logo

బాలలు బడి బాట పట్టేలా!

సర్కారు బడులను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించినా విద్యార్థులు చేరడానికి సుముఖత చూపడంలేదు.

Published : 02 Jun 2023 05:46 IST

రేపటి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం : సర్కారు బడులను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించినా విద్యార్థులు చేరడానికి సుముఖత చూపడంలేదు. పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెరిగినా, ఉచిత పాఠ్య పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం వంటివి సమకూరుస్తున్నా ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. ఈనెల 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న దృష్ట్యా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంపై రాష్ట్ర విద్యాశాఖ దృష్టి సారించింది. ఈ నెల 3 నుంచి ఈనెల 17వ తేదీ వరకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈసారి నిర్దేశించుకున్న లక్ష్యాలేమిటి? గతంలో ఎదురైన ఇబ్బందులు, వాటిని ఎలా అధిగమించాలో ప్రత్యేక కథనం.

గతేడాది లోపాలు అధిగమించితేనే..

* ఏటా బడిబాట కార్యక్రమాన్ని చేపడుతున్నా ఆశించిన మేరకు లక్ష్యాలు సాధించడం లేదు. అప్పటి లోపాలను అధిగమించేందుకు ఈ ఏడాది జిల్లా విద్యాశాఖ, ఉపాధ్యాయులు దృష్టి సారించాల్సి ఉంది.

* కరోనా అనంతరం 2020-21 విద్యాసంవత్సరంలో కరీంనగర్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6440 మంది విద్యార్థులు చేరారు.

* కరీంనగర్‌ జల్లాలో గత ఏడాది బడిబాట ద్వారా 884 మంది చేరగా, అందుకు రెట్టింపు సంఖ్యలో బడులను వదిలి వెళ్లిన వారున్నారు. ఇందుకుగల కారణాలను వెతకాలి.

* పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు సకాలంలో పంపిణీ చేయలేదు. ఈసారి ఆలస్యం కాకుండా చూడాలి.

* ప్రాథమిక పాఠశాలల్లో ఎక్కువ సంఖ్యలో పిల్లలు చేరినా ఒకరిద్దరు ఉపాధ్యాయులతో బోధించడం ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఉపాధ్యాయుల కొరత కూడా ప్రవేశాలను దెబ్బతీసింది.

* విద్యావాలంటీర్లను నియమించకపోవడం, బడుల్లో అదనంగా ఉన్న బోధకులను విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న వద్దకు సర్దుబాటు చేయడంలో విద్యా శాఖ విఫలమైంది. వసతుల కొరత ప్రవేశాలను దెబ్బతీసింది.

* పర్యవేక్షణ లోపంతోపాటు సమావేశాలు, వివిధ రకాల నివేదికల పేరుతో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఇతర పనులు చేతినిండా ఉండటం బోధనపై ప్రభావం చూపి బాలల సంఖ్యను దిగజార్చేలా చేసిందనే అపవాదు ఉపాధ్యాయుల్లో ఉంది.

* గతేడాది లోపాలను సవరించుకుంటూ ఈసారి ముందస్తుగా చర్యలు చేపడితే ప్రవేశాలు పెరిగే ఆస్కారం ఉంది.

నిర్దేశించుకున్న లక్ష్యాలు..

* బడి ఈడు పిల్లలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడం. ప్రవేశాల సంఖ్యను పెంచడం.

* తక్కువ విద్యార్థులు గల బడుల్లో తల్లిదండ్రులు, గ్రామ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో నమోదు శాతాన్ని పెంచడం.

* బడి బయట బాలలను గుర్తించి ప్రవేశాలు కల్పించడం.

* చదువు మధ్యలో ఆపేసిన వారిని గుర్తించి సరైన తరగతిలో చేర్పించడం.

* సమాజ భాగస్వామ్యం, మద్దతుతో సర్కారు బడులను బలోపేతం చేయడం.

* అంగన్‌వాడీ కేంద్రాల్లో 5 ఏళ్ల వయసు గల బాలలను గుర్తించి వారిని బడిలో చేర్చుకోవడం.

* ఈనెల 3 నుంచి 9వ తేదీ వరకు గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లో ప్రత్యేక నమోదు కార్యక్రమం నిర్వహణ.

* 12 నుంచి 17వ తేదీ వరకు నిర్ధారించిన రోజు వారి కార్యక్రమాల నిర్వహించడం.

మన ఊరు-మన బడి కలిసొచ్చేనా?

ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ఈసారి విద్యార్థుల ప్రవేశాలకు కలిసి వస్తుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. తరగతి గదులు, వంట గదులు, ప్రహరీలు, శౌచాలయాల నిర్మాణాలు-మరమ్మతులు, రంగులు వేయడం, డిజిటల్‌ తరగతులు, ఫర్నీచర్‌ వంటివి చేపడుతున్నారు. ఈ సదుపాయాలతో బడి నూతన శోభ సంతరించుకోనుంది. ప్రైవేటుగా దీటుగా ప్రవేశాలు పెరుగుతాయనే ధీమాలో ఉపాధ్యాయులున్నారు. ఇప్పటికే జిల్లాకు పాఠ్యపుస్తకాలు చేరాయి. ఏకరూప దుస్తులను కుట్టేందుకు ఇచ్చారు. అవి సకాలంలో పంపిణీ అయ్యేలా చూడాలి.

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని