logo

యోగా శిక్షణ.. తప్పని నిరీక్షణ

ప్రస్తుత ఉరుకుల, పరుగుల జీవితంలో చాలా మంది శారీరక శ్రమకు దూరమవుతున్నారు. పని ఒత్తిడితో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Published : 01 Jun 2023 05:37 IST

వృథాగా ఆరోగ్య స్వస్థత కేంద్రాలు
న్యూస్‌టుడే, ఇబ్రహీంపట్నం

నిర్మాణం పూర్తయి వృథాగా యోగా కేంద్రం

ప్రస్తుత ఉరుకుల, పరుగుల జీవితంలో చాలా మంది శారీరక శ్రమకు దూరమవుతున్నారు. పని ఒత్తిడితో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్‌ వంటి దీర్ఘాకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలకు అనుబంధంగా జాతీయ ఆయుష్‌ మిషన్‌ ద్వారా యోగా(ఆరోగ్య స్వస్థత) కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో రోగులకు యోగా శిక్షణ ఇవ్వనుంది.

మొదటి విడతలో 12..

జిల్లాలో 18 మండలాలు ఉండగా మొదటి విడతలో 12 యోగా కేంద్రాల నిర్మాణానికి నిధులను గతేడాది మంజూరు చేసింది. ఒక్కో కేంద్రానికి రూ.6 లక్షల చొప్పున మొత్తం రూ.72 లక్షలను కేటాయించారు. జిల్లాలో వివిరావుపేట్‌, వెల్లుల్ల, బండలింగపూర్‌, ఎండపల్లి, కొడిమ్యాల, మేడిపల్లి, అయిలాపూర్‌, బతికేపల్లి, ధర్మపురి, లక్ష్మిపూర్‌, చిల్వాకోడూర్‌, అల్లీపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల ఆవరణలో వీటిని నిర్మిస్తున్నారు. వీటిలో చిల్వాకోడూర్‌, అల్లిపూర్‌లో నిర్మాణ పనులు జరుగుతుండగా, మిగిలిన వాటిలో నిర్మాణాలు పూర్తయ్యాయి.

ఒక్కో కేంద్రానికి ఇద్దరు శిక్షకులు

ఒక్కో యోగా కేంద్రంలో ఇద్దరు శిక్షకులను నియమించనున్నారు. ఆడవారికి శిక్షణ ఇవ్వడానికి ఆడ, మగ వారికి శిక్షణ ఇవ్వడానికి మగ శిక్షకుడు ఉంటారు. ఆడ, మగ వారికి ఒకే సమయంలో కాకుండా వేర్వేరు సమయాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. పలు చోట్ల కొన్ని నెలల క్రితమే నిర్మాణాలు పూర్తికావడంతో వృథాగా ఉంటున్నాయి. శిక్షకులను నియమిస్తే యోగా కేంద్రాలు అందుబాటులోకి వచ్చి, ప్రజలకు, గర్భిణులు, దీర్ఘకాలిక రోగులకు మేలు జరగనున్నాయి.

సొంత భవనాలు లేక వేరే చోట..

బండలింగాపూర్‌, వెల్లుల్ల, ఎండపల్లి, కోరుట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడం, ఇతర కారణాలతో వాటికి మంజూరైన యోగా కేంద్రాలను వేరే చోట నిర్మించారు. బండలింగాపూర్‌కు మంజూరైన యోగా కేంద్రం ఇబ్రహీంపట్నంలో, వెల్లుల్ల యోగా కేంద్రం జగ్గాసాగర్‌లో, ఎండపల్లి యోగా కేంద్రం అంబరిపేట్‌లో, కోరుట్ల యోగా కేంద్రం అయిలాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవరణలో నిర్మించారు.


నియామకం పూర్తయితే..

- శ్రీనివాస్‌, జిల్లా వైద్య మరియు ఆరోగ్య ఉప వైద్యాధికారి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవరణలో ఏర్పాటు చేసిన యోగా కేంద్రాల్లో రక్తపోటు, మధుమేహ, థైరాయిడ్‌ వంటి వాటితో బాధపడుతున్న దీర్ఘాకాలిక రోగులతో పాటు గర్భిణులు, ప్రజలకు యోగా శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షకుల నియామకం పూర్తయిన తర్వాత శిక్షణ ప్రారంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని