logo

ఇంటింటా ఓటరు సర్వే

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు వ్యూహారచనలు చేస్తున్నాయి.. ఎన్నికల సంఘం కూడా అందుకు అనుగుణంగా ఇంటింటా ఓట్ల పరిశీలన, కొత్త వారి నమోదుకు దరఖాస్తుల స్వీకరణ, సవరణలు చేపట్టే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Published : 29 May 2023 04:51 IST

ఆధార్‌తో అనుసంధానం

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు వ్యూహారచనలు చేస్తున్నాయి.. ఎన్నికల సంఘం కూడా అందుకు అనుగుణంగా ఇంటింటా ఓట్ల పరిశీలన, కొత్త వారి నమోదుకు దరఖాస్తుల స్వీకరణ, సవరణలు చేపట్టే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈనెల 25 నుంచి శ్రీకారం చుట్టగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశానికి పాలనాధికారి, అదనపు పాలనాధికారి, ఇతర అధికారులు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో కూడా ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ కలెక్టరేట్‌ ఆడిటోరియంలో బూత్‌స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లు, సహాయ ఎన్నికల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. నియోజకవర్గాల వారీగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు. జిల్లాలో ఇప్పటికే ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, ఆధార్‌ కార్డుతో అనుసంధానం వంటివి కొనసాగుతున్నాయి.

నమోదు.. పరిశీలన

అన్ని నియోజకవర్గాలలో బీఎల్వోలు ఈనెల 25 నుంచి ఇంటింటా పరిశీలన ప్రారంభించారు. ఈ ప్రక్రియ వచ్చే నెల 23 వరకు కొనసాగుతుంది. అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారితో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పిస్తారు. రెండు ఓట్లు కలిగి ఉన్న వారితో మాట్లాడి ఒక ఓటు ఉండేలా దరఖాస్తు తీసుకుంటారు. చనిపోయిన వారి వివరాలు సేకరించి వాటిని తొలగించే చర్యలు చేపడతారు. ఓటు ఉండి వలస వెళ్లిన వారి వివరాలు సేకరిస్తారు. ఆధార్‌తో అనుసంధానం చేసుకునేలా ప్రోత్సహిస్తారు.

అక్టోబరు 4న తుది ఓటరు జాబితా

అన్ని రకాలుగా వచ్చిన దరఖాస్తులను జులై 25 నుంచి 31 వరకు పరిశీలన పూర్తి చేసి అక్టోబరు 1 నాటికి అర్హులైన వారిని జాబితాలో చేర్చడానికి అంతర్జాలంలో వివరాలు నమోదు చేస్తారు. వీటి ఆధారంగా ఆగస్టు 2న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. అదే నెల 2 నుంచి 31 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈ మధ్యలో ఓటరు నమోదు, తొలగింపు, మార్పులపై రెండు శనివారాలు, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 22న అభ్యంతరాలపై వివరణ ఇస్తారు. అక్టోబరు 4న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు.


పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు

జూన్‌ 24 నుంచి జులై 24 వరకు ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలను గుర్తించడం, వాటి సౌకర్యాలను పరిశీలిస్తారు. ఒక పోలింగ్‌ కేంద్రంలో 1500 మంది ఓటర్లు ఉండేలా సరి చూసుకుంటారు. అవసరమైన చోట కొత్త కేంద్రాలను ఏర్పాటుకు ఫొటోలతోపాటు ప్రతిపాదనలు పంపిస్తారు.


ఆధార్‌, మొబైల్‌ నంబరు నమోదు చేయించాలి
- జి.శ్యాంప్రసాద్‌లాల్‌, అదనపు పాలనాధికారి, కరీంనగర్‌

ఇంటింటా సర్వే పకడ్బందీగా నిర్వహిస్తాం. 18 ఏళ్లు నిండిన వారందరికి ఓటు హక్కు కల్పిస్తాం. ప్రతి ఓటరు ఆధార్‌, మొబైల్‌ నెంబర్‌ నమోదు చేయించాలి. నియోజకవర్గాల వారీగా జరిగే సర్వేలో ఎన్నికల సిబ్బందికి సహకరించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని