logo

నాణ్యమైన వైద్యం.. సేవలు ఉత్తమం

వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి ఏర్పాటైన అనతి కాలంలోనే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అవార్డులు సొంతం చేసుకుంటోంది.

Published : 02 Jun 2023 05:46 IST

వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రికి ఎకోఫ్రెండ్లీ రాష్ట్రస్థాయి అవార్డు

ఆసుపత్రికి వైద్యానికి వచ్చిన రోగులు

న్యూస్‌టుడే, వేములవాడ : వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి ఏర్పాటైన అనతి కాలంలోనే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అవార్డులు సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే కాయకల్ప అవార్డు సొంతం చేసుకోగా, తాజాగా ఎకోఫ్రెండ్లీ రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ రోగుల మన్ననలు పొందుతున్నారు. రాష్ట్రంలో 86.19 శాతం మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచి అవార్డును దక్కించుకుంది.

రాష్ట్రంలో దాదాపు వంద ప్రాంతీయ ఆసుపత్రులుండగా మూడు అంచెల విధానంలో ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ప్రధానంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, పరిశుభ్రత, పరిసరాల నిర్వహణ, సిబ్బంది పని తీరు, వ్యర్థాల సేకరణ, విద్యుత్తు వినియోగం, పచ్చదనం, ప్లాస్టిక్‌ రహిత సేవలు తదితర పది విభాగాల్లో పరిశీలించి మార్కులు కేటాయిస్తారు. వంద మార్కులకు గాను వేములవాడ ఆసుపత్రి 86.19 శాతం మార్కులు సాధించి రాష్ట్రంలో ఎకోఫ్రెండ్లీ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైంది. దీంతో రూ.5 లక్షల నగదు బహుమతి రానుంది. ఈ నగదును ఆసుపత్రి అభివృద్ధికి వినియోగించనున్నారు.

విజయవంతంగా శస్త్రచికిత్సలు...

ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు వివిధ రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో జనరల్‌ వైద్యం, ఆర్థోపెడిక్‌, ఈఎన్‌టీ, గైనిక్‌, పిల్లల వైద్యుడు, నేత్ర, దంత వైద్యం, సైకాలజీ, ఫిజియోథెరపీ రోగులకు వైద్య సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలు వంటివి అందుబాటులో ఉన్నాయి. గర్భిణులకు సుఖ ప్రసవాల కోసం ప్రత్యేక వ్యాయామం చేయిస్తున్నారు. ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ కార్యక్రమంలో మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఆసుపత్రిలో మొత్తం 14 మంది వైద్య నిపుణులు, 19 మంది స్టాఫ్‌నర్సులు, వైద్య సిబ్బంది రోగులకు నిత్యం సేవలందిస్తున్నారు. గత ఆరు నెలల్లో మొత్తం 206 కాన్పులు జరగగా అందులో 102 సాధారణ ప్రసవాలున్నాయి. 103 మందికి మోకీళ్ల శస్త్రచికిత్సలు, 27 మందికి ముక్కు, చెవి శస్త్రచికిత్సలు, 9 మందికి నేత్ర, 18 మందికి సాధారణ శస్త్రచికిత్సలు చేశారు. ఆసుపత్రి నిర్వహణ, పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఆవరణలో మంచి వాతావరణాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. వేములవాడ పట్టణంతో పాటు చుట్టు పక్కల మండలాలైన రుద్రంగి, చుందుర్తి, కోనరావుపేట, వేములవాడ గ్రామీణం, బోయినపల్లి మండలాల రోగులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారికి కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. దీంతో రోజు రోజుకు ఆసుపత్రికి ఆదరణ పెరుగుతోంది.

అందరి కృషితోనే...

ఆర్‌.మహేష్‌రావు, ప్రాంతీయ ఆసుపత్రి  సూపరింటెండెంట్‌, వేములవాడ

ఆసుపత్రికి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. తాము రోగులకు అందిస్తున్న సేవలకు ఈ అవార్డుతో గుర్తింపు లభించింది. ఆసుపత్రి అభివృద్ధికి మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ప్రోత్సాహం ఉంది. అందరి సమష్టి కృషి, స్వచ్ఛమైన, నాణ్యమైన వైద్యం అందించేందుకు వైద్య బృందం, సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది కృషి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని