logo

ముంపు ముప్పు తప్పేనా!

వర్షాకాలం ముంచుకొస్తుండటంతో కరీంనగర్‌ నగర పాలక సంస్థ వారు ముందస్తు చర్యలు ప్రారంభించారు.

Updated : 09 Jun 2023 06:28 IST

నాలాల్లోని పూడిక తొలగింపు మొదలు

ఇందిరానగర్‌లో డ్రైనేజీల్లోంచి పూడిక తొలగించి ట్రాక్టర్‌లో వేస్తూ..

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌: వర్షాకాలం ముంచుకొస్తుండటంతో కరీంనగర్‌ నగర పాలక సంస్థ వారు ముందస్తు చర్యలు ప్రారంభించారు. వరద కాల్వలు పొంగి పొర్లకుండా అందుల్లోని చెత్తా చెదారం, పూడిక తొలగించే పనులు మొదలుపెట్టారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదంతా ఈ కాల్వల గుండానే దిగువ ప్రాంతానికి పంపించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. మట్టి, రాళ్లు, చెత్త, చెదారం పేరుకుపోతుండటంతో ఏటా సమస్యలు వస్తున్నాయి. రోడ్డుపై ప్రవహించడం, భారీగా వరద వస్తే ఇళ్లల్లోకి వస్తుండటంతో ఆయా ప్రాంతవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వరదకాల్వలు, అంతర్గత ప్రధాన డ్రైనేజీలను శుభ్రం చేస్తున్నారు.


పకడ్బందీగా పనులు

నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.67.79 లక్షలతో పూడికతీత పనులకు నిధులు కేటాయించారు. కనిపించని పనులు కావడంతో పకడ్బందీగా చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పైపైనే పూడికతీత పనులు చేసి పత్తా లేకుండా పోకుండా.. ఈసారి ఇంజినీరింగ్‌ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. వ్యర్థాలు తొలగించడంతోపాటు తరలించడం వరకు ఫొటోలు తీయడం, సమీప ఇంటి యజమానుల ఫోన్‌ నెంబర్లను తీసుకొని రికార్డు చేస్తున్నారు. పూడిక భారీగా నిండి ఉండగా ఆ మేర ఖాళీ అవుతుందా? అనే అనుమానాలు లేకపోలేదు. తీసిన సిల్ట్‌ను ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. పెద్ద డ్రైనేజీల దగ్గర పొక్లెయిన్‌తో, చిన్న వాటిలో కార్మికులతో తీయిస్తున్నారు.


కోతకు గురైన కాల్వలకు మరమ్మతులు

వరదకాల్వలు పలు ప్రాంతాల్లో కోతకు గురైంది. మే నెలలో భారీ వర్షం పడిన సమయంలో రోడ్ల మీదికి, ఇళ్లలోకి నీరు రావడంతో అప్పటికప్పుడే ఇంజినీరింగ్‌ అధికారులు పరిశీలించి నమోదు చేసుకున్నారు. మంకమ్మతోట రెండో ఠాణా పక్కన, గ్రంథాలయం వైపు, కలెక్టరేట్‌ లోపల, అంబేడ్కర్‌ స్టేడియం వైపు, ప్రభుత్వాసుపత్రి ఎదురుగా నుంచి శర్మనగర్‌ వైపు, అశోక్‌నగర్‌లో వరద కాల్వలు పలు చోట్ల కూలాయి. అందుల్లో భారీగా మట్టి ఉంది. ఇలాంటి కాల్వలను వెంటనే మరమ్మతు చేయాల్సిన అవసరముంది.


పూడికతీత పనులు ఇక్కడే

          ప్రాంతం                           మీటర్లు

ఎస్టీ కాలనీ, సెంట్‌పాల్‌ పాఠశాల రోడ్డు వావిలాలపల్లి 235
మారుతీనగర్‌ సీవెరేజ్‌ డ్రైనేజీ 700
శ్రీదేవి ఆసుపత్రి ఎదురుగా నుంచి వీక్లీ మార్కెట్‌ వరకు 750
ముకరంపుర పరివార్‌ బేకరి నుంచి సాయికృష్ణ థియేటర్‌ 500
సాయికృష్ణ టాకీస్‌ నుంచి కరీంనగర్‌ ఫంక్షన్‌ హాల్‌ వరకు 500
రాంనగర్‌ పారమిత, సిద్ధార్థ స్కూల్‌ వైపు ఫిష్‌ మార్కెట్‌ 860
మంకమ్మతోట వాసర ఆసుపత్రి నుంచి మార్క్‌ఫెడ్‌ వరకు 800
గౌతమినగర్‌, అమీర్‌నగర్‌, కోతిరాంపూర్‌, కట్టరాంపూర్‌,
భగత్‌నగర్‌, దద్దిన్నమ్మకుంట డ్రెయినేజీలు 2500
దోబీఘాట్‌ జంక్షన్‌ నుంచి పొన్నం శ్రీనివాస్‌ ఇంటి వరకు 500
వాణినికేతన్‌ వెనుక నుంచి రెండో పోలీసుస్టేషన్‌,
ఆర్‌అండ్‌బీ క్రాస్‌ కల్వర్టు, లేబర్‌ అడ్డా వరకు 180
కెనాల్‌ సిల్ట్‌ జగిత్యాల రోడ్డు నుంచి గౌడ్స్‌ కాలనీ 500
వీక్లీ మార్కెట్‌ నుంచి వరహస్వామి దేవాలయం 1200
నయీం మసీదు నుంచి వయా హెల్త్‌ సెంటర్‌ 400
సాయిబాబా టెంపుల్‌ నుంచి గౌరిశెట్టికాంప్లెక్స్‌ 400
కెనాల్‌ డి-94 షెకాబీకాలనీ నుంచి జగిత్యాల రోడ్డు 700
కలెక్టరేట్‌ నుంచి అంబేడ్కర్‌ స్టేడియం 300
ఇందిరానగర్‌ జంక్షన్‌ నుంచి మంచిర్యాల చౌరస్తా 750


ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు

వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో చర్యలు ప్రారంభించాం. చిన్న, పెద్ద డ్రైనేజీల్లోని పూడికను తొలగించే పనులు వారం రోజుల్లో పూర్తి చేస్తారు. డ్రైనేజీలు మురికి నీరు వెళ్లేందుకు మాత్రమే. చెత్తా చెదారం ఎట్టి పరిస్థితిలో అందులో వేయొద్దు.

వై.సునీల్‌రావు, మేయర్‌, కరీంనగర్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని