logo

ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం

కొద్దిపాటి వర్షం కురిసినా సిరిసిల్ల పట్టణం ముంపుబారిన పడుతోంది. ఎగువన గొలుసుకట్టు చెరువుల ద్వారా వచ్చే వరదనీటి కాల్వలు ఆక్రమణలకు గురికావడం..

Published : 07 Jun 2023 02:15 IST

‘ఈనాడు’తో కమిషనర్‌ సమ్మయ్య

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల : కొద్దిపాటి వర్షం కురిసినా సిరిసిల్ల పట్టణం ముంపుబారిన పడుతోంది. ఎగువన గొలుసుకట్టు చెరువుల ద్వారా వచ్చే వరదనీటి కాల్వలు ఆక్రమణలకు గురికావడం.. దిగువన మురుగు నీటి కాల్వలు పూడుకుపోయి వరదనీరు వెళ్లలేక రహదారులుపై ప్రవహించడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. దీనిని అధిగమించడానికి నాలాల విస్తరణ, మురుగుకాల్వ పూడిక తీత వంటివి చేేపట్టాల్సి ఉంది. వర్షాకాలం సమీపిస్తుండటంతో ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టినట్లు కమిషనర్‌ సమ్మయ్య తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో చేపడుతున్న పనులపై ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు..

ప్ర: వర్షాకాలంలో వరదనీరు మురుగునీటి కాల్వల్లో కలిసి పోయి రహదారులపై ప్రవహిస్తోంది. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు?

జ: పట్టణంలోని సాయిబాబా ఆలయం నుంచి శాంతినగర్‌ వరకు ఓపెన్‌ డ్రైయిన్‌ ఉంది. దీనిలోని పూడికను తీసేందుకు రూ.8 లక్షలతో టెండర్లు పిలిచాం. పనులు దక్కించుకున్న గుత్తేదారుతో త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. దీనితోపాటు ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారుల్లోని మురుగు కాల్వలను శుభ్రం చేయిస్తాం.

ప్ర: ప్రధాన రహదారులపై కాలినడక బాటలు ఆక్రమణలతో చాలా వరకు దెబ్బతిన్నాయి. మెరుగుపర్చేందుకు ఏం చర్యలు చేపడతారు?

జ: సిరిసిల్ల-కామారెడ్డి, సిరిసిల్ల-సిద్దిపేట ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న టైల్స్‌, మ్యాన్‌హోల్స్‌ చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటితోపాటు జిల్లా జనరల్‌ ఆసుపత్రి కూడలి, తారక రామానగర్‌, శివనగర్‌ ప్రాంతాల్లోని టైల్స్‌, మ్యాన్స్‌హోల్స్‌ల మరమ్మతులకు రూ.8 లక్షలు కేటాయించాం. త్వరలోనే పనులు చేపడతాం.

ప్ర: పురపాలికశాఖకు చెందిన అద్దెగదులు చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి. వీటితో ఆదాయం సమకూర్చుకునే మార్గం?

జ: పట్టణ పరిధిలో ప్రధాన మార్కెట్‌, పాత, కొత్త బస్టాండ్‌ పరిధిలో 175 గదులకు టెండర్ల ద్వారా 95 మాత్రమే అద్దెకు తీసుకున్నారు. కూడలికి సమీపంలోనివి, మొదటి అంతస్తులోని దుకాణాలు మాత్రమే టెండర్లలో పోటీ పడి తీసుకున్నారు. మిగితావి ఖాళీగా ఉన్నాయి. టెండర్లలో తీసుకొని దుకాణాలు అవసరమున్న వారు దరఖాస్తు చేసుకుంటే చాలు. కౌల్సిల్‌ ఆమోదంతో నేరుగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.

ప్ర: శాశ్వత ముంపు నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారు?

జ: సిరిసిల్ల పట్టణానికి సంబంధించి కొత్త చెరువు అలుగు పారితే వచ్చే వరదనీటిని మళ్లించేందుకు శ్రీనగర్‌ మీదుగా కచ్చాకాల్వను తవ్వించాం. ఇది బాహ్యవలయ రహదారి నుంచి తుమ్మల చెరువు వరకు వెళ్తుంది. ముష్టిపల్లి నుంచి వచ్చే వరదనీరు కొత్తచెరువులోకి వెళ్లేలా గతేడాది రూ.6.21కోట్లతో కాల్వ నిర్మాణ పనులు చేపట్టాం. దానిలో 70 మీటర్ల మేరకు పనులు పూర్తికావాల్సి ఉంది. వరనీరు వెళ్లేలా మట్టికాల్వను తీసి ఉంచాం. ప్రస్తుతం వెంకంపేట రహదారి విస్తరణ, మురుగునీటి కాల్వ నిర్మాణపనులు చివరిదశలో ఉన్నాయి. రెవెన్యూ, జలవనరుల శాఖల పర్యవేక్షణలో వర్షాలకు ముంపు లేకండా పటిష్ట చర్యలు చేపడుతున్నాం.

ప్ర: పట్టణలో చేపడుతున్న ప్రధాన అభివృద్ధి పనులు?

జ: శ్రీనగర్‌ కాలనీ, అంబేడ్కర్‌ నగర్‌ నుంచి బాహ్యవలయ రహదారి, విద్యానగర్‌ ప్రాంతాల్లో రూ.6.97 కోట్లతో అంతర్గత రహదారులను నిర్మించనున్నాం. రెండో బాహ్యవలయ రహదారిలో రగుడు నుంచి వెంకటాపూర్‌ వరకు రూ.4.6 కోట్లతో కేంద్రీకృత విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేస్తున్నాం. రగుడు, శాంతినగర్‌, పెద్దూరులో నిర్మాణం పూర్తయిన 792 రెండు పడక గదుల సముదాయంలో రూ.5.9 కోట్లతో మౌలిక వసతులు కల్పన పూర్తయింది. నాలుగో విడత లబ్ధిదారులను ఎంపికచేసి ఇక్కడ పంపిణీ చేస్తాం. రూ.61 కోట్లతో చేపడుతున్న ఎస్టీపీ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. సెప్టెంబరు 15లోగా పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని