినిధి తన వాహనాలకు డీజిల్‌ పోయాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అధికారులు ఈ విషయాన్ని జిల్లా అదనపు పాలనాధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనిపై ఇరు పక్షాలతో నిర్వహించిన సమావేశంలో ఆ ప్రజాప్రతినిధి మళ్లీ అదే విషయాన్ని ప్రస్తావించగా అధికారులు వ్యతిరేకించినట్లు సమాచారం.

అభివృద్ధి పనుల్లో...

కార్పొరేషన్‌ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని పనులను నిబంధనలకు విరుద్ధంగా కేటాయించాలని పలువురు ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. ఇప్పటికే నగరపాలిక ఆధ్వర్యంలో చేపడుతున్న పనులపై విజిలెన్సుకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ పనుల విషయం తమకు ఎక్కడ చుట్టుకుంటుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిబంధనలకు విరుద్ధంగా పనిచేయలేమని, తమపై ఒత్తిడి లేకుండా చూడాలని ఉన్నతాధికారికి విన్నవించుకున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని