logo

ఈత సాగు.. ఉపాధి బాగు

జగిత్యాల జిల్లాలో ఈత వనం సాగు చేపట్టి మంచి ఫలితాలు పొందుతున్నారు. సూక్ష్మ సేద్యం పద్ధతిలో చేపట్టిన సాగు తక్కువ కాలంలోనే గీతకు రావడమే కాకుండా గీత కార్మికులు ఈత నీరా ఉత్పత్తి చేస్తూ ఉపాధి పొందుతున్నారు.

Published : 29 May 2023 04:43 IST

అంతర్గాంలో 5 వేల  మొక్కల పెంపకం

సూక్ష్మ సేద్యం పద్ధతిలో నాటిన ఈత మొక్కలు

న్యూస్‌టుడే జగిత్యాల గ్రామీణం: జగిత్యాల జిల్లాలో ఈత వనం సాగు చేపట్టి మంచి ఫలితాలు పొందుతున్నారు. సూక్ష్మ సేద్యం పద్ధతిలో చేపట్టిన సాగు తక్కువ కాలంలోనే గీతకు రావడమే కాకుండా గీత కార్మికులు ఈత నీరా ఉత్పత్తి చేస్తూ ఉపాధి పొందుతున్నారు. జగిత్యాల గ్రామీణ మండలం అంతర్గాంలో చేపట్టిన ఈత సాగు ద్వారా వంద కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది.
జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామ గీత కార్మికులు ఈత సాగు ద్వారా రెండేళ్లుగా నీరా తయారుచేస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకున్నారు. ఆరేళ్ల కిందట ఐదు ఎకరాల్లో 5 వేల ఈత మొక్కలను ప్రభుత్వ పథకం ద్వారా నాటి సూక్ష్మ సేద్యం పద్ధతిలో సాగు చేపట్టారు. పదేళ్లకు గీతకు వచ్చే చెట్లు బిందుసేద్య పద్దతిలో ఎరువులు, నీళ్లు నిత్యం అందించడంతో నాలుగేళ్లకే గీతకు వచ్చాయి. దీంతో రెండేళ్లుగా కల్లుగీస్తూ సమీపంలోనే జగిత్యాల పట్టణ వాసులకు నీరా, కల్లును విక్రయిస్తున్నారు. గతంలో ఉపాధి లేక గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన కార్మికులు గ్రామానికి తిరిగివచ్చి గ్రామంలోనే ఉపాధి పొందుతున్నారు. ఈత వనం సాగు కోసం స్థానిక నాయకులు మాకునూరి జితేందర్‌రావు బీజం పోయగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ సహకారం అందించారు. ఫలితంగా గ్రామంలో వందకు పైగా కుటుంబాలు రోజూ రూ.2 నుంచి రూ.3 వేల వరకు సంపాదిస్తున్నారు.


నీరాకేఫ్‌ ఏర్పాటుకు సన్నాహాలు

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నీరా కేఫ్‌ ఏర్పాటు చేయడంతో మంచి ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో స్థానికంగా అంతర్గాంలోనే నీరా కేఫ్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు గీత కార్మిక సంఘ అధ్యక్షుడు గొడిసెల బాలు అన్నారు. ఇప్పటికే షెడ్డు నిర్మాణం జరగగా కేఫ్‌ను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్ది పట్టణ వాసులు ఇక్కడికి వచ్చి నీరా తాగి వెళ్లేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాత్రివేళ సేద తీరేందుకు భారీ హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఇందుకోసం గత కలెక్టర్‌ రూ.3 లక్షలను మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయని, మోడల్‌ నీరా కేఫ్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.


మండల స్థాయిలో..
-బాలు, గౌడ సంఘ అధ్యక్షుడు

నీరా కేఫ్‌లను హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలో జిల్లా నుంచి మండల స్థాయి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. దీని ద్వారా గీత కార్మికులకు ఉపాధి లభిస్తుంది. చాలా మంది గీత కార్మికులకు ఉపాధి లేక వృత్తిని వదులుకొని విదేశాలకు వెళ్లి పనిచేస్తున్నారు. మండల స్థాయిలో నీరా కేఫ్‌లను ఏర్పాటు చేస్తే గీత కార్మికులకు ఉపాధి లభిస్తుంది.  


ప్రభుత్వం సాయం అందించాలి
-శ్రీనివాస్‌ గౌడ సంఘ ఉపాధ్యక్షుడు

ప్రభుత్వం 5 వేల మొక్కలు ఇవ్వడంతో అవి ఇప్పుడు గీతకి వచ్చాయి. నీరాను తీసి పట్టణాలకు పంపిణీ చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం నీరా కేఫ్‌ ఏర్పాట్లలో ఉన్నాం. ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి సాధ్యం అవుతుంది. ప్రభుత్వం సహాయం చేస్తే చుట్టుపక్కల జిల్లాలకు, మండలాలకు నీరాని అందిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని