logo

అసౌకర్య ప్రయాణం

సామాన్యులకు రైలు ప్రయాణం నరకప్రాయంగా మారింది. విపరీతమైన ఉష్ణోగ్రతలకు తోడు టిక్కెట్టు కొనుక్కొని కనీసం బోగిలో నిలబడేందుకు కూడా చోటు దక్కకపోవడంతో ప్రయాణికులు రైల్వేశాఖపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Published : 01 Jun 2023 05:37 IST

జనరల్‌ బోగీల్లో సామాన్యులకు అవస్థలు  
ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

జనరల్‌ బోగిలో కిక్కిరిసి వెళ్తున్న ప్రయాణికులు (పాత చిత్రం)

సామాన్యులకు రైలు ప్రయాణం నరకప్రాయంగా మారింది. విపరీతమైన ఉష్ణోగ్రతలకు తోడు టిక్కెట్టు కొనుక్కొని కనీసం బోగిలో నిలబడేందుకు కూడా చోటు దక్కకపోవడంతో ప్రయాణికులు రైల్వేశాఖపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సూపర్‌ ఫాస్ట్‌ రైలుకు గరిష్ఠంగా 20 వరకు బోగీలుంటే.. రైలు ముందు ఒకటి, చివర ఒక జనరల్‌, దివ్యాంగుల బోగీలు తగిలించి రైల్వే శాఖ చేతులు దులుపుకుంటోంది. వేసవిలో ప్రయాణాలు ఎక్కువ చేస్తుండటంతో సామాన్యులు రైలెక్కితే నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితి ఉంది.

సికింద్రాబాద్‌ నుంచి పాట్నాలోని దానాపూర్‌కు వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, తెలంగాణ, జీటీ, కేరళ, ఇతర అన్నీ రైళ్లల్లోనూ జనరల్‌ నుంచి ఏసీ బోగీల వరకు ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంత జనాలు ఉంటున్నారు. ఇటీవలే కొందరు ఓదెల, కొలనూర్‌, రామగుండం రైల్వే స్టేషన్ల పరిధిలో బోగీల్లో రద్దీ మూలంగా వేగంగా వెళ్తున్న రైలు నుంచి పట్టుతప్పి మృత్యువాతపడ్డ ఘటనలు న్నాయి. తీవ్ర గాయాలపాలైనవారూ ఉన్నారు.

ఇదీ పరిస్థితి

* కరీంనగర్‌ వయా పెద్దపల్లి నుంచి మంచిర్యాలకు రాజీవ్‌ రహదారిపై వెళితే బస్సులో సుమారు 84 కిలోమీటర్ల మేర మూడు గంటల కంటే ఎక్కువ సమయం పడుతోంది. అదే రైలులో అయితే పెద్దపల్లి నుంచి మంచిర్యాలకు అరగంటలోపే వెళ్లే అవకాశం ఉంది. గతంలో చాలా మంది ప్రయాణికులు కరీంనగర్‌ నుంచి మంచిర్యాల, బెల్లంపల్లి, ఆదిలాబాద్‌లకు వెళ్లాలంటే పెద్దపల్లి బస్టాండ్‌లో దిగి అక్కడి నుంచి సమయానికి అందుబాటులో ఉండే ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసింజర్‌ రైళ్లకు వెళ్లేవారు. ఇదే తరహాలో సికింద్రాబాద్‌కు వెళ్లిన దాదాపు 5 గంటలకుపైగా బస్సులో సమయం పడుతోంది. అదే రైలులో అయితే 3 గంటల్లో గమ్యస్థానం చేరుకుంటాం.

* నిత్యం కరీంనగర్‌, నిజామాబాద్‌ల నుంచి మంచిర్యాల, బల్లార్షాలకు వెళ్లే ఉపాధ్యాయులు, ఉద్యోగులు, చిరువ్యాపారులు, సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు రైళ్లు కాకుండా బస్సుల్లో ప్రయాణించాలంటే ఆలోచిస్తున్నారు. సమయపాలన లేని బస్సులు, నిత్యం రద్దీ, అస్తవ్యస్తంగా రహదారులు, ట్రాఫిక్‌ బాధలు, గంటలకొద్దీ ప్రయాణాలు వెరసి రోజులో సగం సమయం ప్రయాణానికే కేటాయించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. పెరిగిన బస్సు ఛార్జీల మూలంగా భారంగా భావిస్తున్నారు.

* తప్పని పరిస్థితుల్లో రైలు ఎక్కితే బోగీల్లోని మరుగుదొడ్లు, లగేజీ ర్యాక్‌లు, సీట్ల కింద, మీద ఎక్కడపడితే అక్కడ ప్రయాణికులు చోటు సంపాదించుకోవాల్సిన పరిస్థితి. అత్యవసరంగా తాగునీటికి, మరుగుదొడ్లకు వెళ్లాలంటే చాలా కష్టంగా ఉంటుందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రభుత్వాలు కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నప్పటికీ జనరల్‌ బోగీలు అదనంగా పెంచాలని, సామాన్యులకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు