logo

నాణ్యమైన సేవలకు గుర్తింపు

నాణ్యమైన వైద్య సేవలు.. రోగులకు మెరుగైన వసతులతో హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రి ఆదర్శంగా సాగుతోంది.. ఇవే ప్రమాణాలు ఆస్పత్రికి ఎన్‌క్వాస్‌ గుర్తింపును తెచ్చిపెట్టాయి..

Published : 07 Jun 2023 02:15 IST

హుజూరాబాద్‌ ఆస్పత్రికి ఎన్‌క్వాస్‌ ధ్రువపత్రం

ఆసుపత్రిలో సేవల కోసం పేర్లు నమోదు చేసుకుంటున్న ëృశ్యం

న్యూస్‌టుడే, హుజూరాబాద్‌ గ్రామీణం : నాణ్యమైన వైద్య సేవలు.. రోగులకు మెరుగైన వసతులతో హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రి ఆదర్శంగా సాగుతోంది.. ఇవే ప్రమాణాలు ఆస్పత్రికి ఎన్‌క్వాస్‌ గుర్తింపును తెచ్చిపెట్టాయి.. ఈ గుర్తింపు స్ఫూర్తిగా మరింత మెరుగైన సేవలు అందిస్తామని.. ఆస్పత్రిలో నాణ్యత ప్రమాణాలు మెరుగుపరుస్తామని వైద్యులు చెబుతున్నారు..
హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రి 100 పడకలతో సేవలను అందిస్తుంది. మొత్తం 27 మంది వైద్యులకు ఏడుగురు డిప్యుటేషన్‌పై వెళ్లగా 20 మంది వైద్యులు సేవలను అందిస్తున్నారు. ప్రతి రోజు సుమారు 400 మంది రోగులు సేవల కోసం ఆసుపత్రికి వస్తున్నారు. అందులో 70 మంది రోగులు చికిత్సల కోసం చేరుతున్నారు. ప్రతి నెలా జనరల్‌ శస్త్రచికిత్సలు, ఎముకల శస్త్రచికిత్సలు 60 నుంచి 70 వరకు అవుతున్నాయి. 150 నుంచి 200 మంది వరకు గర్భిణులకు ప్రసూతి సేవలను అందిస్తున్నారు. అందులో 50 వరకు సుఖ ప్రసవాలు జరుగుతున్నాయి. ఆసుపత్రిలో సేవలు, ఇతర నాణ్యత ప్రమాణాలపై నోడల్‌ అధికారి నారాయణరెడ్డి, మేనేజర్‌ సాగర్‌లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనలో ఆర్‌ఎంవో, సూపరింటెండెంట్‌ సూచనలతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రోగులకు నాణ్యమైన సేవలు అందేలా చూస్తున్నారు.

ఇలా ఎంపిక : జాతీయ ఆరోగ్య వ్యవస్థల వనరుల కేంద్రం బాహ్య అంచనా నివేదిక బృందం సభ్యులు వైద్యులు నాజియా షాహీమ్‌ (లఖ్‌నవూ), అలోక్‌ కుమార్‌ స్వైన్‌ (భువనేశ్వర్‌)ల బృందం ఏప్రిల్‌ 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు ఆసుపత్రిని సందర్శించారు. ప్రమాదాలు, అత్యవసర విభాగం, ఓపీ, చేరిన రోగులు, ప్రసూతి, పిల్లల వార్డు, శస్త్రచికిత్సలు, ల్యాబ్‌, మందుల విభాగం, సాధారణ పరిశీలన, ఇతర విభాగాలను బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది, రోగులతో మాట్లాడి వైద్య సేవల తీరును నమోదు చేసుకొన్నారు. నివేదికలను భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సమర్పించారు. మంత్తం 100 మార్కులకు గాను ఆసుపత్రి 95 మార్కులు కైవసం చేసుకొన్నట్లు జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి విశాల్‌ చౌహాన్‌ సోమవారం మెయిల్‌ ద్వారా లేఖ పంపారు. ఎన్‌క్వాస్‌ గుర్తింపు లభించినట్లు పేర్కొన్నారు.

కాయకల్ప అవార్డుకు ప్రయత్నం

గత సంవత్సరం లక్ష్య అవార్డు వచ్చింది. ఈ సంవత్సరం (ఎన్‌క్వాస్‌) జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల గుర్తింపును దక్కించుకున్నాం. ఆసుపత్రికి ధ్రువీకరణ పత్రంతోపాటు మూడేళ్లపాటు ఏటా కేంద్రం రూ.10 లక్షలు అందిస్తుంది. ఈ స్ఫూర్తితో కాయకల్ప అవార్డును సాధించేందుకు ముందుకు సాగుతున్నాం.

డా.సుధాకర్‌రావు, ఆర్‌ఎంవో

సమష్టి కృషితోనే

ఆసుపత్రిలో పని చేసే వైద్యులు, సిబ్బంది సమష్టి కృషితో ఈ అవార్డును సాధించగలిగాం. రోగులకు నాణ్యమైన సేవలను అందించటమే లక్ష్యంగా పెట్టుకొన్నాం. ఆసపత్రిలో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవార్డుతో మాకు మరింత ఆత్మవిశ్వాసం కలిగింది.

డా.రాజేందర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని