logo

చూపు దూరమవుతోంది..

జిల్లాలో కంటి వెలుగు పరీక్షలు తుది దశకు చేరాయి. జనవరి 19 నుంచి నిర్విరామంగా పల్లె, పట్టణాల్లో నేత్ర వైద్య వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి.

Published : 02 Jun 2023 05:46 IST

జిల్లాలో తుది దశకు చేరిన నేత్ర పరీక్షలు
శస్త్రచికిత్సలపై బాధితుల నిరీక్షణ

కంటి పరీక్ష చేస్తున్న నేత్ర వైద్య సహాయకులు

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌ : జిల్లాలో కంటి వెలుగు పరీక్షలు తుది దశకు చేరాయి. జనవరి 19 నుంచి నిర్విరామంగా పల్లె, పట్టణాల్లో నేత్ర వైద్య వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 34 నేత్ర వైద్య బృందాలు 3,91,219 మందిని పరీక్షించాయి. 1,55,431 మంది కంటి సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. వైద్య శిబిరాలకు జనాలను తరలించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా శ్రమించారు. ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. దగ్గర, దూరపు చూపు అద్దాలు పంపిణీ చేస్తుండగా శస్త్ర చికిత్సలపై కొంత సందిగ్ధం నెలకొంది. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయాలనే ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది.

సమీక్షలతో సత్ఫలితాలు

జిల్లాలో 267 గ్రామ పంచాయతీలు, రామగుండం నగరపాలకసంస్థ, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీల్లో మొత్తం 8,89,729 జనాభా ఉంది. ఇందులో 18 ఏళ్లు నిండిన వారు 4,87,124 మందికి నేత్ర పరీక్ష చేయాలని నిర్ణయించారు. మొదట్లో ఉత్సాహం చూపిన ప్రజలు క్రమక్రమంగా శిబిరాలకు రావడం తగ్గించారు. దీంతో అధికారులు కరపత్రాలతో చైతన్యం కల్పించారు. వైద్య, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శిబిరాలకు వచ్చేందుకు కష్టించారు. జిల్లా స్థాయిలో తరచూ సమీక్షలు చేయడంతో సత్ఫలితమిచ్చింది.

కంటి సమస్యలు అధికం

జిల్లాలో బొగ్గు గనులు, క్వారీలు, ఇటుక బట్టీలు, రైసు మిల్లుల కాలుష్య ప్రభావం నేత్ర సమస్యలకు దారితీస్తున్నాయి. చరవాణులు, కంప్యూటర్లు, ట్యాబ్‌లను అస్తమానం వినియోగించడంతో చూపు తగ్గుతోంది. ఉద్యోగ ప్రస్థానంలో పని ఒత్తిడికి గురవుతుండటంతో రక్తపోటు, మధుమేహం పెరుగుతోంది. అవగాహన లోపం వల్ల కంటి సమస్యలు వెలుగుచూస్తున్నాయి. వంశపారంపర్యంగా పిల్లలు దూరపు చూపు కోల్పోతున్నారని తేలింది. 50 ఏళ్లు పైబడిన వారిలో కంటి శుక్లాలు, కంటిలో దుర్మాంసం పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించారు.

శస్త్రచికిత్సలపై సందిగ్ధం

జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,91,219 మందిని పరీక్షించారు. 39.72 శాతం మంది కంటి సమస్యతో బాధపడుతున్నట్లు బహిర్గతమైంది. ఇందులో 56,228 మందికి దగ్గర చూపు కంటి అద్దాలు అవసరం ఉండగా 54,228 మందికి పంపిణీ చేశారు. 48,293 మందికి దూరపు చూపు అద్దాలు అవసరం కాగా 40,115 మందికి ఇచ్చారు. మొత్తం 52,933 మంది శస్త్రచికిత్సల కోసం ప్రతిపాదించారు. మధుమేహ బాధితులకు ఎదురవుతున్న డయోబెటిక్‌ రెటినోపతి పరీక్షించే పరికరాలు అందుబాటులో లేవు. శస్త్రచికిత్స కోసం కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేస్తేనే మేలు చేకూరనుంది.

పకడ్బందీగా నిర్వహణ

కంటి వెలుగు వైద్య శిబిరాలను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ఎక్కడా లోపాలు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. దూరపు, దగ్గర చూపు వారికి కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నాం. శస్త్రచికిత్స కోసం కరీంనగర్‌కు పంపిస్తున్నాం.

మహేందర్‌కుమార్‌, కంటి వెలుగు జిల్లా నోడల్‌ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని