logo

అపర సంజీవనికి ఆపద

గత నెల 28న సిరిసిల్ల జిల్లా మర్తన్‌పేట శివారులో లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించే లోపల మార్గమధ్యలో మృతి చెందారు.

Published : 09 Jun 2023 04:54 IST

108 వాహనాలకు అష్టకష్టాలు
 క్షతగాత్రులకు అందని అత్యవసర సేవలు

మానకొండూర్‌ పంచాయతీ ఆవరణలో నిలిపిన ఆంబులెన్సు

ఈనాడు, కరీంనగర్:* గత నెల 28న సిరిసిల్ల జిల్లా మర్తన్‌పేట శివారులో లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించే లోపల మార్గమధ్యలో మృతి చెందారు. ప్రమాదం జరిగిన చాలాసేపటి వరకు 108 వాహనం రాలేదని బాధిత బంధువులు ఆరోపించారు. రక్తగాయాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి ఉంటే ప్రాణాలు దక్కేవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలోనే మరోచోట ప్రమాద బాధితుల కోసం ఆ వాహనం వెళ్లడంతో ఆలస్యమైందని తెలిసింది.
ఆపద వేళలో అత్యవసర సేవల్ని అందించాల్సిన 108 వాహనాలు తక్కువగా ఉండటం సమస్యలు తెచ్చిపెడుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరచూ ఏదో ఒక చోట వాహనం మరమ్మతుకు గురవుతోంది. ఏళ్ల తరబడి అలుపెరగకుండా సేవలు అందిస్తున్న వాహనాలు చాలా వరకు పాతబడిపోయాయి. మానకొండూర్‌, గంగాధర, చిగురుమామిడి, మంథని, ధర్మారం, సుల్తానాబాద్‌, తంగళ్లపల్లి, మల్యాలలో ఉన్న వాహనాలు అధ్వాన స్థితిలో సేవల్ని అందిస్తున్నాయి. ఇక్కడ ఉన్న సిబ్బంది అతి కష్టంమీద సేవల్ని అందిస్తున్నారు. ఎక్కడ వాహనం ఆగుతుందో తెలియదని బాధపడుతున్నారు.


బుట్టదాఖలేనా..?

2005 ఆగస్టు 15 నుంచి 108 సేవలు అందుబాటులోకి వచ్చాయి. దాదాపుగా 18 ఏళ్లుగా ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా.. అత్యవసర వైద్య చికిత్స కోసం ఎవరు ఫోన్‌ చేసినా కొద్ది సమయంలోనే అక్కడికి వెళ్లి వారిని ఆస్పత్రికి తీసుకెళ్లే ఈ వాహనాలు పాతబడటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైగా ఒక్కో వాహనం రోజుకు మూడు నుంచి అయిదు కేసులకు వెళ్తుండటంతో బాధితులకు కొన్నిసార్లు వాహన సేవలు అందడమనేది కష్టమవుతోంది. వాస్తవానికి ప్రతి మండల పరిధిలో ఉన్న గ్రామాలను సులభంగా చేరుకునేలా మండలానికి ఒక ఆంబులెన్స్‌ను అందించాలనే ప్రతిపాదనను గతంలోనే తెరమీదకు తీసుకొచ్చారు. ఉన్నతాధికారులకు నివేదికను అందించారు. ఈ లెక్కన నాలుగు జిల్లాల పరిధిలో 61 వాహనాలు విధిగా ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 39 మాత్రమే ఉన్నాయి. కొన్నిచోట్ల రెండు, మూడు మండలాలకు ఒకటి సేవల్ని అందిస్తోంది. ప్రధాన పట్టణాల్లో ఆస్పత్రుల్లో ఉన్న తాకిడి దృష్ట్యా కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాలలో రెండుకుపైగా వాహనాలు పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నాయి. కొత్త మండలాలకు అందించాలనే ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. పలుమార్లు జిల్లాల నుంచి నివేదికలు అందుతున్నా కొత్తవి రావడం లేదు. పైగా ఆయా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు గతంలో అందించిన ఉచిత అంబులెన్స్‌లు 13, మిగతావి కలిపి మొత్తంగా 39 ఉమ్మడి జిల్లాలో సేవల్ని అందిస్తున్నాయి.


అవస్థలమయమే..!

* 108 వాహనాలు నిలపడానికి షెడ్లు లేకపోవడంతో గ్రామ పంచాయతీలు, ఠాణాలు, మార్కెట్‌ యార్డుల్లో వాహనాలను నిలుపుతున్నారు.
* 3 లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగిన వాహనాలను వినియోగించొద్దు. కాని తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని కూడా ఆపత్కాలంలో సేవల కోసం వాడాల్సిన దుస్థితి నెలకొంది.
* 10కి పైగా వాహనాలు పాతవే ఉన్నాయి. టైర్లు అరిగిపోవడం, రాత్రి వేళల్లో మొరాయిస్తుండటం.. మార్గమధ్యలో ఆగుతుండటంతో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
* ఉమ్మడి జిల్లాలోని 108 వాహనాలు రోజుకు 90 వరకు కేసులకు హాజరవుతున్నాయి. ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో కేసులు వస్తున్నాయి. పట్టణాల్లో వీటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది.
* ఇప్పుడున్న కేసుల దృష్ట్యా అత్యవసరంగా మరో 20 వాహనాలు విధిగా నాలుగు జిల్లాలకు వస్తేనే మెరుగైన సేవలు అందుతాయి.
* రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రుల్ని సకాలంలో చేరవేయడానికి 108 సేవలు అత్యవసరం. 108 వాహనాలు తక్కువగా ఉండటంతో ఇతర నామమాత్రపు కేసుల్లో ఉండి ప్రమాద ఘటనలకు వెళ్లడం కష్టమవుతోంది.


కొత్త వాహనాలు వస్తే మేలు : ఇప్పుడున్న వాహనాలతో సేవలు బాగానే అందిస్తున్నాం. ప్రతి మండలానికి ఒక వాహనం ఉంటే ఇంకా మెరుగైన సేవల్ని అందించగలుగుతాం. గతంలోనే ప్రతిపాదనలు పంపారు. కొత్తవి వస్తే మరింత మేలు జరుగనుంది.

సలీం, 108 ప్రోగామ్‌ మేనేజర్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని