logo

పౌష్టికాహారం పంపిణీలో ప్రత్యేక ముద్ర

చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ ఆరోగ్యం.. పూర్వ ప్రాథమిక విద్య బలోపేతమే లక్ష్యంగా అంగన్‌వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటి ఆధ్వర్యంలో ప్రభుత్వం నెల నెలా కోడిగుడ్డు, ఇతర పౌష్టికాహార సరకులు పంపిణీ చేస్తోంది.

Published : 29 May 2023 04:48 IST

అంగన్‌వాడీల్లో ప్రభుత్వ లోగోతో కూడిన కోడిగుడ్లు
వచ్చే నెల నుంచి అమలు

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ ఆరోగ్యం.. పూర్వ ప్రాథమిక విద్య బలోపేతమే లక్ష్యంగా అంగన్‌వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటి ఆధ్వర్యంలో ప్రభుత్వం నెల నెలా కోడిగుడ్డు, ఇతర పౌష్టికాహార సరకులు పంపిణీ చేస్తోంది. అయితే కొందరు అక్రమార్కుల దాహార్తితో అవి పక్కదారి పడుతున్నాయి. మరోవైపు కుళ్లిన, చిన్న పరిమాణం కలిగిన గుడ్లు సరఫరా చేస్తుండటంతో చెత్త పాలవుతున్నాయి. ఈ క్రమంలో సమగ్ర శిశు సంక్షేమ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అక్రమాలను నియంత్రించేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇకపై ప్రతి కోడిగుడ్డుపై ‘అంగన్‌వాడీ గుడ్డు’ అని రాసి ఉన్న ముద్ర వేస్తున్నారు. జూన్‌ నెలలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

పక్కదారి పడుతున్న సరకులు

అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరిన మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం, గుడ్డు, ఆరేళ్లలోపు వారికి గుడ్డు, పప్పు, కూరగాయల భోజనం, కురుకరే అల్పాహారం, బలవర్ధకమైన పల్లీ పట్టీలు అందిస్తున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకంలో ప్రతి రోజూ 200 మి.లీ.ల పాలు సరఫరా చేస్తున్నారు. బరువు తక్కువగా, బలహీనంగా ఉన్న లబ్ధిదారులకు రెట్టింపు స్థాయి పౌష్టికాహారం పంపిణీ అవుతోంది. అయితే అధికారుల పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉండటంతో సిబ్బంది సరకులను పక్కదారి పట్టిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.


కుళ్లిన గుడ్డు, చిన్న పరిమాణం

* అంగన్‌వాడీ లబ్ధిదారులకు కోడిగుడ్డు పంపిణీలో పాలకుల నిర్లక్ష్యం కనిపిస్తోంది.

* చాలా చోట్ల కేంద్రాలకు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు రావడం లేదు.

* లబ్ధిదారుల పేరిట నెలనెలా వస్తున్న కోడిగుడ్డు, ఇతర సరకులను సిబ్బంది మింగేస్తున్నారు.

* టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు నాణ్యమైన గుడ్డు సరఫరా చేయడం లేదు.

* కుళ్లిపోయిన, చిన్న పరిమాణంలో ఉన్న గుడ్లను తినేందుకు లబ్ధిదారులు నిరాసక్తత కనబరుస్తున్నారు.

* కొన్ని చోట్ల కేంద్రాలకు తీసుకురాకుండానే సిబ్బంది గుడ్డును అమ్ముకుంటున్నారు.

కోడిగుడ్డుపై వేసిన ముద్ర


నెలలో మూడు రంగుల్లో..

ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 3,135 అంగన్‌వాడీ కేంద్రాలుండగా వీటిలో 3,050 ప్రధాన, 85 మినీ కేంద్రాలున్నాయి. మూడేళ్లలోపు పిల్లలు ఒక లక్ష, మూడు నుంచి ఆరేళ్లలోపు 76,100 మంది చిన్నారులు, 39 వేల మంది గర్భిణులు, బాలింతలు నమోదయ్యారు. కోడిగుడ్ల పంపిణీలో అక్రమాలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తోంది. నెలలో పది రోజులకోసారి కోడిగుడ్లపై ప్రత్యేక రంగుతో కూడిన ముద్రను వేస్తోంది. మొదటి విడతలో నీలి, రెండో విడతలో ఎరుపు, మూడో విడతలో ఆకుపచ్చ రంగుల్లో ‘అంగన్‌వాడీ గుడ్డు’ మధ్యలో జోన్‌-1 అని ముద్రించారు. రాష్ట్ర వ్యాప్తంగా అయిదు జోన్ల పరిధిలో గుత్తేదారులకు బాధ్యతలు ఇచ్చారు. కుళ్లిపోతే గుత్తేదారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మూడు రంగుల ముద్ర ఉండటంతో దుర్వినియోగానికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.


లబ్ధిదారులకు పక్కాగా పౌష్టికాహారం
-రవూఫ్‌ఖాన్‌, జిల్లా సంక్షేమ అధికారి, పెద్దపల్లి

అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులు, బాలింతలు, గర్భిణుల సంపూర్ణ ఆరోగ్యం కోసం నెలనెలా కోడిగుడ్డు పంపిణీ చేస్తున్నాం. సరఫరాలో అక్రమాలు లేకుండా పంపిణీ చేసేందుకు మూడు రంగుల్లో ముద్ర వేస్తున్నాం. వచ్చే నెలలో ముద్ర ఉన్న కోడిగుడ్లనే పంపిణీ చేయనున్నాం. దీంతో లబ్ధిదారులకు పక్కాగా పౌష్టికాహారం అందనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని