logo

లోలెవల్‌ వంతెన కష్టాలు ఇంకెన్నాళ్లో?

గంభీరావుపేట - లింగన్నపేట మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు లోలెవల్‌ వంతెన కష్టాలు తప్పడం లేదు.

Published : 09 Jun 2023 04:54 IST

మానేరు వాగుపై లోలెవల్‌ వంతెన

న్యూస్‌టుడే, గంభీరావుపేట: గంభీరావుపేట - లింగన్నపేట మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు లోలెవల్‌ వంతెన కష్టాలు తప్పడం లేదు. ఏళ్లుగా వరదలతో ఇబ్బందులు పడుతున్నామని.. ఇకనైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


ఇదీ పరిస్థితి

గంభీరావుపేట నుంచి లింగన్నపేటకు వెళ్లే దారిలో మానేరు వాగుపై గతంలో నిర్మించిన లోలెవల్‌ వంతెన ఉంది. అప్పటి మాజీ మంత్రి పాటి రాజం కృషితో లోలెవల్‌ వంతెనను నిర్మించారు. నాటి పరిస్థితులకు ఆ వంతెన సరిపోయింది కానీ.. కాలక్రమేణ వంతెన పూర్తిగా లోలెవల్‌ కావటంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ మానేరు నిండి మత్తడి దూకుతున్న సమయంలో వంతెనపై నుంచి వరద ఉద్ధృతంగా వెళ్తుండగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. గంభీరావుపేట నుంచి సిద్దిపేట, ముస్తాబాద్‌, కొత్తపల్లి, దుబ్బాక, లింగన్నపేటకు వెళ్లడానికి.. లింగన్నపేట నుంచి గంభీరావుపేట, మాచారెడ్డి, కామారెడ్డికి వెళ్లడానికి వీలులేకుండా పోతుండగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వంతెనపై వరద వెళ్లిన ప్రతీసారి ఇబ్బందులు పడుతున్నారు. చాలాసార్లు ప్రజాప్రతినిధులతో పాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోతోందని స్థానికులు వాపోతున్నారు. రెండు సంవత్సరాల క్రితం వంతెనపై వరద వెళ్లిన సమయంలో బస్సు వంతెనపై చిక్కుకుందని, తృటిలో ప్రాణాపాయం తప్పిందని గుర్తు చేసుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


రూ.17 కోట్లు మంజూరైనా..

ఇటీవల కురిసిన వర్షాలకు గతంలో ఎప్పుడూ లేనివిధంగా వంతెన పైనుంచి భారీగా వరద వెళ్లింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. స్థానిక భాజపా, అభావిప నాయకులు సైతం వంతెన నిర్మాణం చేయాలని ధర్నాలు చేశారు. దీంతో భారాస నాయకులు మంత్రి కేటీఆర్‌కు విన్నవించగా మంత్రి స్పందించి పైవంతెన నిర్మాణానికి గత సంవత్సరం డిసెంబర్‌లో రూ.17 కోట్ల నిధులను మంజూరు చేశారు. దీంతో భారాస నాయకులు సంబరాలు చేసుకుని ప్రస్తుతం ఉన్న వంతెన వద్ద సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. నిధులు మంజూరు చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే మాదిరిగా క్షేత్రస్థాయి పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. మొదటి దశ ఆన్‌లైన్‌ టెండర్‌ వంతెన నిర్మాణానికి ఒక్కరూ ముందుకు రాకపోవడంతో అధికారులు ఇటీవల రెండోసారి ఆన్‌లైన్‌ టెండర్‌ వేశారు. అయినా ఎవరూ ముందుకు రాలేదని అధికారులు చెబుతున్నారు. సొంత డబ్బులతో పనులు చేస్తున్నా డబ్బులు రాకపోతుండడంతో గుత్తేదారులు అనాసక్తి చూపుతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. టెండరు ప్రక్రియను త్వరగా పూర్తి చేసి వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


త్వరలోనే పనులు ప్రారంభం

- నరేందర్‌, ఆర్‌అండ్‌బీ ఏఈ

వంతెన నిర్మాణానికి రూ.17 కోట్ల నిధులతో పరిపాలన అనుమతులతో పాటు సాంకేతిక అనుమతులు వచ్చాయి. ఆన్‌లైన్‌లో టెండర్‌ ప్రక్రియ ప్రారంభించినా ఎవరూ ముందుకు రావటం లేదు. గుత్తేదారులతో మాట్లాడి త్వరగా టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపడుతాం.  


వంతెన నిర్మాణంలో జాప్యం తగదు

మాది కొతపల్లి గ్రామం. మా ఊరు నుంచి నిత్యం పలురకాల పనులపై గంభీరావుపేట మండల కేంద్రానికి ప్రజలు వెళ్తుంటారు. వర్షాలు కురిసిన సమయంలో మానేరు వాగు వచ్చినప్పుడు వంతెన మునిగి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రూ.17 కోట్ల నిధులు మంజూరు అయినట్లు చెబుతున్నా ఇప్పటికీ సమస్య పరిష్కారానికి మోక్షం లేదు. ప్రతీ వర్షాకాలం ప్రజల ఇబ్బందుల దృష్ట్యా మంత్రి కేటీఆర్‌ స్పందించి పనులు వేగంగా పూర్తిచేసేలా చూడాలి.

గౌటి గణేశ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని