logo

కొత్త పథకాలకే నిధులు!

బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు అప్పటి ప్రభుత్వం గోదావరి జలాలను ఎత్తిపోసేలా పథకాలను చేపట్టింది.

Published : 09 Jun 2023 04:54 IST

పాత ఎత్తిపోతలకు మరమ్మతుపై నిర్లక్ష్యం

రంగసాగర్‌లో నిరుపయోగంగా ఎత్తిపోతల పథకం గది

న్యూస్‌టుడే, సారంగాపూర్‌: బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు అప్పటి ప్రభుత్వం గోదావరి జలాలను ఎత్తిపోసేలా పథకాలను చేపట్టింది. బీర్‌పూర్‌ మండలంలోని రంగసాగర్‌, చిత్రవేణిగూడెం, రాయికల్‌ మండలంలోని జగన్నాథపూర్‌, కొత్తపేట, మల్లాపూర్‌ మండలాల్లో బీడు భూములకు సాగునీరు అందివ్వడమే లక్ష్యంగా 1988లో రూ.15 లక్షల చొప్పున నిధులు వెచ్చించి ఆయా గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు. అప్పట్లో అధికారుల నిర్లక్ష్యం, గుత్తేదారు అవినీతితో నాసిరకం పనులు, మోటార్లు బిగించారు. దీంతో మోటార్లు తరచూ కాలిపోవడం, పైపులైన్లు పగిలిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రారంభించిన ఏడాదిలోపే మూలనపడ్డాయి. రంగసాగర్‌లో తరచూ మరమ్మతుల పేరిట రూ.50 లక్షల వరకు నిధుల వృథా చేసినా ఏనాడు సాగునీరు అందలేదు. చిత్రవేణిగూడెంలోనూ పలుమార్లు మరమ్మతులు చేపట్టినా కొన్నేళ్లుగా పథకం నిరుపయోగంగా ఉంది. మరమ్మతులతో గుత్తేదారులకు లాభాలు వచ్చాయి కానీ తమకు ఒరిగిందేమీ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని కమ్మునూర్‌, మంగెళ, రేకులపల్లె, చిన్న కొల్వాయిలో నూతనంగా ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వానాకాలం వర్షాలకు గోదావరి వరద రావడంతో పథకాలు కొట్టుకుపోయాయి. వాటి మరమ్మతులకు ప్రభుత్వం రూ.273.96 లక్షలు మంజూరు చేయగా ప్రస్తుతం పనులు కొనసాగుతుండగా, పాత పథకాల ఊసేలేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


సొంతంగా మోటార్ల ఏర్పాటు..

గోదావరి చెంతనే నిండుగా పారుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో రైతులు సొంతంగా గోదావరి వద్ద మోటార్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో రైతు కిలోమీటర్ల పొడవునా సొంతంగా పొలాలకు పైపులైన్లు వేసుకుంటున్నారు. ఇందుకోసం ఒక్కో రైతు సుమారు రూ.3 లక్షల వరకు వ్యయం చేశారు. 20 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన సిమెంటు పైపులు శిథిలమైపోవడంతో, నూతన పైపులైన్లను ఏర్పాటు చేసుకోవడం భారంగా మారిందని రైతులు వాపోతున్నారు. అధికారులను కలిస్తే నిధులు సమీకరించుకోమంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


కుంటలు నింపినా చాలు.. -సతీష్‌, రంగసాగర్‌

ఇటీవల పలు గ్రామాల్లో వరదలకు కొట్టుకుపోయిన పథకాల మరమ్మతులకు నిధులు మంజూరు చేశారు. గతంలో ఏర్పాటు చేసిన పథకాలకు నిధులు మంజూరు చేయకపోవడం బాధాకరం. ఎత్తిపోతల పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురికావడంతో సొంతంగా మోటార్లు ఏర్పాటు చేసుకుంటున్నాం. కొంత మంది ఖర్చుకు భయపడి వ్యవసాయాన్నే వదిలేస్తున్నారు. కనీసం గ్రామంలోని కుంటలు, చెరువుల్లోకి నేరుగా నింపేలా చేస్తే వాటి ద్వారా సాగు చేసుకునే అవకాశముంది.


పనులు కొనసాగుతున్నాయి

-చక్రునాయక్‌, డీఈఈ

గోదావరి వరదకు కొట్టుకుపోయిన పలు పథకాల మరమ్మతులకు మాత్రమే నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఆయా పనులు కొనసాగుతుండగా, గతంలో ఉన్న వాటికి నిధులు మంజూరు కాలేదు. పాత పథకాలకు నిధులు మంజూరు చేసేలా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని