logo

పథకాలు అండగా.. సంక్షేమం దండిగా!

హైదరాబాద్‌ తరువాత ఇతర నగరాలకు ఐటీ పరిశ్రమలు రావాలనే ఉద్దేశంతో వరంగల్‌ తరువాత కరీంనగర్‌లో రూ.34 కోట్ల వ్యయంతో ఐటీ టవర్‌ నిర్మించారు. టీ-హబ్‌, టాస్క్‌ కేంద్రాలను ఇందులో ఏర్పాటు చేశారు.

Updated : 02 Jun 2023 06:10 IST

ప్రత్యేక రాష్ట్రంలో   అభివృద్ధి అడుగులు
నేడు ఆవిర్భావ దినోత్సవం
ఉపాధి వేదిక.. ఐటీ టవర్‌

ఈనాడు, కరీంనగర్‌ : ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ఉమ్మడి జిల్లాకు మరింత అండగా నిలుస్తున్నాయి.. జిల్లా సర్వతోముఖాభివృద్ధి దిశగా సాగుతుందనేలా ఆయా రంగాల్లో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి.. విద్య, వైద్యం, పారిశ్రామికం, పర్యాటకం, వ్యవసాయం, రహదారులు, సామాజిక భద్రత ఇలా అన్నింటా ప్రత్యేకమైన ముద్ర ఉంటోంది.. నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాలుగు జిల్లాల పరిధిలో తొమ్మిదేళ్లలో ఆయా వర్గాల ప్రజల దరి చేరిన సంక్షేమం, అభివృద్ధి ఫలాల సమాహారమిలా..

హైదరాబాద్‌ తరువాత ఇతర నగరాలకు ఐటీ పరిశ్రమలు రావాలనే ఉద్దేశంతో వరంగల్‌ తరువాత కరీంనగర్‌లో రూ.34 కోట్ల వ్యయంతో ఐటీ టవర్‌ నిర్మించారు. టీ-హబ్‌, టాస్క్‌ కేంద్రాలను ఇందులో ఏర్పాటు చేశారు. 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదంతస్తుల్లో దీన్ని సకల వసతులతో నిర్మించారు. ఏకకాలంలో 18 ఐటీ పరిశ్రమలు కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలుగా తీర్చిదిద్దారు.

సాధికారితకు రుణసాయం

మహిళలు స్వయం ఉపాధితో రాణించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది సమృద్ధిగా రుణాలు అందుతున్నాయి. బ్యాంకు లింకేజీతోపాటు స్త్రీనిధి రుణసాయం అతివల ఆర్థికాభివృద్ధికి అండగా నిలుస్తోంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనిష్ఠంగా రూ.1500 కోట్ల నుంచి గరిష్ఠంగా రూ.1800కోట్లకుపైగా రుణాల్ని మహిళా సంఘాల సభ్యులు పొందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 49,764 స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటి సరిధిలో 5,57,538 మంది మహిళామణులు సభ్యులుగా ఉన్నారు. ఉన్న మొత్తం సంఘాల్లో దాదాపుగా 92 శాతం సంఘాలు రుణాలు తీసుకుంటున్నాయి.

సర్కారు విద్య బలోపేతం

మన ఊరు-మన బడి కార్యక్రమంలో దాదాపుగా 550 బడులను ఎంపిక చేసి వాటి రూపురేఖల్ని మార్చేందుకు నిధులు ఖర్చు చేస్తున్నారు. బలహీనవర్గాల విద్యార్థుల జీవితాలను మార్చే దిశగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన గురుకుల విద్యాలయాలు నాలుగు జిల్లాల పరిధిలో ఐదింతలు పెరిగాయి. ప్రభుత్వ కళాశాల స్థాయిలో ఉన్నత విద్య అందించేందుకు కొత్త కళాశాలల ఏర్పాటుతోపాటు కళాశాలస్థాయి సమీకృత వసతిగృహాలు పలుచోట్ల విద్యార్థులకు వసతిని అందిస్తున్నాయి. విదేశీ విద్య కోసం సాయాన్ని అందిస్తూ బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు రూ.20లక్షలకుపైగా ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. గతంలో ఉన్న గురుకుల పాఠశాలలకు అదనంగా బీసీ, మైనారిటీ గురుకులాలు పెద్దఎత్తున ఏర్పాటై వందలాది విద్యార్థులకు విద్యాగంధాన్ని పంచుతున్నాయి. పేదలతోపాటు మధ్య తరగతి తల్లిదండ్రులు తమ పిల్లల భవితకు గురుకులాలు దోహదపడతాయని చేర్పిస్తున్నారు.

దళితబంధుతో ఉపాధి

దళితుల జీవితాల్లో దళితబంధు ఉపాధి వెలుగులు నింపుతోంది. కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి ఇక్కడ ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించారు. ఈ నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా 20వేల మందిని గుర్తించగా ఇప్పటి వరకు 18 వేల మంది వరకు ఈ లబ్ధిని పొందారు. ప్రతి నియోజకవర్గంలో వందమందికి అందించాలనే నిర్ణయంతో నాలుగు జిల్లాల పరిధిలో మలిదశలో 1100కుపైగా లబ్ధిదారుల్ని ఎంపిక చేశారు. తరువాత నియోజకవర్గానికి మరో వెయ్యి మంది చొప్పున ఎంపిక చేయబోతున్నారు.

పర్యాటక సొబగులు..

ఉమ్మడి జిల్లాకు పర్యాటక సొబగులు వన్నె తేనున్నాయి. కరీంనగర్‌ తలాపున నిర్మిస్తున్న చూడముచ్చటైన తీగల వంతెన కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. దాదాపుగా 500 మీటర్ల పొడువున్న వంతెన రోడ్డుపై నాలుగు వరుసల్లో వాహనాలు వెళ్లే సౌకర్యంతో రూపుదిద్దారు.తీగల వంతెనను ఆనుకుని ఎల్‌ఎండీ డ్యామ్‌ గేట్ల సమీపం వరకు నీటిని నిలిపి ఇరువైపులా పర్యాటకులు తిరిగేలా మానేరు రివర్‌ఫ్రంట్‌ను రూ.410 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇటీవల బడ్జెట్‌లో రూ.310 కోట్లు ఇక్కడి పనుల కోసం కేటాయించారు. మరో రూ.100 కోట్లతో సబర్మతిలో ఉన్న పర్యాటక ప్రదేశం మాదిరిగా ఇక్కడ ఆహ్లాదకర పరిసరాల్ని ఏర్పాటు చేయనున్నారు.

రైతుబంధు.. బీమాతో ధీమా

వ్యవసాయాధారిత జిల్లాలో రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు ఇస్తోంది. రైతు కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలబడాలనే సదుద్దేశంతో రైతు బీమాను ప్రవేశపెట్టింది. ఏ కారణంతోనైనా అన్నదాత చనిపోతే ఆయన కుటుంబానికి రూ.5 లక్షలను ప్రభుత్వం బీమా సొమ్ముగా అందిస్తోంది. నాలుగు జిల్లాల పరిధిలో 3,36,041 మంది బీమా పథకం పరిధిలో పేర్లను నమోదు చేసుకున్నారు. 2018-19 నుంచి 2020-21 వరకు మూడేళ్ల వ్యవధిలో 6,092 కుటుంబాలకు బీమా అందింది.

అభాగ్యులకు ఆసరా

సామాజిక భద్రతగా అందించే ఆసరా పింఛన్లు పేదలకు వరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా అందే ఈ చిన్న సాయం ఆర్థికంగా కొండంత అండనిస్తోంది. నాలుగు జిల్లాల పరిధిలో 5.32 లక్షలకుపైగా లబ్ధిదారులు వీటిని పొందుతున్నారు. నెలకు ఎంతలేదన్నా రూ.120 కోట్లను వీటికోసం ప్రభుత్వం చెల్లిస్తోంది. జగిత్యాల జిల్లాలో 89,409 మంది బీడీ కార్మికులు, సిరిసిల్ల జిల్లాలో 43,532 మంది చేనేత కార్మికులు ఆసరా పింఛన్‌ తీసుకుంటున్నారు.

మెరుగైన వైద్యం..

* ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ సర్కారు దవాఖానాలను బలోపేతం చేస్తున్నారు. తొమ్మిదేళ్లలో వైద్య చికిత్సల పరంగా కార్పొరేట్‌ ఆస్పత్రులకు తీసిపోని విధంగా వసతులు మెరుగయ్యాయి.

* కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని ప్రవేశ పెట్టినప్పటి నుంచి నాలుగు జిల్లాల పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది.

* సగటున రోజుకు 60కిపైగా ప్రసవాలు ప్రభుత్వ దవాఖానాల్లో జరుగుతుండటం మార్పునకు నిదర్శనంగా చెప్పొచ్చు. 2021లో కరీంనగర్‌ జిల్లాలో 9,068, జగిత్యాల జిల్లాలో 5,558, పెద్దపల్లి జిల్లాలో 3,829, సిరిసిల్ల జిల్లాలో 3,059 కేసీఆర్‌ కిట్‌లను అందించారు. ఒక్క ఏడాదిలోనే 21,514 మందికి ఈ పథకం లబ్ధి నగదు సహా కిట్ల రూపంలో అందింది.

* కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి డయాలసిస్‌ సేవలు నాలుగు జిల్లా కేంద్రాలతోపాటు హుజూరాబాద్‌లోనూ అందుతున్నాయి. నెలకు సగటున 800 మంది ఈ సేవల్ని ఉమ్మడి జిల్లాలో అందుకుంటున్నారు. ఇక జిల్లాసుపత్రుల్లో ఐసీయూ సేవల్ని ఐదేళ్ల కిందట ప్రారంభించడంతో రోడ్డు ప్రమాదాలు సహా ఇతరత్రా ఆపత్కాలంలో మెరుగైన చికిత్స బాధితులకు అందుతోంది.

* పట్టణాల్లోని పేదలకు ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో బస్తీ దవాఖానాలను రాష్ట్రవ్యాప్తంగా 342 ఏర్పాటు చేయగా ఇందులో ఉమ్మడి జిల్లాలో పదికిపైగా సేవల్లో తరిస్తున్నాయి. పల్లె దవాఖానాల సంఖ్య కూడా ఇటీవల పెరుగుతుండటంతో స్థానికంగానే వైద్యం చేరువవుతోంది. తెలంగాణ వ్యాధి నిర్ధారణ పథకంలో భాగంగా నాలుగు జిల్లాల పరిధిలో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేసి రోగ నిర్ధారణల్ని చేపడుతున్నారు. సంచార వాహనాల ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్తనమూనాలను సేకరిస్తూ ఫలితాల్ని అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని