logo

జిల్లాలో పరిశ్రమల స్థాపన సులభతరం

పారిశ్రామిక రంగం ప్రగతి బాటలో పయనించేలా చేయాలంటే అది ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ తెలిపారు.

Published : 07 Jun 2023 02:22 IST

కేకు కోస్తున్న ఐటీ ఉద్యోగులు, చిత్రంలో కలెక్టర్‌ కర్ణన్‌

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే:   పారిశ్రామిక రంగం ప్రగతి బాటలో పయనించేలా చేయాలంటే అది ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా మంగళవారం నాలుగో రోజు తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం కార్యక్రమాన్ని గ్రానైట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్‌ కర్ణన్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2002లో జిల్లాలో చిన్నగా ప్రారంభమైన గ్రానైట్‌ వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగి 2023 నాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేసే దశకు చేరి 15 వేల మందికి ఉపాధి కల్పించిందన్నారు. రాష్ట్ర అవతరణ ఆవిర్భావం అనంతరం టీఎస్‌ఐపాస్‌ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో పరిశ్రమల స్థాపనకు ఆన్‌లైన్‌ వేదికగా ఒకే దరఖాస్తు ద్వారా అన్ని శాఖల అనుమతులను పొందడం సులభతరమైందన్నారు. దళిత బంధు పథకం ద్వారా 1000 మంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని, రైతుబంధు ద్వారా పంట సాగుకు రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని అందించటంతో రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, శిక్షణ కలెక్టర్‌ లెనిన్‌ వాత్సల్‌, జడ్పీ సీఈవో ప్రియాంక, కార్మిక శాఖ ఉపకమిషనర్‌ రమేశ్‌బాబు, చేనేత శాఖ సంఘం అధ్యక్షులు రాంచందర్‌, రైస్‌మిల్లర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నర్సింగరావు, గ్రానైట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌) : ఐటీ రంగం విస్తరించడంతో యువతకు స్థానికంగానే ఉద్యోగావకాశాలు పెరిగాయని జిల్లా కలెక్టర్‌ ఆర్వీ.కర్ణన్‌ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా మంగళవారం కరీంనగర్‌లో ఐటీటవర్‌లో పారిశ్రామిక ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఉత్తమ స్టార్టప్‌ కంపెనీల ఉద్యోగులను సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. అంతకుముందు ఐటీ ఉద్యోగులు కేక్‌ కోశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ జోనల్‌ మేనేజర్‌ స్వామి, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణపై సమీక్ష

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఈనెల 11న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో పరీక్ష ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు కలెక్టర్‌ దిశా నిర్దేశం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలని సూచించారు. 34 కేంద్రాల్లో 16,829 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని, వారికి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ లెనిన్‌ వాత్సల్‌, ఆర్డీవో ఆనంద్‌కుమార్‌, ఏవో జగత్‌సింగ్‌, చీఫ్‌ సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

చెరువుల పండుగను ఘనంగా నిర్వహించాలి

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా జూన్‌ 8న నిర్వహించనున్న తెలంగాణ చెరువుల పండుగను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరం నుంచి చెరువుల పండగ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. చెరువుల వద్ద గ్రామ దేవతలను, దేవాలయాలను అలంకరించాలని, షామియానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బోనాలను సమర్పించి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లను చేపట్టాలన్నారు. బతుకమ్మ ఆడుకోవడానికి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అదనపు పాలనాధికారి గరిమ అగ్రవాల్‌, సీఈవో ప్రియాంక, శిక్షణ కలెక్టర్‌ లెనిన్‌ వాత్సల్‌, ఆర్డీవో ఆనంద్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని