logo

వేర్వేరు ఘటనల్లో విద్యుదాఘాతంతో ముగ్గురి మృత్యువాత

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన ఓదెల మండలంలో బుధవారం చోటు చేసుకుంది.

Updated : 01 Jun 2023 06:12 IST

నాంసానిపల్లెలో యువరైతు...

రాకేశ్‌

ఓదెల, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన ఓదెల మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పొత్కపల్లి పోలీసుల కథనం మేరకు.. మండలంలోని నాంసానిపల్లెకు చెందిన నూనె రాకేశ్‌ (23) బుధవారం పంట పొలం వద్ద నారుమడి దున్నేందుకు వెళ్లాడు. నీరు పెట్టే క్రమంలో విద్యుత్తు మోటార్‌ నడవకపోవడంతో స్టార్టర్‌లో ఫ్యూజ్‌ను తీసి పరిశీలించాడు. ఫ్యూజ్‌ వైరు వేసే క్రమంలో చేయికి తీగ తాకి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రాకేశ్‌ తండ్రి సదయ్య ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో రాకేశ్‌ హైదరాబాద్‌లో పనిచేస్తున్న ప్రైవేటు సంస్థను వదిలి ఇంటి దగ్గర ఉన్న భూమిలో వ్యవసాయం చేసుకుని జీవనోపాధి పొందుతామని యువ రైతుగా మారాడు. విద్యుదాఘాతం రూపంలో మృత్యువు బలి తీసుకోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రాకేశ్‌కు తల్లి మంజుల, ఓ సోదరి ఉన్నారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.రామకృష్ణ తెలిపారు.


సుల్తానాబాద్‌లో మిల్లు ఆపరేటర్‌..

తయాబ్‌ ఆలీ మృతదేహం

సుల్తానాబాద్‌: విద్యుదాఘాతంతో బియ్యం మిల్లు ఆపరేటర్‌ మృతిచెందిన ఘటన సుల్తానాబాద్‌ పురపాలిక పరిధిలోని పూసాలలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై విజేందర్‌, బాధితులు తెలిపిన సమాచారం మేరకు.. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం మల్దా జిల్లా హరిచంద్రాపురం మండలం రహమల్‌పూర్‌కు చెందిన తయాబ్‌ ఆలీ(21).. పూసాల పరిధిలోని కామధేనువు బియ్యం మిల్లులో రెండు నెలలుగా మిల్లు ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం మిల్లులో పనులు ముగించుకొని మిల్లు ఆవరణలో ఉన్న తన నివాసానికి వచ్చి స్నానం చేశాడు. ఇనుపతీగపై తడిగా ఉన్న వస్త్రాన్ని ఆరవేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై కుప్పకూలాడు. తోటి కార్మికులు ఆయనను సుల్తానాబాద్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహన్ని పెద్దపల్లి ఆసుపత్రికి తరలించి శవపరీక్షలు చేశారు. మృతుడి బావమరిది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మిల్లు కార్మికులు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసంలో విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. వదులు తీగలు, తెగిన తీగలకు కేవలం ప్లాస్టిక్‌ కవర్లు చుట్టి నిర్లక్ష్యంగా వదిలేయడంతో నివాసం పైకప్పునకు ఉన్న ఇనుప పైపులకు, విద్యుత్తు తీగలు తగలడంతో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.  


మంథనిలో యువకుడు...

కుమారస్వామి

మంథని గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన మంథని పట్టణ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు, ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రచ్చపల్లి గ్రామానికి చెందిన శనిగరం కుమారస్వామి (18).. కొన్ని రోజులుగా పట్టణంలోని ఓ వాటర్‌ సర్వీస్‌ సెంటర్‌లో పని చేస్తున్నాడు. నీటికి విద్యుత్తు సరఫరా అవడాన్ని గమనించని కుమారస్వామి.. హార్వెస్టర్‌కు వాటర్‌ సర్వీసింగ్‌ చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని