logo

వ్యవసాయానికి రుణ ప్రాధాన్యం

వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక, మహిళా సంఘాలు, ఇతర రంగాలకు ప్రాధాన్యమిచ్చి జిల్లా వార్షిక రుణ ప్రణాళిక అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు.

Published : 07 Jun 2023 02:15 IST

పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు

గంగాధరలో సిద్ధంగా ఉన్న వరినారు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం : వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక, మహిళా సంఘాలు, ఇతర రంగాలకు ప్రాధాన్యమిచ్చి జిల్లా వార్షిక రుణ ప్రణాళిక అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. 2023-24 వార్షిక రుణ ప్రణాళికను నెల రోజుల కిందట నిర్వహించిన సమావేశంలో ఆవిష్కరించి ఆమోదం తెలిపారు. గతేడాది రుణ ప్రణాళిక అమలు లక్ష్యాన్ని మించడంతో దానికి అనుగుణంగానే ఈ సంవత్సరం ప్రణాళిక రూపొందించారు. ఈసారి కూడా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు అధిక ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు.

అధిగమించిన గతేడాది లక్ష్యం

2022-23 సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళిక రూ.4749.14 కోట్లు కాగా రూ.8772.48 కోట్ల రుణాలు ఇచ్చి లక్ష్యాన్ని అధిగమించారు. వందశాతం లక్ష్యం కాగా 184.72 శాతం సాధించారు. అన్ని రకాల పంట రుణాలు కలిపి రూ.3317.40 కోట్లకుగాను రూ.3697.24 కోట్లు పంపిణీ చేసి 111.45 శాతం మేర చేశారు. పంట రుణాలు 79.4 శాతం సాధించగా వ్యవసాయ టర్మ్‌ రుణాలు మాత్రం 173.93 శాతం సాధించారు. అన్ని రకాల రుణాల్లో వంద శాతం దాటినట్లు అధికారులు తెలిపారు.

36 బ్యాంకులు.. 216 శాఖలు

జిల్లాలో 36 బ్యాంకుల పరిధిలో 216 శాఖలు సేవలందిస్తున్నాయి. ఈసారి రుణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం రాయితీ రుణాలు మంజూరు చేసి నిరుద్యోగులకు తోడుగా ఉండాలని భావిస్తున్నప్పటికీ కొన్ని బ్యాంకులు నిరుద్యోగులను రుణ మంజూరుకు పలు రకాల కాగితాలు తీసుకుంటున్నట్లు వాపోతున్నారు. బ్యాంకు రుణాల్లో జాప్యం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలకు షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలని కోరుతున్నారు.

పంట పరిహారం, రుణ రికవరీ చేయొద్దు

ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం డబ్బు రైతు ఖాతాలో జమ చేస్తే ఆ డబ్బును పంట రుణం కింద రికవరీ చేయొద్దని కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ బ్యాంకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

రూ.7481.96 కోట్లతో వార్షిక ప్రణాళిక

జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.7481.96 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ రుణాలను ఆయా రంగాల వారీగా వచ్చే ఏడాది మార్చి 31 వరకు పూర్తి చేయాలి.

* వ్యవసాయ రంగానికి అన్ని రుణాలు కలిపి 2,42,745 మంది రైతు ఖాతాదారులకు రూ.3579.37 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు.

* సూక్ష్మ, మధ్యతర రంగాల పరిశ్రమలకు 22,010 మందికి రూ.1063.70 కోట్ల రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని ప్రణాళికలో కేటాయించారు.

* విద్యా రుణాల కింద 827 మందికి, గృహ నిర్మాణాలకు 1772 నిర్మాణదారులకు, సామాజిక, మౌలిక సదుపాయాలకు 445 మందికి, ప్రాధాన్యం, ప్రాధాన్యేతర విభాగానికి మొత్తం కలిపి 48,134 మందికి రూ.2595.04 కోట్ల రుణాలు ఇవ్వనున్నారు. మొత్తం మీద 3,16,471 మంది ఖాతాదారులకు రూ.7481.96 కోట్ల రుణ ప్రణాళికను నిర్ణీత గడువులోగా పూర్తి చేయనున్నారు.

మళ్లీ లక్ష్యాన్ని సాధిస్తాం

గతంలో మాదిరిగానే మళ్లీ లక్ష్యాన్ని అధిగమిస్తాం. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్న వారికి, నిరుద్యోగులకు ఇబ్బందులు లేకుండా రుణాలు ఇచ్చేలా చూస్తాం. వ్యవసాయ రంగానికి ప్రధాన ప్రాధాన్యం ఉంటుంది.

ఆంజనేయులు, లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని