logo

చేపల వంటకాలు.. నోరూరించేందుకు సిద్ధం

జిల్లాలోని జలాశయాలు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటంతో ఏటా ప్రభుత్వం చేప, రొయ్య పిల్లలను వదలుతుంది. దీంతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి.

Published : 01 Jun 2023 05:37 IST

చేపల వంటకాలు.. నోరూరించేందుకు సిద్ధం
న్యూస్‌టుడే, బోయినపల్లి

వివిధ రకాల వంటలు

జిల్లాలోని జలాశయాలు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటంతో ఏటా ప్రభుత్వం చేప, రొయ్య పిల్లలను వదలుతుంది. దీంతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఈనెల 8 నుంచి 10 వరకు చేపల ఆహార ఉత్సవం (ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాల సభ్యులకు హైదరాబాద్‌లో శిక్షణ ఇప్పించారు. మూడు రోజులు నోరూరించే వివిధ రకాల చేపల వంటకాలు జిల్లావాసులకు అందుబాటులో ఉండనున్నాయి.

జిల్లాలో మధ్యమానేరు, ఎగువ మానేరు, అన్నపూర్ణ జలాశయంతోపాటు చెరువులు, కుంటలు ఉన్నాయి. ఈ ఏడాది 430 చెరువులు, జలాశయాల్లో చేప, రొయ్య పిల్లలను వదిలారు. రాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయంలో 28.50 లక్షల చేప, 26.63 లక్షల రొయ్య పిల్లలు, ఎగువమానేరులో 10.50 లక్షల చేప, 5.25 లక్షల రొయ్య పిల్లలను వదిలారు. వీటితో మత్స్యకారులకు నిత్యం ఉపాధి లభిస్తుంది. తాజా చేపలు లభిస్తుండటంతో జలాశయం వద్దకు వచ్చి సమీప గ్రామాల ప్రజలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ప్రధాన రహదారి వెంబడి ఉన్న టేలాల వద్ద వ్యాపారుల నుంచి వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది మధ్యమానేరు జలాశయంలో చేపలు 1,800 టన్నులు, రొయ్యలు 295, ఎగువమానేరులో చేపలు 850, రొయ్యలు 42 టన్నుల ఉత్పత్తి వస్తుందని అధికారులు అంచనా వేశారు. వీటి రుచులను జిల్లా వాసులకు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

శిక్షణలో మహిళా మత్స్యపారిశ్రామిక సంఘాల సభ్యులు

హైదరాబాద్‌లో మహిళలకు శిక్షణ

రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా జిల్లాలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో చేపల ఆహార ఉత్సవం (ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కేంద్రంలోని సమీకృత రైతు మార్కెట్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రూ.3 లక్షలను కేటాయించారు. జిల్లాలోని మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాల్లోని సభ్యులకు హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం, హాస్పటాలిటి మేనేజ్‌మెంట్‌ (నీతమ్‌)లో జిల్లా మత్స్యశాఖ నుంచి 24 మందికి 40 రకాల వంటకాలపై నిష్ణాతులైన చెఫ్‌లతో శిక్షణ ఇప్పించారు. 10 స్టాల్స్‌ ఏర్పాటు చేసి ఒక్కో స్టాల్స్‌లో నాలుగు రకాల వంటలను అందుబాటులో ఉంచనున్నారు. చాలా మందికి చేపలు అనగానే చేపల పులుసు, ఫ్రై అధికంగా గుర్తుకొస్తాయి. అయితే అనేక మందికి తెలియని వివిధ రకాల వంటకాలను స్టాల్స్‌లో ప్రదర్శించనున్నారు. చేపల పులుసు, పచ్చళ్లు, సమోసా, బర్గర్‌, పకోడి, కట్‌లెట్స్‌, రొయ్య బిర్యాని, పకోడి, వేపుడు, పచ్చళ్లు, బటర్‌ఫ్లై, అపోలో చేప, ఫిష్‌ ఫింగర్‌, రొయ్య బటర్‌ఫ్లై, చేప మంచూరియా, కొర్ర మీను పచ్చళ్లు, స్మోకెడ్‌ చేప తదితర రకాల వంటకాలు చేయనున్నారు. మత్స్య సహకార సంఘాలు బలోపేతం కావడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.


విజయవంతం చేయాలి

జిల్లా కేంద్రంలో మూడు రోజులు ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే 24 మందికి శిక్షణ పూర్తయింది. 10 స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నాం. మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. స్టాల్స్‌ను ప్రతి ఒక్కరూ సందర్శించి చేపల ఆహార ఉత్సవాన్ని విజయవంతం చేయాలి.

శివప్రసాద్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు