logo

సమ్మెలోకి రేషన్‌ డీలర్లు

రేషన్‌ డీలర్లు సమ్మెలోకి వెళ్లారు. 20 సమస్యలు పరిష్కరించాలని, గౌరవ వేతనం, కమీషన్‌ పెంచాలని కోరుతూ వారు మే 19న జిల్లా అదనపు పాలనాధికారులకు సమ్మె నోటీస్‌ ఇచ్చారు. 22న మంత్రి గంగుల కమలాకర్‌ రాష్ట్ర నాయకులతో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించారు.

Published : 04 Jun 2023 05:03 IST

తెరచుకోని వావిలాపల్లిలోని రేషన్‌ దుకాణం

న్యూస్‌టుడే, భగత్‌నగర్‌: రేషన్‌ డీలర్లు సమ్మెలోకి వెళ్లారు. 20 సమస్యలు పరిష్కరించాలని, గౌరవ వేతనం, కమీషన్‌ పెంచాలని కోరుతూ వారు మే 19న జిల్లా అదనపు పాలనాధికారులకు సమ్మె నోటీస్‌ ఇచ్చారు. 22న మంత్రి గంగుల కమలాకర్‌ రాష్ట్ర నాయకులతో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించారు. గౌరవ వేతనం, కమీషన్‌ పెంపు ముఖ్యమంత్రి పరిధిలో ఉంటుందని తెలియజేయడంతో రాష్ట్ర నాయకులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత జూన్‌ 2 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,964 మంది ఆకస్మికంగా సమ్మెలోకి వెళ్లడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.

ఆకస్మికం.. ఆశ్చర్యం..: గత నెల 28న రైస్‌ ఇండెంట్‌ రావడంతో ఈనెల 3వ తేదీ నుంచే బియ్యం పంపిణీ చేయడానికి ఆన్‌లైన్‌ ప్రారంభమైంది. 2వ తేదీ సాయంత్రం నుంచి డీలర్లు సమ్మెలోకి వెళ్లారు. శనివారం జిల్లా వ్యాప్తంగా రేషన్‌ దుకాణాలు తెరుచుకోలేదు. సాధారణంగా ప్రతి నెల 4వ తేదీ నుంచి బియ్యం పంపిణీ చేస్తారు. ఇండెంట్‌ ముందే రావడంతో ఒక రోజు ముందస్తుగా అధికారులు ఆన్‌లైన్‌ ప్రారంభించారు. ఈపాస్‌ యంత్రాల ద్వారా బియ్యం పంపిణీకి ఆన్‌లైన్‌ ద్వారాలు తెరిచారు. సమ్మె ముగిసిందనే భావనలో అధికారులు ఉండగా, మరో వైపు డీలర్ల నిర్ణయంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. బియ్యం పంపిణీకి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే అవకాశాలు లేకుండా పోయాయి. పంపిణీ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.

దీర్ఘకాలిక సమస్యలు: రాష్ట్ర వ్యాప్తంగా డీలర్లు 2021లో సమ్మె నోటీస్‌ ఇచ్చారు. సమ్మెలో గౌరవ వేతనం కావాలని పోరాటం చేశారు. డీలర్లకు రూ.10 లక్షల బీమా కల్పించాలని, హమాలీ ఛార్జీలను ప్రభుత్వమే చెల్లించాలని, మండల స్థాయి స్టాక్‌ పాయింట్లలో వే బ్రిడ్జ్‌లు ఏర్పాటు చేయాలని, శాశ్వత అథరైజేషన్‌ ఇవ్వాలని, కారుణ్య నియామకాలు 50 ఏళ్లకు పెంచాలని, నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని ఇలా 20 సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దీనికి స్పందించి మంత్రులతో సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మరో మారు సమ్మె బాట పట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,80,422 మంది కార్డుదారులకు బియ్యం అందకుండాపోయాయి.

గౌరవ వేతనం కావాలి

గౌరవంగా బతకడానికి రేషన్‌ డీలర్లకు వేతనం ఇవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎన్నో సభలలో ఇస్తామని ప్రకటించారు. తొమ్మిదేళ్లు అవుతున్నా ఆ హామీ నెరవేరలేదు. ప్రజలకు అసౌకర్యం కలిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇప్పటికైనా స్పందించి చర్చలకు పిలవాలి.

రొడ్డ శ్రీనివాస్‌, కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు, రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని