logo

ధాన్యం డబ్బులు ఎప్పుడు అందేను?

ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.

Published : 02 Jun 2023 05:46 IST

జగిత్యాల : మోతె కొనుగోలు కేంద్రంలో తూకం వేయని ధాన్యం కుప్పలు

న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌ క్యాంపు, గంగాధర : ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించిన రైతులు 15 రోజులు గడిచినా డబ్బులు రాక ఆందోళన చెందుతున్నారు.. వానాకాలం పంట సీజన్‌ ముంచుకొస్తుండటంతో యాసంగి సాగుకు చేసిన అప్పులు చెల్లించేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సేకరణలో జాప్యం : యాసంగిలో ఉమ్మడి జిల్లాలో 9.60 లక్షల ఎకరాల్లో రైతులు వరిని సాగుచేశారు. చీడపీడలు, అకాలవర్షాలతో కనీస దిగుబడి తగ్గటం, విత్తనధాన్యం, సన్నధాన్యం, మార్కెట్ యార్డులు, మిల్లుల్లో నేరుగా అమ్మకాలుపోను కనీసం కనీసం 17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో ప్యాక్స్‌, ఐకేపీ, డీసీఎంఎస్‌, మెప్మా, హాకా, ఎఫ్‌పీవోల ద్వారా 1,312 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిద్వారా ఇప్పటివరకు 10.19 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కరీంనగర్‌ జిల్లాలో సేకరణ వేగంగా సాగగా అన్ని జిల్లాల్లో కలిపి ఇప్పటివరకు 385 కేంద్రాల్లోనే సేకరణ ముగిసింది. ఇంకా 927 కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఉండగా త్వరితగతిన వర్షాల్లోపు కొనుగోళ్లు పూర్తి చేయాల్సి ఉంది. ఒక్కో ధాన్యం బస్తాలో 1-4 కిలోల వరకు అధికంగా తూకం వేయటం, మిల్లుల్లో కోతలు, తరుగు, హమాలీ ఛార్జీలను క్వింటాలుకు రూ.35 వరకు వసూలు చేయటం, బస్తాలను లారీల్లో నింపినందుకు అదనపు వసూళ్లు, రెండోసారి తూర్పారపట్టడం, తట్లకిరాయి తదితరాలు కలిపి రైతులకు తీవ్ర ఆర్థికనష్టం కలిగించాయి.

చెల్లింపుల్లో ఆలస్యం : ఓ వైపు నెలరోజుల ముందుగానే వానాకాలం సీˆజన్‌ను ప్రారంభించాలని చెబతున్న రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం డబ్బులు చెల్లించకపోవడంతో రైతు వద్ద పెట్టుబడికి డబ్బులేని పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు రూ.2,097.26 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.574.97 కోట్లను మాత్రమే విడుదల చేశారు. సకాలంలో ధాన్యాన్ని విక్రయించగలిగి డబ్బులు చేతికందితేనే ప్రైవేటు అప్పులను చెల్లించటం, యంత్రాల అద్దెలను చెల్లించటం, బాంకుల్లోని రుణాలను పునరుద్ధరించుకోవడంతోపాటుగా వానాకాలం పెట్టుబడులకు వెచ్చించే వీలుంటుంది. కానీ ఆలస్యమవుతుండటంతో వానాకాలం సాగుకు ఇబ్బందులే అని రైతులు వాపోతున్నారు. కేంద్రాల్లోని మిగిలిన ధాన్యాన్నీ త్వరితగతిన కొనుగోలు చేయాలని, చెల్లింపులవేగం పెంచాలని కోరుతున్నారు. దీనిపై జగిత్యాల పౌరసరఫరాల సంస్థ డీఎం రజనీకాంత్‌ మాట్లాడుతూ ధాన్యాన్ని విక్రయించి ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తయిన తరువాత డబ్బులు విడుదలవుతాయని వివరించారు.

రూ.3.91 లక్షలు రావాలి.. : చిత్రంలోని సారంగాపూర్‌కు చెందిన రాజిరెడ్డి 190 క్వింటాళ్ల ధాన్యాన్ని పక్షం రోజుల క్రితం ప్రభుత్వ సంస్థకు విక్రయించినా ఇప్పటికీ పైకం చేతికందలేదు. రూ.3.91 లక్షల వరకు రావాల్సి ఉండగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతరత్రా చెల్లింపులను సకాలంలో చేయలేకపోతున్నానని రైతు వాపోతున్నారు.

20 రోజులైంది ధాన్యం తెచ్చి.. : చిత్రంలోని జగిత్యాల మండలం మోతెకు చెందిన పోచయ్య 450 బస్తాల వరకు ధాన్యాన్ని మే 10వ తేదీన కేంద్రానికి తేగా ఇప్పటివరకు కొనుగోలు చేయలేదు. లారీలు సకాలంలో రాకపోవటంతో ధాన్యాన్ని తూకం వేయక కేంద్రంలోనే పడిగాపులు పడుతున్నారు.

పెట్టుబడులెలా? : గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన బీమా అజయ్‌ ప్రభుత్వ కేంద్రంలో ధాన్యం విక్రయించి 20 రోజులు గడిచినా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాలేదు. పెట్టుబడులకు చేసిన అప్పులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నానని వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని